Begin typing your search above and press return to search.

డాక్టర్ కు రూ.11 కోట్లు.. ఒంటరి మహిళ నుంచి రూ.5.6 కోట్లు దోచేశారు!

వాళ్లేం హత్యలు చేయరు. ఆ మాటకు వస్తే గాయపర్చరు కూడా. కానీ.. అంతకు మించిన డ్యామేజ్ చేస్తారు.

By:  Tupaki Desk   |   11 Dec 2024 4:19 AM GMT
డాక్టర్ కు రూ.11 కోట్లు.. ఒంటరి మహిళ నుంచి రూ.5.6 కోట్లు దోచేశారు!
X

వాళ్లేం హత్యలు చేయరు. ఆ మాటకు వస్తే గాయపర్చరు కూడా. కానీ.. అంతకు మించిన డ్యామేజ్ చేస్తారు. కేవలం మాటల వల విసురుతారు. ఆశపడ్డా.. భయపడ్డా కోట్లాది రూపాయిలు కోట్టేస్తారు. ఈ విషయంలో వారు కరాఖండిగా ఉంటారు. అస్సలు దయ తలచరు. వీరి ఆరాచకం అంతకంతకూ ఎక్కువైపోతోంది. ఇంతకూ వారెవరంటారా? ఇంకెవరు? సైబర్ దొంగలు. నిద్ర లేచింది మొదలు.. పడుకునే వరకు వారికి ఒకటే పని. ఎవరో ఒకరిని తమ మాటలతో ప్రభావితం చేయటం.. వారి నుంచి భారీగా దోచేయటం. గతంలో వేలల్లో ఉండే ఈ నేరాలు ఇప్పుడు కోట్లల్లో చేరుతున్నాయి.

తాజాగా హైదరాబాద్ మహానగరానికి చెందిన ఇద్దరి నుంచి దగ్గర దగ్గర రూ.17 కోట్లు కొల్లగొట్టిన వైనం తెలిస్తే ఆశ్చర్యంతో అవాక్కు అవ్వాల్సిందే. ఈ ఇద్దరు బాధితులు తాజాగా సైబర్ పోలీసుల్ని ఆశ్రయించటంతో వారు మోసపోయిన వైనం గురించి తెలిసి నోట మాట రాదు. అలా అని ఈ ఇద్దరు మరీ అంత అమాయకులా? అంటే.. వారిలో ఒకరు డాక్టర్ కావటం గమనార్హం. అసలేం జరిగిందంటే..

బంజరాహిల్స్ ఎమ్మెల్యే కాలనీకి చెందిన 50 ఏళ్ల ఒక వైద్యుడికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. ఫారెక్స్ ట్రేడింగ్ పేరుతో మాటలు కలిపి ఆగస్టు నుంచి నవంబరు వరకు 34 విడతలుగా రూ.11.11 కోట్లు కొట్టేశారు. మిత్తల్ అనే వ్యక్తి ఈ ఆగస్టులో బాధితుడికి వాట్సప్ కు ఒక లింక్ పంపారు. అది నిజమేనని నమ్మి.. సదరు వెబ్ సైట్ లో తన పేరును నమోదు చేసుకున్నారు. ఫారెక్స్ ట్రేడింగ్ కోసం భారతీయ కరెన్సీని యూఎస్ డీటీ అనే క్రిప్టో కరెన్సీలో మార్చాల్సి ఉంటుందని చెప్పి.. మోసగాడైన మిత్తల్ తన కుమార్తెను పరిచయం చేశాడు. ఆమె పేరు సాక్షిగా చెప్పాడు. వారిద్దరు చెప్పిన ఖాతాలకు వైద్యుడు ఆర్టీజీఎస్ ద్వారా డబ్బును ట్రాన్సఫర్ చేశాడు.

ట్రేడింగ్ ఖాతాలో ఆన్ లైన్ లో పెట్టుబడితో పాటు లాభాలు భారీగా కనిపించాయి. దీంతో.. వాటిని వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నించగా రూ.3.7 కోట్లు పన్నులు చెల్లించాలని చెప్పటంతో వైద్యుడు తన వద్ద రూ.2 కోట్లు ఉన్నాయని చెప్పటంతో మిగిలిన రూ.1.7కోట్లు రుణంగా ఇస్తామనిచెప్పాడు. వారు చెప్పినట్లే రూ.2 కోట్లు బదిలీ చేసిన తర్వాత తన పెట్టుబడుల మీద వచ్చిన మొత్తాన్ని డ్రా చేసేందుకు ప్రయత్నించగా.. యూఎస్ ఫెడరల్ చట్టాలకు అనుగుణంగా ముందస్తు ట్యాక్స్ చెల్లించాలని మెలిక పెట్టారు. తాను మోసపోయినట్లు అర్థం చేసుకున్న సదరు వైద్యుడు సైబర్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు.

మరో ఉదంతంలో బషీర్ బాగ్ కు చెందిన 69 ఏళ్ల పెద్ద వయస్కురాలికి నవంబరు 13న రాత్రి 9.20 గంటల మధ్యలో ఫోన్ వచ్చింది. తాను ట్రాయ్ నుంచి మాట్లాడుతున్నట్లుగా పేర్కొన్న ఆ ఆగంతుకుడు (ఫోన్ నెంబరు 87088464044)తనను తాను రాహుల్ కుమార్ గా పరిచయం చేసుకొన్నాడు. ఆమె ఆధార్ కార్డు లింక్ చేసి ఉన్న ఫోన్ నెంబరుకు మనీ ల్యాండరింగ్.. మనుషుల అక్రమ రవాణా.. మాదకద్రవ్యాల వ్యాపారానికి సంబంధించిన కేసులతోసంబంధం ఉందని చెప్పారు.

ఆ తర్వాత సీబీఐ అధికారులంటూ సౌరభ్ శర్మ.. అజయ్ గుప్తా అనే ఇద్దరు స్కైప్ ద్వారా వీడియో కాల్ చేసి.. ఆమె నేరం చేయలేదనే విషయం తమకు అర్థమయ్యే వరకు ఆమెను డిజిటల్ అరెస్టు చేస్తున్నట్లుగా చెప్పారు. దీంతో ఆమె తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆమెతో పాటు ఆమె 24 గంటలూ ఇద్దరు కుమార్తెలను వీడియో కాల్ పర్యవేక్షణలో ఉంచి.. వారిని భయపెట్టేందుకు సంకెళ్లతో ఉన్న పలువురి ఫోటోలు చూపించారు. సీబీఐ.. ఆర్ బీఐ ముద్రలతో ఉన్న పత్రాల్ని చూపారు. మొత్తం 20 రోజుల పాటు సాగిన ఈ ఎపిసోడ్ లో వారి ఖాతాల్లో ఉన్న డబ్బులు మొత్తాన్ని తమకు పంపాలని.. వారు నేరం చేయలేదని ఫ్రూవ్ అయిన తర్వాత డబ్బులు వెనక్కి పంపుతామని చెప్పారు.

ఈ క్రమంలో అజయ్ గుప్తా (ఫోన్ నెంబరు 8296135919) అనే వ్యక్తి వాట్సప్ కాల్ చేసి.. బాధితురాలి కుమార్తెల బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు బదిలీ చేయించుకున్నారు. వారికున్న ఫిక్సెడ్ డిపాజిట్లు కరిగించి.. తమకు బదిలీ అయ్యేలా చేశారు. అలా నవంబరు14 నుంచి డిసెంబరు 3 మధ్యకాలంలో మొత్తంగా రూ.5.66 కోట్ల మొత్తాన్ని బదిలీ చేయించుకున్న తర్వాత.. డిసెంబరు 8న అజయ్ గుప్తాకు ఫోన్ చేస్తే ష్యూరిటీతో సహా అనని పత్రాల్ని తీసుకొని దగ్గర్లోని సీబీఐ ఆఫీసుకు వెళితే.. వారు డబ్బులు తిరిగి బ్యాంక్ ఖాతాలోకి వేస్తారని చెప్పారు. వారి మాటల్ని నమ్మి కోఠిలోని సీబీఐ ఆఫీసుకు వెళ్లగా.. అదంతా సైబర్ నేరస్తుల మోసంగా చెప్పటంతో లబోదిబోమంటూ టీజీసీఎస్ బీకి వారు కంప్లైంట్ చేశారు. ఈ రెండు ఎపిసోడ్ లు చెప్పేదొక్కటే.. భారీగా సంపాదించేయొచ్చన్న ఆశ కానీ.. లేదంటే భయపెట్టటం కానీ.. ఈ రెండింటిలో ఏదో ఒక పేరుతో మిమ్మల్ని ఎవరు ట్రాప్ చేసే ప్రయత్నం చేసినా వారి వలలో చిక్కుకోవద్దు.