Begin typing your search above and press return to search.

పార్టీ మార్పుపై స్పందించిన డీకే అరుణ... అదృష్టం ఉండాలి!

ఇందులో భాగంగా... కనీసం తన స్పందన తీసుకోకుండా కథనాలు రాయడం సరైంది కాదని మండిపడిన డీకే అరుణ... తన రాజకీయ భవిష్యత్ నిర్ణయించాల్సిన హక్కు వారికి ఎవరు ఇచ్చారని విరుచుకుపడ్డారు

By:  Tupaki Desk   |   26 Oct 2023 6:01 AM GMT
పార్టీ మార్పుపై స్పందించిన డీకే అరుణ... అదృష్టం ఉండాలి!
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రసవత్తర రాజకీయం తెరపైకి వస్తుంది. అధికార బీఆరెస్స్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించేసి ప్రచారాలతో హోరెతించేస్తుంటే... కాంగ్రెస్ కూడా ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసేసి జనాల్లో తిరిగేస్తుంది! ఈ సమయంలో 52 మంది అభ్యర్థులను తన తొలిజాబితాను విడుదల చేసిన బీజేపీకి అసంతృప్తులు, జంపింగ్ జపాంగుల సమస్య ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తుంది! ఈ నేపథ్యంలో డీకే అరుణ కూడా పార్టీ మారుతున్నారని ప్రచారం తెరపైకి వచ్చింది.

అవును... ఎన్నికలు సమీపిస్తున్న వేళ మిగిలిన పార్టీలన్నీ ప్రచార కార్యక్రమాలతో హోరెత్తించేస్తుంటే... బీజేపీ మాత్రం ఇంకా తమ నేతలను కాపాడుకునే ప్రయత్నంలోనే ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా.. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ చెయ్యి ఇచ్చి.. చేతిలో చెయ్యి చేసేశారు! ఈ సమయంలో తొలిజాబితాలో పేరు లేని మరో సీనియర్ నేత డీకే అరుణ కూడా పార్టీ మారుతున్నారంటూ ప్రచారం ఊపందుకుంది.

ఈ నేపథ్యంలో సీరియస్ గా రియాక్ట్ అయ్యారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. ఇందులో భాగంగా... తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతునట్లు వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు. కొందరు కాంగ్రెస్ నాయకులు కావాలని మైండ్ గేం ఆడుతున్నారని ఆమె మండిపడ్డారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ లో తన చేరికపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఇందులో భాగంగా... కనీసం తన స్పందన తీసుకోకుండా కథనాలు రాయడం సరైంది కాదని మండిపడిన డీకే అరుణ... తన రాజకీయ భవిష్యత్ నిర్ణయించాల్సిన హక్కు వారికి ఎవరు ఇచ్చారని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ లో తన చేరికపై దుష్ప్రచారం చేస్తున్న వారిపైనా, మీడియా సంస్థలపైనా పరువు నష్టం దావా వేస్తానని ఆమె ఫైరయ్యారు. ఇలాంటి పనులు మానుకోవాలని ఆమె హితవు పలికారు!

అనంతరం తానున్న బీజేపీ పార్టీపై ప్రశంసలు కురిపించారు అరుణ. ఇందులో భాగంగా... భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం తనను గుర్తించి జాతీయ ఉపాధ్యక్ష పదవి ఇచ్చి గౌరవించిందని గుర్తు చేసుకున్నారు. ఇదే సమయంలో... ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో పని చేయడానికి అదృష్టం ఉండాలని ఆమె అన్నారు.

కాగా... ఇటీవల తెలంగాణ బీజేపీ ఎలక్షన్ స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్‌ కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఆయన బీజేపీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. ఈ క్రమంలోనే వారం రోజుల క్రితమే పార్టీ మార్పుపై హింట్ ఇచ్చారు! అనంతరం... మునుగోడు ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే తన నిర్ణయం అని చెబుతూ... బీజేపీకి బై బై చెప్పేశారు!

ఇదే సమయంలో మరో సీనియర్ నేత ఎంపీ వివేక్ పై కూడా ఇలాంటి కథనాలే వచ్చాయి. అయితే... వీటిపై క్లారిటీ ఇచ్చిన ఆయన... తాను పార్టీ మారడం లేదని.. పార్లమెంటుకు పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే డీకే అరుణ పార్టీ మారుతున్నారంటూ ప్రచారం ఊపందుకుంది. దీంతో... డీకే అరుణ ఈ స్థాయిలో రియాక్ట్ అయ్యారు!!