ఊహించిందే జరిగింది.. ఢిల్లీని వణికించిన దీపావళి
కానీ.. చాలా వరకు ప్రజలు ఆ రూల్స్ పట్టించుకోలేదు. ఫలితంగా ఢిల్లీ పరిసరాలతోపాటు చాలా చోట్ల గాలి నాణ్యత పూర్తిగా దిగజారింది.
By: Tupaki Desk | 1 Nov 2024 5:39 AM GMTదేశ రాజధాని ఢిల్లీని ఏటా వాయుకాలుష్యం ఇబ్బంది పెడుతూనే ఉంది. ఏటా అక్కడి ప్రజలు శ్వాషకోస సంబంధిత వ్యాధుల బారిన పడుతూనే ఉన్నారు. వాయుకాలుష్యం వల్ల బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. అంతెందుకు... సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సైతం ఇటీవల ఢిల్లీలోని వాయు కాలుష్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు. వాయుకాలుష్యంగా వల్ల తన మార్నింగ్ వాక్ మానుకున్నట్లుగా వెల్లడించారు. ఆయన వ్యాఖ్యల వల్లే అర్థం చేసుకోవచ్చు అక్కడి పరిస్థితి ఎలా ఉందో.
వాయుకాలుష్యంగా వల్ల వాహనాలపై ప్రయాణాలు కూడా సాధ్యపడడం లేదు. కనీసం నచుకుంటూ వెళ్దామనుకుంటున్నా రోగాల బారిన పడాల్సి వస్తుందేమోనన్న భయం వెంటాడుతోంది. ఏటా గాలిలో నాణ్యత పడిపోతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతూనే ఉన్నారు. ఇక ఏటా దీపావళి వచ్చిందంటే ఆ కాలుష్యాన్ని ప్రజలు భరించలేని పరిస్థితే వస్తోంది.
అయితే.. వాయుకాలుష్యం కారణంగా ఢిల్లీలో టపాకాయలు పేల్చడాన్ని నిషేధించారు. ఎప్పటిలాగే ఈసారి కూడా నిబంధనలు విధించారు. కానీ.. చాలా వరకు ప్రజలు ఆ రూల్స్ పట్టించుకోలేదు. ఫలితంగా ఢిల్లీ పరిసరాలతోపాటు చాలా చోట్ల గాలి నాణ్యత పూర్తిగా దిగజారింది. ఊహించినట్లే.. భయపడినట్లే ఢిల్లీ మరోసారి ప్రమాదంలో చిక్కుకుంది. పొగమేఘాలు ఆకాశాన్ని కమ్ముకోగా.. విషపూరితమైన గాలిని పీల్చుకునే పరిస్థితి వచ్చింది. దీపావళి వేళ బాణసంచా కాల్చవద్దని ఎంత మొత్తుకున్నా.. ప్రజలు పట్టించుకోకపోవడంతో ఈ దుస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఢిల్లీ ఏకంగా గ్యాస్ ఛాంబర్‌ను తలపిస్తోంది.
ఢిల్లీలో ఉదయం 5.30 గంటలకు అక్కడి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 700 కంటే ఎక్కువగా నమోదు కావడం ఆందోళన కలిగించే అంశం. పలు ప్రాంతాల్లో పొగమంచు నిండిపోయింది. రోడ్లు కూడా కనిపించకుండా పోయాయి. రాజధానిలోని ఆనంద్ విహార్‌లో 740, గురుగ్రామ్‌లో 185, సిరిఫోర్ట్‌లో 480, డిఫెన్స్‌కాలనీలో 631, నోయిడాలో 332, షహదరలో 183, నజాఫ్‌ఘర్లో 282, పట్‌పర్గంజ్‌లో 513 పాయింట్లకు క్వాలిటీ పడిపోయింది. దీపావళికి ముందు 400 ఉన్న ఏక్యూఐ ఇప్పుడు 700 దాటింది. మెట్టల దగ్ధం, వాహనాల నుంచి వచ్చే పొగ, దీపావళి క్రాకర్స్ వెరసి ఢిల్లీని మరోసారి డేంజర్ జోన్‌లోకి నెట్టేసింది.