Begin typing your search above and press return to search.

డీఎంకే మీటింగ్ కి వైసీపీ బీఆర్ఎస్ వెళ్తాయా ?

డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎంపీ సీట్లు గణనీయంగా తగ్గిపోతాయని భవిష్యత్తులో దక్షిణాది నుంచి పార్లమెంట్ లో రాజకీయ పలుకుబడి కానీ రాజకీయ పదవులు కానీ ఉండవని అంటున్నారు.

By:  Tupaki Desk   |   19 March 2025 7:36 PM IST
డీఎంకే మీటింగ్ కి వైసీపీ బీఆర్ఎస్ వెళ్తాయా ?
X

దక్షిణాదికి కేంద్రం అన్యాయం చేస్తోంది అంటూ తమిళనాడులో డీఎంకే గొంతెత్తి వాదిస్తోంది. మరీ ముఖ్యంగా జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేసి దక్షిణాది రాష్ట్రాలకు తీరని అపకారం చేస్తోంది అని వాదిస్తోంది. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎంపీ సీట్లు గణనీయంగా తగ్గిపోతాయని భవిష్యత్తులో దక్షిణాది నుంచి పార్లమెంట్ లో రాజకీయ పలుకుబడి కానీ రాజకీయ పదవులు కానీ ఉండవని అంటున్నారు.

ఈ క్రమంలో పెద్దన్నగా డీలిమిటేషన్ వ్యవహారాన్ని తన భుజాన మీద వేసుకున్న డీఎంకే అన్ని పార్టీలతో ఒక కీలకమైన సమావేశాన్ని ఈ నెల 22న చెన్నై వేదికగా నిర్వహిస్తోంది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి అంటే కేంద్రం మీద ఒత్తిడి పెంచడం. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే డీలిమిటేషన్ విషయంలో వెనక్కి తగ్గేలా చూడడం.

ఈ సమావేశానికి మొత్తం అన్ని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రతిపక్ష నాయకులు కీలక నేతలను ఆహ్వానించారు. అలా ఏపీ నుంచి వైసీపీ అధినేత వైఎస్ జగన్ కి స్వయంగా డీఎంకే మంత్రులు ఆహ్వానం అందించారు. అలాగే బీఆర్ఎస్ ని కూడా పిలిచారు. ఇక ఏపీ నుంచి టీడీపీ జనసేన ఎన్డీయే కూటమిలో ఉండడంతో అవి ఈ మీటింగుకు రావు అన్నది తెలిసిందే.

ఇక వైసీపీ వైఖరి ఎలా ఉంటుంది అన్నది ఈ మీటింగు ద్వారా తెలుస్తుంది అని అంటున్నారు. వైసీపీ అటెండ్ అయితే కనుక బీజేపీకి దూరంగా ఇండియా కూటమికి చేరువగా వెళ్తున్నట్లుగా అంతా భావిస్తారు. అదే సమయంలో బీజేపీకి కన్నెర్ర కావాల్సి వస్తుంది అని అంటున్నారు.

ఇక బీఆర్ఎస్ విషయం తీసుకుంటే ఈ మీటింగుకు ఆ పార్టీ వెళ్తుందా అన్నది చర్చగా ఉంది. బీఆర్ఎస్ కి కూడా తమ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి గా ఉంది. బీజేపీకి అంత బలం లేదని భావిస్తోంది. కాంగ్రెస్ తో ఉన్న ఇండియా కూటమిలోని కీలక భాగస్వామి డీఎంకే నిర్వహించే ఈ మీటింగుకు వెళ్తే తప్పుడు సంకేతాలు వస్తాయన్న కారణంతో బీఆర్ఎస్ గైర్ హాజరయ్యే చాన్స్ ఉందని అంటున్నారు.

ఇక జగన్ కి అయినా కేసీఆర్ కి అయినా కాంగ్రెస్ తోనే వైరం అని అంటున్నారు. ఈ ఇద్దరు నేతలూ కాంగ్రెస్ ని ప్రత్యర్ధిగానే చూస్తారు. కేసీఆర్ కి అయితే కాంగ్రెస్ ఇపుడు అధికారంలో ఉన్న పార్టీగా ప్రత్యర్ధి. జగన్ కి కూడా కాంగ్రెస్ తో చేరువ అయితే వైసీపీ ఉనికి దెబ్బతింటుంది అన్న కలవరం ఉందని అంటారు. ఎందుకంటే ఏపీలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు అంతా లాగేసింది వైసీపీ. మళ్ళీ కాంగ్రెస్ ని ఏ విధంగా బలోపేతం చేసినా అది తనకే ఇబ్బంది అని తెలుసు అని అంటున్నారు.

దాంతో కాంగ్రెస్ తో దోస్తీగా ఉన్న డీఎంకే మీటింగుకి వైసీపీ కూడా వెళ్ళే చాన్స్ లేదని అంటున్నారు. వైసీపీ ఈ విషయంలో క్లారిటీతోనే ఉండవచ్చు అని అంటున్నారు. అయితే ఒకవేళ ఈ రెండు పార్టీలూ తమ ప్రతినిధులను పంపాయీ అంటే కనుక అది తెలుగు రాజకీయాల్లో అధ్బుతమే అవుతుంది. కానీ అలా జరిగే అవకాశాలే అధికం అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.