ఐఐటీ మండీ రిపోర్టు: జాబ్ కాదు బిజినెస్ చేద్దాం బ్రో
గ్లోబల్ యూనివర్సిటీ ఆంత్రప్రెన్యూరియల్ స్పిరట్ స్టూడెంట్స్ పేరుతో భారతీయ విద్యార్థులపై ఐఐటీ మండీ రిపోర్టు ప్రకారం.. ఉద్యోగం కంటే వ్యాపారం వైపు ఫోకస్ చేస్తున్న వారి సంఖ్య పెరుగుతందని చెబుతున్నారు.
By: Tupaki Desk | 23 Oct 2024 5:08 AM GMTచదువు తర్వాత అందరి మదిలో మెదిలేది జాబ్. ఎంత ఎక్కువ జీతం అయితే అంత ఎక్కువ జీతానికి పని చేసే అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. కానీ.. ఇప్పుడు ట్రెండ్ మారింది. చదువు అయ్యాక కొలువల కోసం క్యూ కాకుండా.. బిజినెస్ చేసేందుకు ఆసక్తి చూపుతున్న వైనం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఇదే విషయాన్ని ఐఐటీ మండీ సర్వే రిపోర్టు స్పష్టం చేస్తోంది. గ్రాడ్యుయేషన్ కాగానే జాబ్ చేయాలన్న ఆలోచనకు బదులుగా సొంతంగా ఏదైనా చేద్దామన్న ఆలోచనకు పెద్ద పీట వేస్తున్న యువత అంతకంతకూ ఎక్కువ అవుతోంది.
గ్లోబల్ యూనివర్సిటీ ఆంత్రప్రెన్యూరియల్ స్పిరట్ స్టూడెంట్స్ పేరుతో భారతీయ విద్యార్థులపై ఐఐటీ మండీ రిపోర్టు ప్రకారం.. ఉద్యోగం కంటే వ్యాపారం వైపు ఫోకస్ చేస్తున్న వారి సంఖ్య పెరుగుతందని చెబుతున్నారు. డిగ్రీ లేదంటే దాని సమానమైన కోర్టుల్ని పూర్తి చేసిన వారిలో 14 శాతం మంది సొంతంగా వ్యాపారం చేయాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్లానింగ్ చేసుకోవటం గమనార్హం. ఇదే తీరు అంతర్జాతీయ సగటు 15.7 శాతం ఉండగా.. భారత విద్యార్థులు ఆలోచనలు దగ్గరగా ఉండటం ఆసక్తికర అంశంగా చెప్పాలి.
ఆన్ లైన్ సర్వేలో భాగంగా 2023 నవంబరు నుంచి 2024 ఫిబ్రవరి మధ్య దేశ వ్యాప్తంగా పలు విద్యా సంస్థల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులపై ఈ సర్వే నిర్వహించారు. వీరిలో 61.8 శాతం అబ్బాయిలు.. 38.20 అమ్మాయిలు ఉన్నారు. భారతీయ విద్యార్థుల్లో అత్యధిక వ్యాపారవేత్తల లక్షణాలు.. ఆ స్ఫూర్తి కనిపిస్తున్నట్లుగా సర్వే రిపోర్టు పేర్కొంది.
ఇదే అంశంలో ప్రపంచ సగటు 30 శాతమే ఉందని వెల్లడించారు. దేశంలోని కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల్లో 32.50 శాతం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అయ్యే ఆలోచనలు ఉండగా.. ప్రపంచ సగటు మనోళ్ల కంటే తక్కువగా25.7 శాతం మాత్రమే ఉండటం విశేషం. స్టార్టప్ ల విషయంలో భారత్ ఇప్పటికే ప్రపంచంలో మూడో స్థానానికి చేరుకోవటం తెలిసిందే. 2023లో దేశ వ్యాప్తంగా 34,842 స్టార్టప్ లు స్టార్ట్ అయినట్లుగా వెల్లడించింది. అంటే.. రోజుకు సగటున 96 సార్టప్ లు ఉన్నాయి. 2022 ఏప్రిల్ లో రోజుకు 80 మాత్రమే ఉండేవి.
విద్యా సంస్థల్లో స్టార్టప్ .. ఇంక్యుబేటర్ల కల్చర్ పెరుగుతోంది. ఐఐటీలు.. ట్రిపుల్ ఐటీలతో పాటు హెచ్ సీయూ లాంటి కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లోకొన్నేళ్లుగా టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్లు సక్సెస్ ఫుల్ గా పని చేస్తున్నాయి. ప్రస్తుతం 2951 ఇంక్యుబేషన్ సెంటర్లు ఉన్నట్లుగా వెల్లడించారు. సోషల్ మీడియా పుణ్యమా అని ఉత్పత్తులకు.. ఉత్పత్తి సేవల ప్రచారానికి.. ప్రమోషన్ తేలికగా మారినట్లుగా పేర్కొన్నారు. ఈ సర్వేలో పాల్గొన్న విద్యా సంస్థల్ని చూస్తే 11.3 శాతం కేంద్రీయ వర్సిటీలు.. 24.8 శాతం రాష్ట్ర వర్సిటీలు.. 24.9 శాతం ప్రైవేటు వర్సిటీలు.. 5.3 శాతం ప్రభుత్వ కాలేజీలు.. 18 శాతం ప్రైవేటుకాలేజీలు ఉన్నాయి. మిగిలినవి మరో 14 శాతం వరకు ఉన్నాయి.
ఈ సర్వేలో పాల్గొన్న విద్యార్థుల కోర్సుల్ని చూస్తే.. ఇంజినీరింగ్ 68.3 శాతం ఉంటే.. బిజినెస్ మేనేజ్ మెంట్ విద్యను అభ్యసిస్తున్న వారు 7.4 శాతంగా ఉంది. సైన్స్ 7.5, ఇతరులు 16.7 శాతంగా ఉన్నారు. విద్యార్థుల విద్యార్హతను చూస్తే.. అండర్ గ్రాడ్యుయేట్స్ 78.8శాతం.. పీజీ చేసే వారు 16.2 శాతం మంది పాల్గొన్నారు. వయసుల వారీగా చూస్తే 18-20 ఏళ్ల వయసు వారు 53.7 శాతం, 21-23 ఏళ్ల మధ్యన 24.7 శాతం.. 18ఏళ్ల లోపు వారు 3.4 శాతం ఉన్నారు. 24 ఏళ్లకు పైన ఉన్న వారు 18.2 శాతం మంది ఉన్నారు. ఇక.. తాము చేస్తున్న కోర్సు అయిన వెంటనే బిజినెస్ చేద్దామనుకునే వారిలో అమ్మాయిలు వర్సెస్ అబ్బాయిల్ని చూస్తే.. అబ్బాయిలు 15 శాతం మంది.. అమ్మాయిలు 12 శాతంగా ఉన్నారు. డిగ్రీ పూర్తైన ఐదేళ్ల తర్వాత బిజినెస్ చేద్దామనే ఆలోచనలో అబ్బాయిలు 36 శాతం మంది ఉంటే.. అమ్మాయిలు 26.8 శాతం మంది ఉన్నట్లుగా నివేదిక పేర్కొంది.