Begin typing your search above and press return to search.

'ఎన్డీయే'కు 200 ఇస్తున్న డీకే... 'ఇండియా'పై ఆసక్తికర వ్యాఖ్యలు!

ఇందులో భాగంగా జూన్ 4న రాబోయే ఎన్నికల ఫలితాలపై జోస్యం చెప్పారు. ఈ సందర్భంగా ఎన్డీయే పై విచురుకుపడ్డారు.

By:  Tupaki Desk   |   17 May 2024 5:04 AM GMT
ఎన్డీయేకు 200 ఇస్తున్న  డీకే... ఇండియాపై ఆసక్తికర వ్యాఖ్యలు!
X

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల సందడి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే నాలుగు దశల్లో పోలింగ్ పూర్తయ్యింది. ఇక ఈ నెల 20న ఐదో దశ పోలింగ్ జరగబోతుంది. ఈ సమయంలో ఇతర స్థానాలతో పాటు కాంగ్రెస్ కంచుకోట అయిన రాయ్‌ బరేలీ, అమేథీలో ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో... పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు రెండు ఉత్తరప్రదేశ్ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు.

అవును... ఐదోదశ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఉత్తరప్రదేశ్ లో భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ సమయంలో... కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ లక్నోలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా జూన్ 4న రాబోయే ఎన్నికల ఫలితాలపై జోస్యం చెప్పారు. ఈ సందర్భంగా ఎన్డీయే పై విచురుకుపడ్డారు.

ఇందులో భాగంగా... ఎన్నికల సమయంలో ఊకదంపుడుగా వాగ్ధానాలు చేశారు కానీ.. వాటిలో ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదని చెప్పారు. ఇదే సమయంలో... ప్రజలకు మేలు జరిగిందా, వారి బతుకులు బాగుపడ్డాయా అని ప్రశ్నించారు. కేవలం భావోద్వేగాలను రెచ్చగొట్టి క్యాష్ చేసుకొవడంపైనే వారి రాజకీయాలు ఆధారపడి ఉన్నాయన్నట్లుగా డీకే కామెంట్ చేశారు.

ఇక ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కర్ణాటకలో.. ఎన్నికల నాడు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇచ్చిన మాట ప్రకారమే పాలన ఉంటుందని చెప్పడానికి కర్ణాటకే తాజా ఉదాహరణ అని చెప్పిన డీకే శివకుమార్... యూపీలో బీజేపీ చేసిన వాగ్ధానాలేమీ కార్యచరణలో కనిపించడం లేదని అన్నారు. గతంలో కర్ణాటకలోనూ బీజేపీ ఇదే తరహాలో హామీలు నెరవేర్చ లేదని చెప్పారు.

ఈ క్రమంలోనే ఈ ఎన్నికల్లో రాబోయే ఫలితాలపై స్పందించిన శివకుమార్... ఎన్డీయేకు సుమారు 200 సీట్ల వరకూ వచ్చే అవకాశం ఉందని.. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ రెండంకెలకు చేరదని అన్నారు. కేంద్రం దక్షిణాది రాష్ట్రాలపై సవతి తల్లి ప్రేమ చూపించడమే ఇందుకు కారణం అని తెలిపారు! ఇదే క్రమంలో కాంగ్రెస్ నేతృత్వంలోని "ఇండియా" కూటమికి 300 సీట్లవరకూ వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.