Begin typing your search above and press return to search.

చంద్రబాబు దగ్గర ఆధారాలు ఉన్నాయా ?

ఏదో ఆరోపణలు చేసి ఊరుకునే ఇష్యూ కాదు ఇది. ఆధారాలు కూడా ప్రభుత్వం చూపించాలి కదా అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   19 Sep 2024 12:20 PM GMT
చంద్రబాబు దగ్గర ఆధారాలు ఉన్నాయా ?
X

ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ విషయం మీద అయినా ఆచీ తూచీ మాట్లాడుతారు అని పేరు ఉంది. ఆయన ఒక మాట నోటి వెంట అన్నారు అంటే ఎంతో ఆలోచించి అంటారు. రాజకీయాల్లో ఆరోపణలు సహజం. అలా బాబు కూడా ఎన్నో ఆరోపణలు ప్రత్యర్థి పార్టీల మీద చేస్తారు.

అయితే చంద్రబాబు ఏ ఆరోపణ చేసినా ఫ్లోలో చేసేయరు. దానికి కూడా లెక్కలు ఉంటాయి. మరి ఆయన వైసీపీ ప్రభుత్వం మీద చేసిన అనేక ఆరోపణల సంగతి పక్కన పెడితే దేవ దేవుడు, ప్రపంచం మొత్తం ఆరాధించే తిరుమల శ్రీవారి విషయంలో చంద్రబాబు చెప్పిన మాటలు చేసిన ప్రకటనలు ఇపుడు సంచలనంగా మారాయి.

బాబు వంటి వారు అంత సులువుగా ఇంతటి తీవ్రమైన ఆరోపణలు చేస్తారా అన్న చర్చ సాగుతోంది. అంతే కాదు బాబు బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. ఆయన అలా చూసుకున్నా చేసిన ఆరోపణలకు ఏదో బేస్ ఉంటుంది కదా అని అంటున్నారు. చంద్రబాబు విషయంలో ఇపుడు ఇదే అతి పెద్ద చర్చగా ఉంది.

చంద్రబాబు చేసింది ఆరోపణ అని కూడా చూడడానికి లేదు, అది అతి పెద్ద అభాండంగా అంటున్నారు. హిందువులు అంతా పవిత్రంగా కొలిచే స్వామి వారికి చెందిన లడ్డూ ప్రసాదం మీద బాబు చేసిన ఆరొపణలతో ప్రతిపక్షం వైసీపీ అలెర్ట్ అయింది. దీనికి ఉన్న ఆధారాలు ఏమిటో బయటపెట్టాలని కోరుతోంది.

ఏదో ఆరోపణలు చేసి ఊరుకునే ఇష్యూ కాదు ఇది. ఆధారాలు కూడా ప్రభుత్వం చూపించాలి కదా అని అంటున్నారు. అంతే కాదు విపక్ష వైసీపీ అడుగుతున్న దానికి సమాధానం చెప్పాలి కదా అని కూడా అంటున్నారు. శ్రీవారికి ప్రపంచంలోనే కోట్లలో భక్తులు ఉన్నారు.

బాబు చేసిన ఆరోపణలు వైసీపీ మీద అయినా కూడా ఇవి భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్నవి అని అంటున్నారు. ఆ విధంగా చూస్తే ప్రభుత్వం చేసిన ఈ ఆరోపణలు అంత తేలికగా ఒక రాజకీయ విమర్శగా తీసుకోవాల్సినది లేదు అని అంటున్నారు. వాటి మీద కచ్చితమైన ఆధారాలు కూడా ఉండాలి అవి బయటపెట్టాలని అంటున్నారు.

ఈ ఆరోపణలు చేసినది చంద్రబాబు కాబట్టి ఆయన బాధ్యత గలిగిన సీఈం గా ఆ ఆధారాలు బయటపెట్టాలని అంటున్నారు. నిజంగా చూస్తే బాబు చేసిన ఈ కామెంట్స్ హిందువులకు వెంకటేశ్వరస్వామి వారి భక్తులకు షాకింగ్ గా మారాయి. అంతా ఒక్కసారిగా కలవరం చెందుతున్నారు.

దీని మీద టీటీడీ చైర్మన్లుగా చేసిన వైవీ సుబ్బారెడ్డి సవాల్ చేస్తున్నారు. లడ్డూలో జంతువుల కొవ్వు కలపలేదని చెబుతూ తాము తమ కుటుంబం మొత్తం ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నామని అంటున్నారు. మరి బాబు కూడా తన కుటుంబంతో ప్రమాణానికి సిద్ధంగా ఉండాలని అంటున్నారు. ఈ సవాల్ ని బాబు స్వీకరిస్తారా అని కూడా ప్రశ్నిస్తున్నారు.

ఇక వైవీ సుబ్బారెడ్డి గురువారం ఈ విషయం మీద మీడియా సమావేశం పెట్టి మరీ బాబుకు మళ్లీ సవాల్ విసిరారు, ఇది బాబు కనుక నిరూపించలేకపోతే తాను కోర్టుని ఆశ్రయిస్తాను అని ఆయన అన్నారు. మరో మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి అయితే లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు నుంచి తీసిన ఆయిల్ ని వాడింది అన్న ఆరోపణలు నిజం అయితే అలా చేసిన వారితో పాటు వారి కుటుంబం సర్వనాశనం అవుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అదే కనుక అబద్ధం అని తేలితే అలా ఆరోపణలు చేసిన వారి కుటుంబం సర్వ నాశనం అవుతుందని కూడా బాబు మీద కామెంట్స్ చేశారు. తన రాజకీయం కోసం శ్రీవారి భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడటం మంచిది కాదని భూమన అంటున్నారు. మొత్తానికి బాబు ఎన్డీయే ఎమ్మెల్యేల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ దుమారాన్ని పెద్ద ఎత్తున రేపుతున్నాయి.