తండ్రి అంటే ఈయనే.. విడాకులు తీసుకున్న కుమార్తెకు మేళతాళాలతో ఊరేగింపు!
సాధారణంగా కుటుంబంలో ఆడపిల్ల ఉందంటే పెళ్లి చేయగానే తమ బరువు బాధ్యతలు తీరిపోయాయని తల్లిదండ్రులు భావిస్తుంటారు
By: Tupaki Desk | 18 Oct 2023 5:51 AM GMTసాధారణంగా కుటుంబంలో ఆడపిల్ల ఉందంటే పెళ్లి చేయగానే తమ బరువు బాధ్యతలు తీరిపోయాయని తల్లిదండ్రులు భావిస్తుంటారు. ఇక ఆడపిల్ల అక్కడ (అత్తింటి వారు) పిల్లే కానీ ఇక్కడ (తల్లిదండ్రుల) పిల్ల కాదని భావించేవారూ ఉన్నారు. అత్తమామలు, భర్త, అతడి ఇతర కుటుంబ సభ్యులు హింసిస్తున్నారని తమ కుమార్తె ఫిర్యాదు చేసినా సర్దిచెప్పే తల్లిదండ్రులే ఉంటారు.
కానీ ఇక్కడ ఒక తండ్రి ఇందుకు విరుద్ధంగా విడాకులు తీసుకోవాలని భావించిన తన కుమార్తె నిర్ణయాన్ని స్వాగతించాడు. అంతేకాకుండా అత్తింటి వారి నుంచి తన కుమార్తెకు మేళతాళాలతో ఊరేగింపు జరిపి తన ఇంటికి తీసుకొచ్చాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది. ఆ తండ్రి నిర్ణయాన్ని అంతా సమర్థిస్తుండటం విశేషం.
ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. జార్ఖండ్ రాజధాని రాంచీలో ప్రేమ్ గుప్తా అనే వ్యక్తి తన కుటుంబంతో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో గతేడాది ఏప్రిల్ లో తన కుమార్తె సాక్షి గుప్తాకు సచిన్ కుమార్ అనే వ్యక్తితో ఘనంగా వివాహం చేశాడు. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకే సచిన్ కుమార్ నుంచి సాక్షి గుప్తాకు వేధింపులు మొదలయ్యాయి.
అంతేకాకుండా గతంలోనే సచిన్ కుమార్ కు పెళ్లి అయ్యింది. అయినప్పటికీ అతడితో బంధం కొనసాగించాలనే సాక్షి గుప్తా నిర్ణయించుకుంది. అయితే భర్త సచిన్ కుమార్ తోపాటు అత్తమామలు వేధింపులు ఎక్కువ అయ్యేసరికి ఇక అతడితో కలసి ఉండటం సాధ్యం కాదని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఆమె తన తండ్రి ప్రేమ్ గుప్తాకు చెప్పారు. తన కుమార్తె నిర్ణయాన్ని తండ్రి, ఇతర కుటుంబ సభ్యులు స్వాగతించారు.
తన కుమార్తె సాక్షిని అత్తింటి వారి నుంచి ఇంటికి తీసుకొచ్చేందుకు ప్రేమ్ గుప్తా ఘనంగా ఏర్పాట్లు చేశారు. టపాసులు కాలుస్తూ తన కుమార్తెను పుట్టింటికి తీసుకొచ్చారు. మేళతాళాలతో ఆమెను ఊరేగిస్తూ తమ ఇంటికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కుమార్తెలు ఎంతో విలువైనవారని, అత్తింట్లో వారికి ఇబ్బందులు ఎదురైతే గౌరవంతో పుట్టింటికి తీసుకురావాలని ప్రేమ్ గుప్తా చెప్పడం విశేషం.
మరోవైపు సచిన్ కుమార్ తో విడాకులు ఇప్పించాలని సాక్షి న్యాయస్థానంలో కేసు దాఖలు చేసింది. అక్టోబర్ 15న జరిగిన ఈ ఊరేగింపు వీడియోను ప్రేమ్ గుప్తా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది.