'కట్టప్ప' కూతురు డీఎంకేలోకి ఎంట్రీ
ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది. సీనియర్ సినీ నటుడైనప్పటికీ.. ఒక్క సినిమాతో అందరూ ఆయన్ను కట్టప్పగా గుర్తించటం తెలిసిందే
By: Tupaki Desk | 20 Jan 2025 6:27 AM GMTఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది. సీనియర్ సినీ నటుడైనప్పటికీ.. ఒక్క సినిమాతో అందరూ ఆయన్ను కట్టప్పగా గుర్తించటం తెలిసిందే. సాధారణంగా ఒక బ్లాక్ బస్టర్ సినిమా నటించి పేరు తెచ్చుకుంటే.. ఆ సినిమా పేరు సదరు నటుడి ఇంటి పేరుగా మారటం తెలిసిందే. అయితే.. అప్పటికే సీనియర్ నటుడిగా వందలాది సినిమాలు చేసిన తర్వాత తాను చేసిన ఒక సినిమాతో కొత్త ఇమేజ్ రావటం చాలా అరుదు. అలాంటి అనుభవం ఎదురైంది సీనియర్ నటుడు సత్యరాజ్.. అలియాస్ కట్టప్ప.
తాజాగా ఆయన కుమార్తె వార్తల్లోకి వచ్చారు. అది కూడా రాజకీయాలకు సంబంధించి. పోషకాహార నిపుణురాలిగా పేరున్న దివ్యా సత్యరాజ్ తమిళనాడు అధికారపక్షం డీఎంకేలో చేరారు. ఆదివారం పార్టీ హెడ్డాఫీసులో జరిగిన కార్యక్రమంలో ఆమె పార్టీ అధ్యక్షుడు.. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ సమక్షంలో ఆమె డీఎంకేలో చేరారు. ఆమెకు ప్రాథమిక సభ్యత్వాన్ని ఆయనే స్వయంగా అందించారు.
దివ్య సత్యరాజ్ విషయానికి వస్తే ఆమె స్కూల్ పిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు అందించే మధ్యాహ్నా భోజన పథకాన్ని అమలు చేసే అక్షయ పాత్ర ఫౌండేషన్ ఎన్జీవోకు గుడ్ విల్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. పార్టీలో చేరే వేళలోనూ.. పార్టీ జెండాను పోలి ఉండే రంగులతో ఉన్న చీరను ఆమె ధరించటం ఆసక్తికరంగా మారింది. సత్యరాజ్ సైతం మొదట్నించి డీఎంకేకు అనుకూలంగా ఉంటారన్న పేరుంది. పార్టీ సానుభూతిపరుడిగా వ్యవహరిస్తున్న వైనం తెలిసిందే.
అలాంటిది తాజాగా ఆయన కుమార్తె డీఎంకేలో చేరటం.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వటం ఆసక్తికర అంశంగా చెప్పాలి. ఆమె పార్టీలో చేరటానికి ముఖ్యమంత్రే స్వయంగా ప్రోగ్రాం పెట్టం చూస్తే.. పార్టీలోఆమెకు ఇవ్వనున్న ప్రాధాన్యతను ఇది స్పష్టం చేస్తుందని చెప్పాలి. దివ్యా సత్యరాజ్ పార్టీలో చేరే వేళలో.. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో పాటు పార్టీ ట్రెజరర్ కం ఎంపీ బాలు.. ఇతర నేతలు పలువురు ఉన్నారు. మరి.. దివ్యా సత్యరాజ్ ఎంట్రీతో పార్టీలో ఆమెకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారు? ఆమె ఏమేం చేయనున్నారు? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.