రాజ్యసభకు కమలహాసన్.. డీఎంకే కీలక నిర్ణయం
DMK Party Nominate kamal Haasan In rajya Sabha member
By: Tupaki Desk | 12 Feb 2025 8:34 AM GMTవిలక్షణ సినీ నటుడు, తమిళనాడులోని మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమలహాసన్ రాజ్యసభకు నామినేట్ కానున్నారనే ప్రచారం జరుగుతోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇండి కూటమికి మద్దతుగా నిలిచిన ఆయనను త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో నిలపాలని డీఎంకే అధినేత, సీఎం స్టాలిన్ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. కమలహాసన్ తో మంత్రి పికే శేఖర్ బాబు ప్రత్యేకంగా సమావేశం కావడం ఈ ప్రచారానికి ఊతమిస్తోంది.
తమిళ రాజకీయాల్లో 2018 నుంచి క్రియాశీలంగా కమల్ హాసన్ పనిచేస్తున్నారు. సొంతంగా మక్కల్ నీది మయ్యం అనే పేరుతో పార్టీని స్థాపించారు. 2019 పార్లమెంట్ ఎన్నికలు, 2021లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎన్ఎం పార్టీ పోటీ చేసింది. అయితే పట్టణ ప్రాంతాల్లో గణనీయంగా ఓట్లు తెచ్చుకున్నా, ఎక్కడా ఒక్కసీటు గెలవలేకపోయింది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కమల్ కూడా ఓడిపోయారు. దీంతో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఇండి కూటమితో చేతులు కలిపారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో డీఎంకే కూటమికి భేషరతుగా మద్దతు ప్రకటించారు. దీంతో కమల్ ను రాజ్యసభ ఎంపీ చేస్తామని ఆ ఎన్నికల సమయంలోనే సీఎం స్టాలిన్ హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు.
ఇక త్వరలో రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నందున కమల్ అభిప్రాయం తెలుసుకునేందుకు రాష్ట్ర మంత్రి పీకే శేఖర్ బాబు బుధవారం ఆయనతో భేటీ అయ్యారు. ఈ ఇద్దరూ మధ్య ఏం చర్చలు జరిగాయన్న విషయమై చెప్పకలేదు. ఇదేసమయంలో ఎంఎన్ఎం నేత, తమిళ నిర్మాత మురళీ అప్పాస్ మాత్రం తమ పార్టీకి రాజ్యసభ సీటు లభించనుందనే ప్రచారం నిజమేనంటూ ధ్రువీకరించారు. అయితే అభ్యర్థి ఎవర్నది తమ అధినేత కమల్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. దీంతో కమల్ త్వరలో రాజ్యసభ సభ్యుడు అవుతారంటూ తమిళ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది.
ఇక గత ఎన్నికల్లో కమల్ హాసన్ మద్దతుతో పోటీ చేసిన ఇండి కూటమి తమిళనాడులోని 39 లోక్ సభ స్థానాలను గెలిచి క్లీన్ స్వీప్ చేసింది. ఆ ఎన్నికల సమయంలో కమలహాసన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేశారు. ఇండి కూటమిని గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. అదేవిధంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన స్టాలిన్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కమల్ ను ముందుగా నామినేట్ చేయడం వల్ల రాజకీయంగా మేలు జరుగుతుందని సీఎం స్టాలిన్ భావిస్తున్నారంటున్నారు. దీంతో తమిళ నాడు నుంచి మరోసూపర్ స్టార్ పార్లమెంటులో అడుగుపెట్టనున్నారని అంటున్నారు.