రెండు తెలుగు రాష్ట్రాల్లో డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కువవుతున్నాయా ?
ఇక ఏపీలో చూసినా తెలంగాణాలో చూసినా గతంలో జరిగినవే ఇపుడు మరింత ఎక్కువ మోతాదులో రాజకీయంగా సాగుతున్నాయని అంటున్నారు.
By: Tupaki Desk | 19 Dec 2024 11:30 PM GMTఉమ్మడి ఏపీలో రాజకీయం వేరు. విభజన ఏపీలో పాలిటిక్స్ వేరుగా ఉంది. గత పదేళ్ళుగా చూస్తే రాజకీయం తీరే వేరుగా ఉంది. ప్రత్యర్థుల మీద రాజకీయ సమరం చేయడానికి అత్యధిక సమయం కేటాయిస్తున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. గతంలో ఉమ్మడి ఏపీలో ఇలా అయితే లేదు. ఎన్నికల తరువాత కూడా రాజకీయ విమర్శలు ఉన్నా అవి పీక్స్ కి పోలేదని గుర్తు చేసుకునే వారు.
ఏదైనా విమర్శ చేసినా అది పూర్తిగా పాలసీ పరంగానే ఉంటూ వచ్చేది. ఇక ప్రత్యర్ధులను టార్గెట్ చేసి మరీ దూకుడు చేయడం అన్నది లేదు అంటున్నారు. ఇక ఏపీలో చూసినా తెలంగాణాలో చూసినా గతంలో జరిగినవే ఇపుడు మరింత ఎక్కువ మోతాదులో రాజకీయంగా సాగుతున్నాయని అంటున్నారు.
ముఖ్యనగా డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కువ అయింది అన్న మాట ప్రజల నుంచి వినిపిస్తోంది. ప్రజల దృష్టిని ఏమార్చేందుకే ఇలా చేస్తున్నారు అని కూడా అంటున్నారు. దాని వల్ల రెండిందాల లాభంగా ఉంటుందని ఒకటి ప్రత్యర్ధులను ఇరికించడం ప్రజలను తమ వైపు చూడకుండా ఫోకస్ మార్చడం అని అంటున్నారు. ఇక 2024లో చూస్తే ఈ డైవర్షన్ పాలిటిక్స్ రెండు తెలుగు రాష్ట్రాలలో అధికం అయ్యాయని అంటున్నారు.
ఎంతలా అంటే గుక్కతిప్పుకోలేనంతంగా అని చెబుతున్నారు. ఏపీలో ఆరు నెలల టీడీపీ కూటమి పాలన పూర్తి అయింది. వరసబెట్టి అనేక ఇష్యూస్ వస్తున్నాయి. జూన్ 12న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఒక నెల పాటు శ్వేత పత్రాలు రిలీజ్ పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ నడిపారు.
ఆ తరువాత రాజకీయ ప్రత్యర్ధుల మీద కేసులతో వేధింపులు ఎక్కువ అయ్యాయని వైసీపీ ఆరోపిస్తూ ఢిల్లీలో ధర్నా చేసింది. ఇది కూడా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే అని కూడా ఆరోపించింది. ఇక అనూహ్యంగా వరదలు రావడంతో విజయవాడ బ్రిడ్జిని బోటు తో ఢీ కొట్టి విధ్వంసం చేయబోయారు అంటూ ఒక ఎపిసోడ్ హాట్ హాట్ గా నడచింది.
అది దాటి ముందుకు వస్తే తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో కల్తీ జరిగింది అన్నది ఏకంగా దేశం మొత్తాన్నే కుదిపేసింది. దాంతో కొన్నాళ్ళ పాటు ఇదే ఇష్యూ హాట్ హాట్ గా సాగిపోయింది. ఇది పూర్తి అవుతూనే సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు అంటూ వేది వేడి రాజకీయం స్టార్ట్ అయింది. దీని మీద కూడా వైసీపీ వర్సెస్ కూటమిగా రాజకీయ యుద్ధం సాగింది.
అమరావతిని రాజధానిగా లేకుండా చేశారని పోలవరం సర్వనాశనం చేశారు అంటూ మరో రాజకీయం కూడా సైమల్టేనియస్ గా సాగుతూ వచ్చింది అని వైసీపీ ఆరోపించింది. ఇదిలా ఉంటే అదానీ ముడుపుల కేసులో జగన్ పాత్ర ఉందని ఆరోపిస్తూ ఏపీలో కొన్నాళ్ల పాటు ఆరోపణల పర్వం సాగింది. ఇలా ఏపీలో డైవర్షన్ పాలిటిక్స్ పీక్స్ లో ఉందని అంటున్నారు.
ఈక్ తెలంగాణాలో ఏడాది పాలనను పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా డైవర్షన్ పాలిటిక్స్ కి తెర లేపుతోంది అని అంటున్నారు. కీలకమైన అంశాలు జనంలో చర్చకు రాకుండా ఇలా చేస్తున్నారు అని బీఆర్ ఎస్ అంటోంది. ఇందులో భాగంగా హైడ్రా పేరిట కూల్చివేతలతో మొదలెట్టి మూసీ నదీ సుందరీకరణ అంటూ రాజకీయంగా కాక పుట్టించడం దాకా అన్నీ అలాగే ఉన్నాయని అంటున్నారు.
కొద్ది రోజుల క్రితం తెలుగు తల్లి విగ్రహం డిజైన్ విషయంలో కూడా రాజకీయం దూకుడుగానే అటూ ఇటూ సాగింది. దీని మీద అధికార విపక్షాలు విమర్శలు చేసుకున్నారు. రాజకీయ రచ్చ సాగింది. ఇపుడు చూస్తే ని అరెస్ట్ చేయడానికి ప్రతిపక్షాన్ని టార్గెట్ చేశారని గులాబీ పార్టీ అంటోంది. రేపో నేడో కేటీఆర్ అరెస్ట్ అయితే కొన్నాళ్ళ పాటు అదే సబ్జెక్ట్ గా ఉంటుందని అంటున్నారు. ఇవన్నీ చూసిన వారు అంటున్నది ఏంటి అంటే ప్రజా సమస్యల కంటే డైవర్షన్ పాలిటిక్స్ కే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తోంది అని.
ఏపీలో చూసినా తెలంగాణాలో చూసినా అధికారంలోకి రావడానికి తెలుగుదేశం కూటమి కాంగ్రెస్ పార్టీ రెండూ ఎన్నో హామీలు గుప్పించారు. రేవంత్ రెడ్డి ఏడాది పాలన పూర్తి అయిన సందర్భంగా హామీలు నెరవేర్చినవి ఎన్ని అని చూస్తే ఇంకా చాలా మిగిలి ఉన్నాయని అంటున్నారు. దాంతో వాటి కోసం ఆశగా జనాలు చూస్తున్నారు. అయితే వాటి నుంచి జనాలను ఏమరపరచేందుకే ఇవన్నీ అని అంటున్నారు.
ఇక ఏపీలో సూపర్ సిక్స్ అంటూ అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి రెండంటే రెండు హామీలను మాత్రమే గడచిన ఆరు నెలలలోగా నెరవేర్చింది. మిగిలినవి అలాగే ఉన్నాయి. దాంతో వాటి గురించి జనాలు కోటి ఆశలు పెట్టుకున్నారు. కానీ ఎక్కడా అవి చర్చనీయాంశం కాకుండానే ఈ విధంగా నెలకో కొత్త అంశాన్ని తెచ్చి డైవర్షన్ పాలిటిక్స్ కి తెర తీస్తున్నారు అని అంటున్నారు. మరి ఇదే కనుక నిజమైతే మాత్రం పుణ్యకాలాలు ఇందులోనే కలసిపోతాయని జనాల ఆశలు నీరుకారిపోతాయని అంటున్నారు.