తెలంగాణ ఎలక్షన్స్: డీకే మాటల తూటాలు
డీకే మాట్లాడుతూ.. రాష్ట్రంపై ప్రేమతో, తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించేవారి సంఖ్య ఇంక పెరగకూడదనే ఉద్దేశంతోనే సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని తెలిపారు.
By: Tupaki Desk | 29 Oct 2023 3:30 AM GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం దూకుడు పెంచింది. ఈ క్రమంలో పొరుగున ఉన్న కర్ణాటక నుంచి పలువురునాయకులు తెలంగాణకు వచ్చి .ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. తాజాగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలం గాణలో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్ సర్కారుపై మాటల తూటాలు పేల్చారు. ''పదేళ్ల యింది.. ఒక్క హామీ అయినా.. కేసీఆర్ నెరవేర్చారా?'' అని డీకే నిలదీశారు. అదేసమయంలో కేంద్రంలోని మోడీ సర్కారుపైనా ఆయన విమర్శలు గుప్పించారు.
తాండూర్‌లో నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో డీకే సహా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. డీకే మాట్లాడుతూ.. రాష్ట్రంపై ప్రేమతో, తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించేవారి సంఖ్య ఇంక పెరగకూడదనే ఉద్దేశంతోనే సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని తెలిపారు. అలాంటి సోనియాకు కృత జ్ఞత తెలపాల్సిన అవసరం ఉందని డీకే వ్యాఖ్యానించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పట్ల ప్రజలు కృతజ్ఞత చూపాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇక, ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలపైనా డీకే సంచలన వ్యాఖ్యలుచేశారు. కాంగ్రెస్ నేతలు ఏదైనా హామీ ఇచ్చారంటే తప్పకుండా నెరవేరుస్తారని డీకే చెప్పారు. కర్ణాటకలోనూ ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలు ఇచ్చామని, వీటిలో ఐదు గ్యారెంటీలను ఇప్పటికే అమలు చేసి చూపిస్తున్నామని వివరించారు. మరి , తెలంగాణ సీఎంగా ఉన్న కేసీఆర్ ఇచ్చిన హామీలు ఈ పదేళ్లలో నెరవేరాయా? అని డీకే నిలదీశారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడే హామీలను అమలు చేస్తోందన్న డీకే.. కేసీఆర్‌కు కానీ, కేటీఆర్‌కు కానీ, ఈ విషయంలో అనుమానం ఉంటే వచ్చి చూసుకోవాలన్నారు. డిసెంబర్ 9వ తేదీన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని డీకే శివకుమార్ ధీమా వ్యక్తం చేశారు.
ఇదిలావుంటే, డీకే శివకుమార్ సమంక్షలో పలు పార్టీల నేతలు కాంగ్రెస్‌లో చేరారు. మాజీ ఎమ్మెల్యే నారాయణరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ లక్ష్మారెడ్డికి డీకే శివకుమార్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.