Begin typing your search above and press return to search.

కేటీఆర్ ను కర్నాటక రమ్మంటున్న కాంగ్రెస్... కేసీఆర్ పై కీలక వ్యాఖ్యలు!

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధానపార్టీలన్నీ ప్రచారాలతో హోరెత్తించేస్తున్నాయి.

By:  Tupaki Desk   |   29 Oct 2023 4:07 AM GMT
కేటీఆర్ ను కర్నాటక రమ్మంటున్న కాంగ్రెస్... కేసీఆర్ పై కీలక వ్యాఖ్యలు!
X

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధానపార్టీలన్నీ ప్రచారాలతో హోరెత్తించేస్తున్నాయి. ఈ సమయంలో ప్రధానంగా అధికార బీఆరెస్స్, కాంగ్రెస్ ల మధ్య మాటల తూటాలు పేళుతున్నాయి. సవాళ్లు ప్రతిసవాళ్లతో రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది. ఇందులో భాగంగా ఇప్పటికే కేసీఆర్ - రేవంత్ ల మధ్య రసవత్తరంగా మాటల యుద్ధం జరుగుతున్న వేళ కర్ణాటక డిప్యుటీ సీఎం డీకేఎస్ ఎంటరయ్యారు.

అవును... తెలంగాణలో ప్రధానంగా బీఆరెస్స్ – కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధాలతో రాజకీయాలు వేడెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... కేసీఈర్ కి దమ్ముంటే కొడంగల్ లో పోటీచేయాలని రేవంత్ సవాల్ చేశారు. దీంతో... కొడంగల్ కి రావాలి, కొడవలి పట్టుకుని రావాలి.. ఇవా రాజకీయాలు అని స్పందించిన కేసీఆర్... తన ధమ్మేంటో దేశం మొత్తం చూసిందని ఫైరయ్యారు.

ఈ క్రమంలో కర్ణాటక ఎన్నికల ఫలితాలే నేడు తెలంగాణ కాంగ్రెస్ లో ఈస్థాయిలో కొత్త ఉత్సాహం నెలకొనడానికి కారణం అని చెబుతుంటారు. దీంతో... కర్నాటకలో రైతులు గగ్గోలు పెడుతున్నారని, అక్కడ కాంగ్రెస్ చేస్తున్నది ఏమీ లేదని, అక్కడ రైతులను, ప్రజలను అడిగితే ఆ విషయం చెబుతారంటూ కేటీఆర్ ఫైరయ్యారు.. తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో పర్యటించిన కర్నాటక డిప్యుటీ సీఎం సీరియస్ అయ్యారు!

తాజాగా వికారాబాద్‌ జిల్లా తాండూరు, పరిగి, రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయభేరి యాత్ర రోడ్‌ షో లో కర్ణాటక పీసీసీ చీఫ్, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైకందుకున్న ఆయన... కర్ణాటకలో అధికారంలోకి రాగానే అయిదు హామీలను అమలు చేశామని, తెలంగాణలోనూ ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని స్పష్టం చేశారు.

ఇదే సమయంలో... కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు కాగానే వీటి అమలుపై తొలి సంతకం చేస్తుందని స్పష్టం చేశారు. కేసీఆర్‌ కు పదేళ్లు అధికారం ఇచ్చినా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోయారని, తాము అధికారంలోకి వస్తే మాత్రం కచ్చితంగా అమలు చేసి తీరుతామని ప్రకటించారు. పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని డీకే శివకుమార్ చెప్పుకొచ్చారు.

ఇదే క్రమంలో... కర్ణాటకలో తమ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని సీఎం కేసీఆర్‌ విమర్శిస్తున్నారని ఫైర్ అయిన డీకే శివకుమార్... ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆయన తనయుడు కేటీఆర్‌, మిగిలిన మంత్రులు అక్కడికి వస్తే.. బస్సు ఏర్పాటు చేసి, వారికి పథకాల అమలు తీరును క్షేత్రస్థాయిలో చూపిస్తామని చెప్పారు. తెలంగాణలో బీఆరెస్స్ పాలన అధ్వానంగా, అవినీతిమయంగా ఉందని ఆరోపించారు. దీంతో... ఈ రియాక్షన్ హాట్ టాపిక్ గా మారింది!