డాక్టర్లకే షాకిచ్చాడు.. అతడి పొట్టలో మేకులు..సూదులు
తీవ్రమైన కడుపునొప్పితో విలవిలలాడుతున్న ఒక వ్యక్తికి సర్జరీ చేసిన వైద్యుల టీం షాక్ తింది.
By: Tupaki Desk | 29 May 2024 4:12 AM GMTతీవ్రమైన కడుపునొప్పితో విలవిలలాడుతున్న ఒక వ్యక్తికి సర్జరీ చేసిన వైద్యుల టీం షాక్ తింది. అతడి పొట్టలో కుప్పలా ఉన్న వస్తువులను చూసిన వైద్యులకు నోట మాట రాలేదు. సదరు వ్యక్తి పొట్టలో మేకులు.. సూదులు.. తాళం చెవులతోపాటు పలు ఇతర వస్తువులు ఉన్నట్లుగా గుర్తించారు. ఇంతకూ అతడెవరు? ఎక్కడి వాడు? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికితే..
రాజస్థాన్ రాజధాని జైపూర్ కు చెందిన ఒక యువకుడు తీవ్రమైన కడుపునొప్పితో పట్టణంలోని సవాయ్ మాన్ సింగ్ ఆసుపత్రిలో చేరాడు. అతడి పరిస్థితిని చూసిన వైద్యులు వెంటనే అతడికి శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా అతడి పొట్టను ఎక్స్ రే.. సిటీ స్కాన్ లాంటి పరీక్షల్ని నిర్వహించారు.
దాని ఫలితం చూసిన తర్వాత నోటి మాట రాని పరిస్థితి. కారణం.. అతడి పొట్టలో పెద్ద ఎత్తున సూదులు.. మేకులు ఉండటమే. దీనికి తోడు నట్లు.. బోల్టులు లాంటివి ఉన్నట్లుగా గుర్తించారు. వీటిల్లో కొన్ని పెద్దపేగులోకి వెళ్లిపోయినట్లుగా గుర్తించారు. ఈ కారణంతోనే తీవ్రమైన కడుపునొప్పితో బాధ పడుతున్నట్లుగా తేల్చారు. వెంటనే శస్త్ర చికిత్స చేశారు. దీంతో అతడికి లాప్రోస్కోపీ.. కొలనో స్కోపీని నిర్వహించారు.
దాదాపు మూడు గంటల పాటు సాగిన శస్త్ర చికిత్స అనంతరం పెద్ద ఎత్తున పేరుకున్న వస్తువుల్ని తొలగించారు. ప్రస్తుతం రోగి పరిస్థితి బాగున్నట్లుగా వైద్యులు చెబుతున్నారు. రోగి మానసిక పరిస్థితి బాగోదని.. ఈ కారణంగానే అతను ఇలా చేస్తుంటాడని గుర్తించారు. ఏమైనా.. అతడి పొట్ట నుంచి బయటకు తీసిన వస్తువుల గురించి తెలిసిన వారంతా నోట మాట రాని పరిస్థితి.