'టెక్ నెక్' సమస్య గురించి తెలుసా?... లక్షణాలు, జాగ్రత్తలు ఇవే!!
అవును... మెడనొప్పికి ఆధునికంగా పెట్టిన పేరే టెక్ నెక్! నిరంతరం కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసేవారికి ఈ తరహా నొప్పి వస్తుంటుంది.
By: Tupaki Desk | 16 Oct 2024 12:30 AM GMTసౌకర్యాలు పెరిగే కొద్దీ, టెక్నాలజీ పెరిగే కొద్దీ వాటి వల్ల వచ్చే సమస్యలు కూడా పెరుగుతుంటుంటాయి! అయితే వీటి సమస్యకు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అలాకానిపక్షంలో సమస్య ముదిరిపోయే ప్రమాదం ఉంది. సహజంగా.. ఫోన్లు, టాబ్లెట్లు, కంప్యూటర్లను గ్యాప్ లేకుండా వాడేవారికి మెడకండరాలపై ఒత్తిడి పడుతుంది. ఫలితంగా తీవ్రమైన నొప్పి పుడుతుంది. దీనె టెక్ నెక్ / టెక్స్ట్ నెక్ అని అంటారు.
అవును... మెడనొప్పికి ఆధునికంగా పెట్టిన పేరే టెక్ నెక్! నిరంతరం కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసేవారికి ఈ తరహా నొప్పి వస్తుంటుంది. ఎక్కువగా చదవడం లేదా మొబైల్ ఫోన్ స్క్రీన్ వైపు చూడటం వల్ల వెన్నుముక పదే పదే ఒత్తిడికి గురవ్వడం వల్ల వస్తుంది. అదేపనిగా కంప్యూటర్ ముందు కూర్చుని స్మార్ట్ స్క్రీన్ ను చూస్తున్నప్పుడు తల బరువుకు మెడ వెనుక కండరాలు కుదించబడతాయి.
దీనివల్ల మెడ వెనుక కండరాలు మాత్రమే కాకుండా ఇంటర్ వెటెబ్రెరల్ డిస్క్ లు కూడా ఒత్తిడికి గురవ్వుతాయంట. ఈ టెక్ నెక్ కారణంగా మెడ, భుజాల పైభాగంలో నొప్పితో పాటు విపరీతమైన తలనొప్పి.. చేతులు తిమ్మిరి ఎక్కడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమస్యను గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోని పక్షంలో.. వెన్నెముక సహజ వక్రతను కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ సమస్యకు ప్రధాన కారణం ఎక్కువ సమయం ఫోన్ లో గడపడం, కంప్యూటర్ ముందు అదేపనిగా కూర్చుని పనిచేయడం అని శాస్త్రీయ పరిశోధనల్లో తేలిందని చెబుతున్నారు.
ఈ జాగ్రత్తలు తీసుకోవాలి!:
కంప్యూటర్ తో పనిచేసేవారు నడుముకు అనుకూలంగా ఉండేలా అనుకూలమైన కుర్చీని ఏర్పాటు చేసుకోవాలి. ఇదే సమయంలో ముందుకు వంగి కుర్చోకుండా.. నిటారుగా కూర్చునేలా చూసుకొవాలి. ఇదే సమయంలో కనీసం ప్రతీ గంటకు ఒకసారైనా విరామం తీసుకోవాలి. ఫలితంగా.. మెడపై భారం పడటం తగ్గడంతోపాటు.. రక్తప్రసరణ సక్రమంగా ఉంటుంది.
ఇక ఇప్పటికే ఈ సమస్యతో ఉన్నవారు ఫిజియోథెరపిస్ట్ ని సంప్రదించి అవసరమైన మసాజ్ లు చేయించుకుంటూ.. వ్యాయామాల గురించి తెలుసుకుని అనుసరించాలి. స్మార్ట్ స్క్రీన్ ను కంటికి సమాన స్థాయిలో ఉండేలా చూసుకోవాలి. స్క్రీన్ ముందు గడిపే సమయాన్ని పరిమితం చేసుకోవాలి. కానిపక్షంలో... గ్యాప్ తీసుకుంటూ పనిచేసుకోవాలి!