వణికిన బ్యాంకాక్ లో ఎమర్జెన్సీ... లాక్ డౌన్ ఎందుకంటే..?
తాజాగా వరుసగా సంభవించిన వరుస భూకంపాలతో బ్యాంకాక్ నగరం వణికిపోయింది.
By: Tupaki Desk | 28 March 2025 11:26 AMబ్యాంకాక్, మయన్మార్ లను వరుస భూకంపాలు వణికించాయి. మయన్మార్ లో 12 నిమిషాల వ్యవధిలో రెండు వరుస భూకంపాలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై ఈ భారీ భూకంపాల తీవ్ర 7.7గా నమోదైంది. ఇదే సమయంలో.. పొరుగున ఉన్న థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో 6.4, 7.3 తీవ్రత్రతతో రెండు వరుస భూకంపాలు సంభవించడంతో ప్రజలు భయాందోళనలకు గురై.. ఇళ్ల నుంచి పరుగులు తీశారు.
ఈ భారీ భూప్రకంపనల దాటికి అనేక భవనాలు ఊగిపోగా.. మరికొన్ని భవనాలు నేలమట్టమయ్యాయి. ఇదే సమయంలో.. ఓ భారీ భవంతి పై అంతస్తులో ఉన్న స్విమ్మింగ్ పూల్ లోని నీరు కిందకు పడుతున్న దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో నిర్మాణంలో ఉన్న 30 అంతస్తుల ఓ భవంతి పేకమేడలా కూలిపోయింది. ఈ సమయంలో థాయిలాండ్ ప్రధాని అత్యవసర స్థితిని ప్రకటించారు.
అవును... తాజాగా వరుసగా సంభవించిన వరుస భూకంపాలతో బ్యాంకాక్ నగరం వణికిపోయింది. ఈ సమయంలో ఇప్పటికే మృతుల సంఖ్య 40 దాటినట్లు కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో థాయిలాండ్ ప్రధాని షినవత్ర.. ఎమర్జెన్సీ పరిస్థితిని ప్రకటించారు. మరోపక్క కూలిన భవనాల శిథిలాల కింద ఇంకా కార్మికులు ఉండి ఉంటారని అంటున్నారు. దీంతో.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
ప్రస్తుతం సహాయక చర్యలను ప్రధాని షినవత్ర దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మరోపక్క... మరో భూమి కంపించే అవకాశం ఉందనే అంచనాల నేపథ్యంలో అధికారులతో బ్యాంకాక్ లోని భవనాలను ఖాళీ చేయిస్తున్నారు. ఇదే సమయంలో.. మెట్రో, రైలు నిలిపేశారు. విమానాశ్రయం దెబ్బ తినడంతో సర్వీసులను నిలిపేసి లాక్ డౌన్ ప్రకటించారు.
కాగా.. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 1:30 గంటలకు బ్యాంకాక్ లో ప్రకంపనలు సంభవించాయి. ఆ సమయంలో పలు భవనాల్లో అలారం మోగడంతో ప్రజలు బయటకు పరుగులు తీయడం కనిపించింది. మయన్మార్ లోని మోనివా నగరానికి తూర్పున 50 కి.మీ. దూరంలో 10 కి.మీ. లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
ఈ సమయంలో థాయిలాండ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ మధ్యాహ్నం సెషన్ కు అన్ని వాణిజ్య కార్యకలాపాలను నిలిపేసింది. ఈ సందర్భంగా... భూకంపం తర్వాత థాయిలాండ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అన్ని వాణిజ్య కార్యకలాపాలను వెంటనే నిలిపివేసినట్లు బోర్స్ ఆపరేటర్ తన వెబ్ సైట్ లో తెలిపారు.
స్పందించిన ప్రధాని నరేంద్ర మోడీ!:
ఇలా మయన్మార్, థాయిలాండ్ దేశాలను వరుస భూకంపాలు వణికించిన నేపథ్యంలో.. భారత ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా స్పందించారు. ఇందులో భాగంగా.. అక్కడ పరిస్థితులపై ఆందోళనగా ఉందని.. వారికి అవసరమైన సాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని.. అక్కడి ప్రజలంతా సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు మోడీ తెలిపారు.