ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ పవన్ - బాబు భేటీ.. తేలిందేంటి?
ఓపక్క ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ.. మరోవైపు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ దాఖలుకు సమయం దగ్గర పడుతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 4 March 2025 10:21 AM ISTఓపక్క ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ.. మరోవైపు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ దాఖలుకు సమయం దగ్గర పడుతున్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల వెల్లడి రోజునే ఏపీలోని ఐదు ఎమ్మెల్సీ స్థానాల (ఎమ్మెల్యే కోటాలో ఎన్నికయ్యే)కు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 10 లోపు నామినేషన్లు దాఖలు చేసుకోవటం.. 11న నామినేషన్ల పరిశీలన.. 13న నామినేషన్ల ఉపసంహరణకు వీలుగా షెడ్యూల్ విడుదలైంది.
జంగా క్రష్ణమూర్తి.. దువ్వారపు రామారావు.. బీటీ నాయుడు.. అశోక్ బాబు.. యనమల రామక్రష్ణుడుల పదవీ కాలం ముగియనుంది. వీరి పదవీ కాలం ఈ నెల 29న ముగుస్తుంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన సీట్ల లెక్కల్ని తేల్చుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఏపీ అసెంబ్లీలోని ముఖ్యమంత్రి చంద్రబాబు ఛాంబర్ కు జనసేన అధినేత.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వచ్చారు. దాదాపు గంట పాటు భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో పాటు.. రానున్న రోజుల్లో చేపట్టే కార్యక్రమాల గురించి చర్చ జరిగినట్లుగా చెబుతున్నారు. వాస్తవానికి ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సీట్ల సర్దుబాటు లెక్కలే ఎక్కువగా జరిగినట్లు తెలుస్తోంది. ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు కూటమి ప్రభుత్వంలోని మూడు పార్టీలకు కేటాయింపులపై ప్రధానంగా చర్చ జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్న ఐదు స్థానాల్లో టీడీపీ.. జనసేనల అభ్యర్థుల్ని బరిలోకి దించేందుకు వీలుగా చర్చ జరిగినట్లుగా చెబుతున్నారు. కూటమి సర్కారులోని మూడో పక్షమైన బీజేపీకి తర్వాతి దశలో అవకాశం కల్పించాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఐదు స్థానాల్లో మూడు టీడీపీ అభ్యర్థులు.. రెండు జనసేనకు కేటాయింపులు జరిపేలా చర్చలు జరుగుతున్నాయి. నిజానికి టీడీపీ నాలుగు.. జనసేనకు ఒక్క స్థానమే కేటాయించే వీలు ఉన్నప్పటికి.. పవన్ విషయంలో చంద్రబాబు ఉదారంగా ఉండటం కనిపిస్తోంది. మిత్రపక్షమైనప్పటికి.. అనవసర జోక్యాలు తక్కువగా చేసుకుంటున్న పవన్ మీద చంద్రబాబు ప్రత్యేక అభిమానం ఉన్నట్లుగా చెబుతున్నారు.
ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం టీడీపీకి మూడు స్థానాలకే అభ్యర్థుల్ని ఖరారు చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. అనూహ్య పరిస్థితుల ఏర్పడితే తప్పించి.. నాలుగో స్థానం అభ్యర్థి ఉండరంటున్నారు. అదే సమయంలో జనసేనకు ఉన్న ఒత్తిడి నేపథ్యంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖరారు అయ్యే దిశగా సమావేశం జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే.. వీరి మధ్య జరిగిన సమావేశ వివరాల్ని వెల్లడైనప్పటికీ.. ఎమ్మెల్సీ సీట్ల లెక్కల అంశంపై మాత్రం అధికారిక సమాచారం బయటకు రాలేదు. రెండుమూడు రోజుల్లో దీనిపై ప్రకటన వెలువడే వీలుందన్న మాట వినిపిస్తోంది.