Begin typing your search above and press return to search.

చదవటం లేదని పిల్లల్ని చంపి.. తండ్రి సూసైడ్

తాజాగా కాకినాడలో చోటు చేసుకున్న ఘోరం గురించి తెలిస్తే షాక్ కు గురికావాల్సిందే.

By:  Tupaki Desk   |   15 March 2025 9:48 AM IST
చదవటం లేదని పిల్లల్ని చంపి.. తండ్రి సూసైడ్
X

వినేందుకు సైతం ఇష్టపడని దారుణాలు ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి వాటికి పాల్పడుతున్నోళ్లు ఎవరో కసాయిలు అనుకుంటే తప్పులో కాలేసినట్లే. కంటికి రెప్పలా పిల్లల్ని చూసుకుంటూ.. వారు చేసే తప్పుల్ని సరిదిద్దేందుకు అహరహం శ్రమించాల్సిన తల్లిదండ్రులు.. తమ పిల్లల పాలిట మయకింకరులు అవుతున్నారు. తాజాగా కాకినాడలో చోటు చేసుకున్న ఘోరం గురించి తెలిస్తే షాక్ కు గురికావాల్సిందే.

పిల్లలు సరిగా చదవటం లేదని.. పోటీ ప్రపంచంలో రాణించక.. వెనకబడిపోతున్నారన్న ఉద్దేశంతో అత్యంత కిరాతకంగా పిల్లల్ని చంపేసి.. తాను చనిపోయిన ఒక తండ్రి ఉదంతం అవాక్కు అయ్యేలా చేస్తోంది. కేంద్రప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ.. ఇల్లు.. చక్కటి కుటుంబాన్ని పక్కన పెట్టేసి దారుణానికి పాల్పడిన ఈ ఉదంతం కాకినాడలో చోటు చేసుకుంది. హోలీ పండుగ వేళ చోటు చేసుకునన ఈ విషాదంలోకి వెళితే..

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన చంద్రకిశోర్ కాకినాడ జిల్లా వాకలపూైడిలోని ఓఎన్ జీసీ కార్యాలయంలో అసిస్టెంట్ అకౌంటెంట్ గా పని చేస్తున్నాడు. కాకినాడలో ఒక ఫ్లాట్ లో ఉంటున్నాడు. అతడికి భార్య తనూజ.. ఇద్దరు పిల్లలు (ఒకరు ఒకటో తరగతి, రెండో వారు యూకేజీ). వారిద్దరు సరిగా చదవటం లేదని ఈ మధ్యనే స్కూల్ మాన్పించారు. హోలీ వేళ తమ ఆఫీసులో నిర్వహించే హోలీ వేడుకలకు ఫ్యామిలీని తీసుకెళ్లాడు.

వేడుకల మధ్యలో ఇద్దరు పిల్లల యూనిఫాం కొలతలు తీయించేందుకు టైలర్ వద్దకు తీసుకెళుతున్నానని భార్యకు చెప్పి.. ఆమెను ఆఫీసులో ఉంచేసి పిల్లల్ని తనతో తీసుకెళ్లాడు. ఎంతసేపటికి రాకపోవటం.. ఫోన్ చేస్తే ఎత్తకపోవటంతో తోటి ఉద్యోగులతో కలిసి తనూజ ఇంటికి చేరుకున్నారు.ఇంటి కిటికీలో నుంచి చూస్తే.. భర్త ఫ్యాన్ కు ఉరి వేసుకొని చనిపోయి ఉండటాన్ని చూసి షాక్ తిన్నారు.

బలవంతంగా తలుపులు తీసి లోపలకు వెళ్లగా.. పిల్లలు ఇద్దరిని కాళ్లు చేతులు కట్టేసి నీళ్లలో ఉన్న బకెట్ లలో తలలు ముంచేసి ఉన్న సీన్ చూసినంతనే షాక్ తో కుప్పకూలిపోయారు. పోటీ ప్రపంచంలో పిల్లలు పోటీ పడలేకపోతున్నారని.. వారికి ఫ్యూచర్ లేదని.. అందుకే ఇద్దరు పిల్లల్ని చంపేసి.. తాను చనిపోతున్నట్లుగా సూసైడ్ నోట్ లో రాసినట్లుగా గుర్తించారు. ఈ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమ సోదరుడికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని.. ఆస్తులు ఉన్నాయని.. ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని మృతుడి బ్రదర్ వాపోతున్నారు. ఎంత పిల్లలు చదువులో వెనుకబడిపోతే మాత్రం.. ఇలా చంపేసి.. చచ్చిపోవటం ఏమిటి? అంటూ ఈ ఉదంతం గురించి తెలిసిన వారంతా షాక్ కు గురవుతున్నారు. పోలీసుల విచారణలో మరిన్ని అంశాలు వెలుగుచూస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.