రేపు దేశవ్యాప్తంగా వైద్య సేవలు బంద్... ఫోర్డా సంచలన ప్రకటన!
అయినప్పటికీ దేశం వీటిలో ఓ సమస్యను రేపు (ఆగస్టు 12) న ఎదుర్కోబోతోంది.
By: Tupaki Desk | 11 Aug 2024 9:52 AM GMTదేశవ్యాప్తంగా వైద్య సేవలు బంద్ అయితే ఇక ప్రజల పరిస్థితి ఏమిటి? ఇది ఎంత పెద్ద సమస్య అవుతుంది? అసలు దేశంలో పోలీసులు, డాక్టర్లు బంద్ చేస్తే ఎలాంటి పరిణామాలు తెరపైకి వస్తాయి? ఇవన్నీ అత్యంత క్లిష్ట సమస్యలే. వీటి వల్ల ఎదురయ్యే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే చెప్పుకోవచ్చు. అయినప్పటికీ దేశం వీటిలో ఓ సమస్యను రేపు (ఆగస్టు 12) న ఎదుర్కోబోతోంది. ఈ మేరకు ఫోర్డా సంచలన ప్రకటన విడుదల చేసింది.
అవును... దేశవ్యాప్తంగా సోమవారం కొన్ని రకాల వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు “ది ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్” (ఫోర్డా) సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు ఆ సంఘం లేఖ పంపించింది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతా లోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలి దారుణ హత్యపై తీవ్రంగా స్పందించిన వైద్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు!
ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలు దారుణ హత్యపై తక్షణమే చర్యలు తీసుకొవాలని ఫోర్డా శనివారమే కేంద్రాన్ని డిమాండ్ చేసింది. దీనికోసం కేంద్రానికి 24 గంటల డెడ్ లైన్ ఇచ్చింది. అలాకానిపక్షంలో ఆసుపత్రుల్లో సేవలు నిలిపివేస్తామని హెచ్చరించింది. అయితే ఈ సమయంలో కేంద్రం చర్యలపై సంతృప్తి చెందలేదో ఏమో కానీ.. ఫోర్డా రేపు దేశవ్యాప్తంగా సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
అయితే... ఈ కేసులో ఇప్పటికే ఓ పౌర వాలంటీర్ ను పోలీసులు అరెస్ట్ చేశారని తెలుస్తోంది. సదరు వైద్యురాలి హత్య జరిగినట్లు చెబుతున్న స్థలంలో ఓ బ్లూటూత్ దొరికిందని, దాని ఆధారంగా అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని, హంతకుడిగా కేసు నమోదు చేసినట్లు చెబుతున్నారు.
కాగా... పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతా లో ఓ మహిళా జూనియర్ డాక్టర్ దారుణ హత్యకు గురయ్యారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఆ జూనియర్ డాక్టర్ స్థానిక ప్రభుత్వాసుపత్రిలో గురువారం రాత్రి విధుల్లో ఉన్నారు. అయితే... శుక్రవారం ఉదయం ఆస్పత్రి సెమినార్ హాల్ లో అర్ధనగ్న స్థితిలో శవమై కనిపించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం పోస్ట్ మార్టం నిర్వహించారు.
అయితే ఈ పోస్ట్ మార్టంలో దారుణ విషయాలు వెలుగులోకి వచ్చినని చెబుతున్నారు. ఇందులో భాగంగా... ఆమెపై లైంగిక దాడి జరిగిందని.. ఆమె మర్మాంగాలు, కళ్లు, నోరు నుంచి రక్తస్రావం జరిగినట్లు తేలిందని అంటున్నారు. ఇదే సమయంలో శరీరంపై వివిధ చోట్ల గాయాలు కనిపించాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బాధితురాలికి న్యాయం జరగాలంటూ వైద్యులు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వైద్య సేవలు నిలిపిచేస్తున్నట్లు ఫోర్డా ప్రకటించడం ఇప్పుడు వైరల్ గా మారింది. ఇదే సమయంలో... ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ఆస్పత్రిలో ఉద్యోగుల రక్షణపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మరి దీనిపై కేంద్రప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందనేది వేచి చూడాలి.