Begin typing your search above and press return to search.

మూడు పెళ్లిళ్లు, ఐదుగురు పిల్లలు... డొనాల్డ్ ట్రంప్ పర్సనల్ లైఫ్ తెలుసా?

ఈ సందర్భంగా పాలిటిక్స్ లోకి రాకముందు సక్సెస్ ఫుల్ వ్యాపారవేత్తగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత విషయాలకు సంబంధించిన సమాచారం ఆసక్తికరంగా మారింది.

By:  Tupaki Desk   |   21 Jan 2025 11:39 AM GMT
మూడు పెళ్లిళ్లు, ఐదుగురు పిల్లలు... డొనాల్డ్   ట్రంప్  పర్సనల్  లైఫ్  తెలుసా?
X

అగ్రరాజ్యం అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పాలిటిక్స్ లోకి రాకముందు సక్సెస్ ఫుల్ వ్యాపారవేత్తగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత విషయాలకు సంబంధించిన సమాచారం ఆసక్తికరంగా మారింది. ఈ సమయంలో ఆయన పర్సనల్ లైఫ్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాం...!

అవును... అమెరికా అధ్యక్షుల్లో ట్రంప్ స్టైల్ వేరని అంటారు. ట్రంప్ ప్రెసిడెంట్ కాకూడదని ప్రపంచ దేశాలు చాలా కోరుకున్నాయని.. అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత పలు దేశాలు అందోళనతో ఉన్నాయని చెబుతారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేకమైన శైలిని సంపాదించుకున్న ట్రంప్... 1946 జూన్ 14న న్యూయార్క్ లోని క్వీన్స్ లో జన్మించారు.

ఫ్రెడ్ - మేరీ దంపతులకు ఉన్న ఐదుగురు సంతానంలో నాలుగోవాడిగా జన్మించిన డొనాల్డ్ ట్రంప్... తాజాగా అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ట్రంప్ తండ్రి ఫ్రెడ్ సక్సెస్ ఫుల్ రియల్ ఎస్టేట్ డెవలపర్ కాగా... డొనాల్డ్ ట్రంప్ తన విద్యాభ్యాసం పూర్తైన తర్వాత తన తండ్రి వ్యాపారంలోనే చేరాడు.. అదే స్థాయిలో సక్సెస్ అయ్యారు.

న్యూయార్క్ మిలటరీ అకాడమీలో విద్యాభ్యాసం మొదలుపెట్టిన ట్రంప్.. పెన్సిల్వేనియా యూనివర్శిటీలోని వార్టన్ స్కూల్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ కామర్స్ లో విద్యను పూర్తి చేసి 1968లో ఆర్థికశాస్త్రంలో పట్టా పొందారు. అనంతరం తన తండ్రి వ్యాపారంలో చేరి 1971లో ట్రంప్ సంస్థను స్థాపించారు. అనంతరం తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు.

ఇందులో భాగంగా... రియల్ ఎస్టేట్ తో పాటు హోటల్స్, క్యాసినోలు, గోల్ఫ్ కోర్సులు మొదలైనవి ప్రారంభించారు. ఈ క్రమంలో ట్రంప్ 14 కంటే ఎక్కువ పుస్తకాలు రచించగా.. వాటిలో 1987లో రచించిన "ది ఆర్ట్ ఆఫ్ ది డీల్" పుస్తకం అత్యంత ప్రజాధరణ పొందింది.

1980 చివర్లో ట్రంప్ లో రాజకీయ ఆకాంక్షలు మొదలైనట్లు చెబుతారు. ఆ సమయంలో పదవికి పోటీ చేయడానికి విఫలయత్నాలు చేసిన ట్రంప్... 2015 జూన్ 16న అధికారికంగా తన అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. ఈ క్రమంలో 2016 నవంబర్ 8న డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ పై విజయం సాధించారు.. అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

మూడు పెళ్లిళ్లు - ఐదుగురు పిల్లలు!:

ఇక వైవాహిక జీవితం విషయానికొస్తే... డొనాల్డ్ ట్రంప్ ఇప్పటివరకూ మూడుసార్లు వివాహం చేసుకున్నారు. తొలుత ఇవానాను పెళ్లి చేసుకున్న ట్రంప్.. 1990లో ఆమెకు విడాకులిచ్చారు. వీరికి డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఇవాంక ట్రంప్, ఎరిక్ ట్రంప్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆమె 2022లో మరణించింది.

ఆమెకు విడాకులు ఇచ్చిన అనంతరం.. టెలివిజన్ నటి మార్లాను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె జన్మించింది. ఆమె పేరు టిఫనీ ట్రంప్ కాగా.. ఆమె లా గ్రాడ్యుయేట్. రెండో భార్య మార్లాకు 1999లో విడాకులిచ్చిన ట్రంప్.. 2005లో మెలానియాను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు బారన్ ట్రంప్ ఉన్నారు.

ట్రంప్ కుటుంబ వృక్షం ఇదే!:

డొనాల్డ్ ట్రంప్ తండ్రి ఫ్రెడ్ ట్రంప్ జర్మన్ వలదదారుల కుమారుడు కాగా.. తల్లి మేరీ లూయీస్ ద్వీపంలో జన్మించిన స్కాటిష్ వలసదారు. ఈమె కేవలం 50 డాలర్లతో యూఎస్ వచ్చి.. బ్రతుకు పోరాటంలో భాగంగా పనిమనిషిగా పనిచేశారు. ఈ క్రమంలోనే ఫ్రెడ్ ను కలవడం.. చూపులు కలవడంతో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ దంపతులకు ఐదుగురు సంతానం కాగా నాలుగో బిడ్డ డొనాల్డ్ ట్రంప్.

ట్రంప్ పెద్ద అక్క మేరియాన్నే... ఈమె దశాబ్ధాలుగా యూఎస్ ఫెడరల్ న్యాయమూర్తిగా సేవలందించారు. ఆమెకు ఒక కుమారుడు విడ్ విలియం డెస్మండ్.

ట్రంప్ అన్న ఫ్రెడ్ జూనియర్... ఆ ఇంటికి పెద్ద కుమారుడు. ఇయన తన తండ్రి కుటుంబ వ్యాపారమైన రియల్ ఎస్టేట్ చూసుకునేవారు. ఈ క్రమంలో కొంతకాలం పైలెట్ గానూ పనిచేశారు. అనారోగ్య కారణాలతో 42 ఏళ్లకే మరణించారు. ఈయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి పేర్లు జూనియర్ మేరీ ట్రంప్, ఫ్రెడ్ ట్రంప్ III.

ట్రంప్ చిన్న అక్క ఎలిజబెత్... అమెరికా ఆర్థిక సేవల బహుళ సంస్థ జేపీ మోర్గాన్ లో పని చేశారు. ఈ క్రమంలో డాక్యుమెంటరీ నిర్మాత జేమ్స్ గ్రౌన్ ను వివాహం చేసుకున్నారు. ఈమెకు సంతానం లేరు!

ట్రంప్ చిన్న తమ్ముడు రాబర్ట్... డొనాల్డ్ ట్రంప్ కు అత్యంత విశ్వసనీయమైన వ్యక్తిగా వ్యవహరిస్తాడని అంటారు. ట్రంప్ ఆర్గనైజేషన్ లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ గానూ పని చేసిన ఈయన రెండు వివాహాలు చేసుకుని, ఒక కుమారుడుని దత్తత తీసుకున్నారు. ఈ క్రమంలో 2020లో మరణించారు.