Begin typing your search above and press return to search.

ఔనా? కేకేను కాంగ్రెస్ లో పంపింది కేసీఆరేనా? అనుమానించదగ్గ పాయింటే

సీనియర్ నాయకుడు 50 ఏళ్ల కిందటనే ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేసిన కే.కేశవరావు (కేకే) నిత్యం వార్తల్లో ఉండే వ్యక్తి.

By:  Tupaki Desk   |   30 Aug 2024 2:30 PM GMT
ఔనా? కేకేను కాంగ్రెస్ లో పంపింది కేసీఆరేనా? అనుమానించదగ్గ పాయింటే
X

కూతురు హైదరాబాద్ వంటి అతిపెద్ద నగరానికి వరుసగా రెండోసారి మేయర్.. కార్పొరేషన్ లో తిరుగులేని ఆధిక్యం.. ఆయన స్వయంగా రాజ్య సభ సభ్యుడు.. మరో రెండేళ్లయినా పదవీ కాలం ఉంది. పార్టీలోనూ పెద్ద పీటనే.. అధినేత తర్వాత సీనియర్ ఆయనే. కాస్తోకూస్తో ఆ ప్రాంతీయ పార్టీలో మాటకు విలువ ఉన్న నాయకుడు కూడానూ. కానీ, అనూహ్యంగా పార్టీ ఓటమి అనంతరం జంప్ చేసేశారు. అధికారం పక్షం గూటికి చేరిపోయారు. అదేమంటే.. పుట్టింటికి వెళ్లినట్లుగా ఉందంటారు. ఇప్పుడిది తరచి చూస్తే.. దీనివెనుక ఉన్నది వేరొకరని అంటున్నారు.

పార్టీ మార్పు వెనుక ఇంత కథ ఉందా?

సీనియర్ నాయకుడు 50 ఏళ్ల కిందటనే ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేసిన కే.కేశవరావు (కేకే) నిత్యం వార్తల్లో ఉండే వ్యక్తి. ఆయన కుమార్తె గద్వాల విజయలక్ష్మి జీహెచ్ఎంసీ మేయర్. అయితే, బీఆర్ఎస్ లో కీలక స్థాయిలో ఉంటూ ఆ పార్టీ ఓటమి పాలుకాగానే కేకే కూతురుతో సహా కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా కూడా చేశారు. తెలంగాణ ప్రభుత్వంలో కేబినెట్ ర్యాంకుతో పదవి పొందారు. కాగా, పార్టీ మారే విషయాన్ని చెప్పేందుకు తనవద్దకు వచ్చిన కేకేను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రంగా మందలించినట్లు కథనాలు వచ్చాయి. అయితే, అసలు కేకేను కాంగ్రెస్‌లోకి పంపింది కేసీఆరే అని మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇదీ లాజిక్ అట..

సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి కూడా అయిన డీకే అరుణ తన ఆరోపణల వెనుక ఉన్న కారణాలనూ వివరించారు. కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో కేకేను కాంగ్రెస్‌ లోకి పంపిన కేసీఆర్.. ఆయనతో రాజీనామా చేయించారని అరుణ అన్నారు. కేకే రాజీనామా చేసిన ఎంపీ పదవిలోకి అభిషేక్ సింఘ్వీ వచ్చారు. దీనికోసమే కేకేతో రాజీనామా చేయించారనేది అరుణ ఆరోపణ. కవిత కేసు వాదించినది అభిషేక్ సింఘ్వీనే అని ఆమె పేర్కొన్నరు. కేకే రాజ్యసభ సీటును సింఘ్వీకి ఇవ్వడం వెనక చాలా మతలబు ఉందని వ్యాఖ్యానించారు.

కాగా, కేకే-అభిషేక్ సింఘ్వీ ఉదంతం నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ ఒక్కటేనని అరుణ ఆరోపించారు. ఇక హైడ్రా పేరిట హైడ్రామా నడుపుతున్నారని.. పేదల ఇళ్ల కూల్చివేతను బీజేపీ వ్యతిరేకిస్తోందని చెప్పారు. చెరువుల పరిరక్షణకు అభ్యంతరం లేదని.. పేదల ఇళ్లను కూల్చవద్దని కోరారు. ఆరు గ్యారంటీలను మరిపించడానికే హైడ్రా కూల్చివేతలని ఆరోపించారు.