Begin typing your search above and press return to search.

జైనూరు పైనా మాట్లాడటమా కేటీఆర్? పదేళ్లో జరిగినవి మరచిపోయావా?

ఈ ఉదంతంపై మీడియా సైతం ఆచితూచి అన్నట్లుగా అడుగులు వేస్తుందే తప్పించి.. తొందరపాటును ప్రదర్శించటం లేదు.

By:  Tupaki Desk   |   6 Sep 2024 4:57 AM GMT
జైనూరు పైనా మాట్లాడటమా కేటీఆర్? పదేళ్లో జరిగినవి మరచిపోయావా?
X

ఎంత రాజకీయాల్లో ఉంటే మాత్రం ప్రతిది మాట్లాడేయటమేనా? దానికి ఒక హద్దు అన్నది ఉండదా? సున్నితమైన అంశాల విషయంలో పొలిటికల్ మైలేజీ కోసం పరుగులు తీస్తే.. మోకాళ్లకు తగిలే దెబ్బలు మొదటికే మోసం వచ్చేలా మారతాయన్న చిన్న విషయాన్ని మాజీ మంత్రి కేటీఆర్ మిస్ అయినట్లుగా కనిపిస్తోంది. కొద్దిరోజులుగా అగ్నిగుండంగా మారిన జైనూరు ఉదంతంపై ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఈ ఉదంతంపై మీడియా సైతం ఆచితూచి అన్నట్లుగా అడుగులు వేస్తుందే తప్పించి.. తొందరపాటును ప్రదర్శించటం లేదు.

అందుకు భిన్నంగా కేటీఆర్ తీరు ఉండటం మాత్రం అభ్యంతరకరమే. కొన్ని సున్నిత అంశాల విషయంలో వీలైనంత మౌనం.. లేదంటే సలహా మాదిరో.. సూచన మాదిరో చేయాలే తప్పించి.. విమర్శల జోలికి వెళ్లటం మంచిది కాదు. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలంటే నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు బోలెడన్ని అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని మర్చిపోకూడదు. అలాంటప్పుడు కుమురం భీం జిల్లా జైనూరు ఎపిసోడ్ గురించి అంతలా స్పందించాల్సిన అవసరం కేటీఆర్ కు ఏముంది? అన్నది ప్రశ్న.

పదేళ్ల కేసీఆర్ పాలనతో ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న పరిణామాలను కేటీఆర్ మర్చిపోయారా? ఇప్పటికంటే మిన్నగా నిర్మల్ మొదలుకొని పలు ప్రాంతాల్లో దారుణ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే.. ఇప్పుడన్నా వార్తలు వచ్చాయి. అప్పట్లో వార్తల మీద పూర్తి సెన్సార్ షిప్ చేశారన్న విషయాన్ని మర్చిపోకూడదు. అది కూడా ఒకట్రెండు సార్లు కాదు. ఏకంగా ఆరేడు సార్లకు పైనే. ఆ టైంలో శాంతిభద్రతల ఇష్యూ పేరుతో మాట్లాడలేదు. చివరకు బీజేపీ నేతలు సైతం అంతులేని సంయమనాన్ని ప్రదర్శించారు.

అందరూ అంతలా జాగ్రత్తలు తీసుకుంటే.. తాజా ఎపిసోడ్ లో మాజీ మంత్రి కేటీఆర్ అవసరానికి మించిన అత్యుత్సాహాన్ని ప్రదర్శించటం తప్పే అవుతుంది. జైనూరులో శాంతిభద్రతలు నెలకొల్పాల్సి ఉందని సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. నిజానికి కేటీఆర్ స్పందించే నాటికే అక్కడి పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఆ అప్డేట్ ను కేటీఆర్ ఫాలో కానట్లుగా కనిపిస్తోంది. బాధిత మహిళకు మెరుగైన వైద్యం అందించాలన్న కేటీఆర్.. నిందితుడికి కఠినశిక్ష పడేలా చూడాలన్న రెగ్యులర్ మాటను చెప్పేశారు. నిజానికి ఈ అంశంపై కాస్త తక్కువగా స్పందించి ఉంటే కేటీఆర్ కు గౌరవంగా ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపిన వారికి ఆ మాత్రం అనుభవం లేకపోవటం ఏమిటి? పొలిటికల్ మైలేజీ కోసం ఏమైనా మాట్లాడేయటమేనా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.