డీఎంకే వజ్రోత్సవాల్లో ఏఐ కరుణానిధి... వీడియో వైరల్!
1947 సెప్టెంబర్ 17న చెన్నైలోని రాబిన్ సన్ పార్కులో ద్రవిడ మున్నెట్ర కళగం (డీఎంకే) పార్టీని ప్రారంభించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 18 Sep 2024 7:00 AM GMT1947 సెప్టెంబర్ 17న చెన్నైలోని రాబిన్ సన్ పార్కులో ద్రవిడ మున్నెట్ర కళగం (డీఎంకే) పార్టీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అన్నాదురై, కరుణానిధి వంటి రాజకీయ ఉద్ధండులను రాష్ట్రానికి అందించిన ఈ పార్టీ మంగళవారం వజ్రోత్సవ సంబరాలు జరుపుకుంది. ఈ కార్యక్రమం చెన్నైలో అంగరంగ వైభవంగా జరిగింది.
1947లో పుట్టి 1967లో అధికారంలోకి వచ్చిన డీఎంకే సుమారు 25 ఏళ్లు అధికారంలో, 35 ఏళ్లు ప్రతిపక్షంలో కొనసాగింది. ఈ పార్టీకి ఇప్పుడు స్టాలిన్ పెద్ద దిక్కుగా ఉన్నారు. ఈ సమయంలో తాజాగా జరిగిన పార్టీ వజ్రోత్సవ వేడుకల్లో అనూహ్యంగా కరుణానిధి ప్రత్యక్షమయ్యారు. సుమారు ఒక నిమిషం పాటు మాట్లాడారు.
అవును... డీఎంజే వజ్రోత్సవాలు, ఆ పార్టీ వ్యవస్థాకుడు అన్నాదురై, సంఘ సంస్కర్త పెరియార్ జయంతిని "ముప్పెరుం విళా"గా చెన్నైలోని నందనం వైఎంసీఏ గ్రౌండ్ లో నిన్న నిర్వహించారు. ఈ సమయంలో వేదికపై పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్ పక్కనే వేసిన ఆసనంలో దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి ప్రత్యక్షమయ్యారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సృష్టించబడిన కరుణానిధి అందరినీ ఆశ్చర్య పరిచారు. అక్కడితో ఈ సర్ ప్రైజ్ అయిపోలేదు. ఏఐ కరుణానిధి కాసేపు మాట్లాడారు కూడా. ఇందులో భాగంగా.. పెరియార్ లక్ష్యాన్ని, అన్నాదురై మార్గాన్ని, తాను కాపాడిన పార్టీని అధికార పీఠంపై కూర్చోబెట్టిన స్టాలిన్ ను తలచుకుని హృదయం గర్విస్తోందని అన్నారు.
సుమారు ఒక నిమిషానికిపైగా సాగిన ఈ ప్రసంగం అందరినీ సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. ఇక కరుణానిధి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయని అంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
మరోపక్క ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ సందర్భంగా ప్రసంగిస్తూ... తమ తదుపరి లక్ష్యం 2026 అసెంబ్లీ ఎన్నికలే అని గుర్తు చేశారు. ఈ సందర్భంగా.. 1967లో తన 13వ ఏట గోపాలపురం యువజన డీఎంకే ప్రారంభించినట్లు చెప్పారు. నాటి నుంచి సుమారు 55 ఏళ్లపాటు పార్టీకి చేసిన కృషి ఫలితంగా నేడు వజ్రోత్సవాల డీఎంకేకు అధ్యక్షుడిగా ఉన్నట్లు తెలిపారు.