రూ.100 కోట్ల అక్రమార్కుడు(?) అరెస్టు.. గులాబీ తోటలో కొత్త కలకలం?
అదే సమయంలో ఎంఏయూడీలో డైరెక్టర్ హోదాలో వాటికి ఆయనే జీవోలు ఇచ్చేవారు
By: Tupaki Desk | 25 Jan 2024 9:21 AM GMTతెలంగాణలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కేసీఆర్ ప్రభుత్వంలో కీలక పదవిలో ఉంటూ.. ప్రస్తుతం అప్రాధాన్య పోస్టులో ఉన్న (తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ) కార్యదర్శి ఎస్.బాలక్రిష్ణ అరెస్టు కావటం సంచలనంగా మారింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయన ఈ తెల్లవారుజామున (గురువారం) అరెస్టు అయ్యారు. బుధవారం ఏసీబీ నిర్వహించిన దాడుల్లో బాలక్రిష్ణకు చెందిన రూ.100 కోట్లకు పైగా ఆస్తుల్ని గుర్తించినట్లుగా చెబుతున్నారు. మణికొండలోని ఆయన నివాసంలో రూ.40 లక్షల క్యాష్ లభించినట్లుగా తెలుస్తోంది.
ఇది సరిపోవన్నట్లుగా 70 ఎకరాలకు చెందిన పత్రాలు.. పెద్ద ఎత్తున ఖరీదైన ఐఫోన్లు.. 80కు పైగా ఖరీదైన వాచ్ లతో పాటు భారీ ఎత్తున బంగారం..కేజీల కొద్దీ వెండినిసోదాల సందర్భంగా గుర్తించినట్లుగా చెబుతున్నారు. గత ప్రభుత్వంలో హెచ్ఎండీఏ ప్రణాళిక విభాగం డైరెక్టర్ గా.. పురపాలన.. పట్టణాభివ్రద్ధి విభాగంలో ఇన్ ఛార్జి డైరెక్టర్ గా కొనసాగారు. హెచ్ఎండీఏ నుంచి ఫైల్స్ ను ఆయనే పంపేవారు.
అదే సమయంలో ఎంఏయూడీలో డైరెక్టర్ హోదాలో వాటికి ఆయనే జీవోలు ఇచ్చేవారు. రంగారెడ్డి.. మేడ్చల్.. మెదక్.. భువనగిరి.. సంగారెడ్డి.. ఇలా తెలంగాణ వ్యాప్తంగా కీలకమైన భూములకు సంబంధించిన అనుమతుల్లో ఆయన భారీగా అక్రమాలకు పాల్పడినట్లుగా చెబుతారు. హెచ్ఎండీఏ పరిధిలోని జోన్లలో నిబంధనల్ని అసరాగా చేసుకొని వందల అప్లికేషన్లకు ఆమోదముద్ర వేసేందుకు భారీగా వసూళ్లు చేసినట్లుగా చెబుతారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా ఆయనపై ఏసీబీ దాడుల వ్యవహారం విపక్ష బీఆర్ఎస్ లో హాట్ టాపిక్ గా మారింది. గత ప్రభుత్వంలో కీలక భూమిక పోషించిన మాజీ మంత్రికి ఆయన అత్యంత సన్నిహితుడని చెబుతారు. బాలక్రిష్ణ ఇంటిపైఏసీబీ సోదాలు నిర్వహించిన ఎపిసోడ్ గులాబీ పార్టీలో కలకలాన్ని రేపటమే కాదు.. హాట్ టాపిక్ గా మారింది. ఒక అధికారి ఇంట్లోనే ఇంత భారీగా ఆస్తులు పోగేసి ఉంటే.. అతడ్ని నడిపించిన కీలక నేతల పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది. తాజాగా ఆయన అరెస్టు.. రానున్న రోజుల్లో మరిన్ని సంచలనాలకు కారణమవుతుందన్న మాట వినిపిస్తోంది.