ధగధగ మెరిసిపోతున్న అయోధ్య... రెండు గిన్నీస్ రికార్డులు!
అవును... సుమారు 500 ఏళ్ల తర్వాత బలరాముడు కొలువుదీరిన అయోధ్యలో దీపావళి సంబరాలు కనులపండుగగా జరిగాయి.
By: Tupaki Desk | 31 Oct 2024 3:58 AM GMT"ఆయుష్మాన్ భారత్ వయ వందన" పథకం ప్రరంభోత్సవ కార్యక్రమంలో మోడీ చెప్పినట్లు ఈ సారి జరిగే దీపావళి చాలా ప్రత్యేకమైందనే చెప్పాలి. అందుకు కారణం... సుమారు 500 ఏళ్ల తర్వాత అయోధ్య రామాలయంలో ఈసారి దీపాలు వెలిగించారు! బలరాముడు కొలువుదీరిన అయోధ్యలో బుధవారం రాత్రి దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి.
అవును... సుమారు 500 ఏళ్ల తర్వాత బలరాముడు కొలువుదీరిన అయోధ్యలో దీపావళి సంబరాలు కనులపండుగగా జరిగాయి. వాస్తవానికి సరయు నదీతీరంలో గత ఎనిమిదెళ్లుగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రతిఏటా దీపోత్సవం నిర్వహిస్తోంది. అయితే.. ఈసారి మరింత వైభవంగా.. రికార్డులు సృష్టించే స్థాయిలో ఏర్పాట్లు చేసింది.
ఈ సందర్భంగా అయోధ్యలో బాలరాముడిని దర్శించుకొన్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా దీపాలు వెలిగించి, ఉత్సవాన్ని ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ టూరిజం విభాగం ఆధ్వర్యంలో భక్తులు ఏకకాలంలో 25,12,585 దీపాలను వెలిగించారు. మొత్తం 55 ఘాట్ లలో భక్తులు ఇలా 25 లక్షలకు పైగా దీపాలను మట్టి ప్రమిదల్లోనే వెలిగించారు!
దీంతో... ఈ కార్యక్రమం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇదే సమయంలో... 1,121మంది వేదాచార్యులు ఏకకాలంలో హారతి ప్రదర్శించి మరో గిన్నీస్ రికార్డును సృష్టించారు. ఈ సందర్భంగా... కార్యక్రమానికి హాజరైన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ న్యాయనిర్ణేత ప్రవీణ్ పటేల్ ఈ రెండు రికార్డులను ప్రకటించారు.
ఇక.. ఈ ప్రత్యేక దీపోత్సవానికి ముందు "పుష్పక విమానం" తరహాలో రామాయణ వేషధారులు హెలీకాప్టర్ నుంచి దిగారు. ఆ సమయంలో వీరంతా ఓ రథంపై కొలువుదీరారు. అయితే.. ఆ రథాన్ని యూపీ సీఎం యోగి ఆధిత్యానాథ్ తో పాటు రాష్ట్ర మంత్రులు కలిసి లాగారు. ఈ కార్యక్రమాలను తిలగించేందుకు సిటీ అంతా ఎల్.ఈ.డీ. స్క్రీన్స్ ఏర్పాటు చేశారు.