Begin typing your search above and press return to search.

దొనకొండ అయితే బెస్ట్ రాజధానిగా !?

ఏపీ రాజధాని అమరావతి విషయంలో రకరకాలుగా చర్చ సాగుతోంది. అమరావతి నీట మునిగింది అని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.

By:  Tupaki Desk   |   4 Sep 2024 6:15 PM GMT
దొనకొండ అయితే బెస్ట్ రాజధానిగా !?
X

ఏపీ రాజధాని అమరావతి విషయంలో రకరకాలుగా చర్చ సాగుతోంది. అమరావతి నీట మునిగింది అని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. అది విష ప్రచారం అని ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్ద ఎత్తున మనడిపడుతున్నారు. అమరావతి మీద ఇలా ప్రచారం చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని చెబుతున్నారు.

అయితే కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో వరదలు ఎన్నడూ లేని విధంగా వచ్చాయి క్రిష్ణ దిగువన ఉంది. పైన వరదలు వస్తే క్రిష్ణ ఉప్పొంగుతుంది. ఒకవేళ పైన కరవు పరిస్థితులు ఉంటే క్రిష్ణ చుక్క నీరు ఉండదు, ఈ రెండింటినీ ఏపీయే భరిస్తోంది. అలాగే గోదావరి విషయంలోనూ జరుగుతోంది. అయితే గోదావరి అఖండమైనది కాబట్టి పెద్దగా ఇబ్బందులు లేవు.

క్రిష్ణ విషయంలో మాత్రం పేచీలు ఎన్నో ఉన్నాయి. ఇక క్రిష్ణ తెచ్చిన వరదలు అన్నీ ఇన్నీ కావు. అయితే విజయవాడ గుంటూరు కానీ అమరావతి ప్రతిపాదిత ప్రాంతం కానీ అంతా కూడా క్రిష్ణను అల్లుకునే ఉంది. ఈసారి 12 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం వచ్చింది. అది కనుక ఇంకా రెట్టింపు అయితే అపుడు పరిస్థితి ఏమిటి అన్న చర్చ ఉంది.

ఈ పరిణామాల క్రమంలో రకరకాలైన చర్చలు సాగుతున్నాయి. ఏపీకి రాజధానికి బెస్ట్ ప్లేస్ సేఫెస్ట్ ప్లేస్ ఎక్కడ అన్న దగ్గరే ఇంకా ఆలోచనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికి పదేళ్ల క్రితం సరిగ్గా ఇదే నెలలలో విశాఖ హుదూద్ తుఫాను బారిన పడింది. దాంతో విశాఖ విలయాన్ని తలపించింది. ఆ తరువాత విశాఖ పర్యావరణం పరంగా అంత అనుకూలం కాదన్న వాదన చేస్తూ వస్తున్నారు.

విశాఖకు ఒక వైపు సముద్రం ఉంది.మరో వైపు వెనక కొండలు ఉన్నాయి. ఈ మధ్యలో ఉన్న ఊరుకు ప్రకృతి విపత్తులు వస్తే భారీ ఎత్తున ఇబ్బందులు వస్తాయని కూడా గతంలో వాదనలు జరిగాయి. ఇక అమరావతి విషయం మీద ఇపుడు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఏ రాజధాని అయినా ఈ రోజూ రేపూ కాదు వందల ఏళ్ళు నిలబడాలి. ఎన్నో కాల మాన పరిస్థితులను తట్టుకోవాలి.

అందువల్ల రాజధాని కట్టామని కాదు, దానిని శతాబ్దాల పాటు ఎంతలా నిలబెట్టామన్నది కూడా అతి ముఖ్యమని అంటున్నారు. ఈ నేపధ్యంలో చూస్తే కనుక అమరావతి విషయంలో కొత్త సందేహాలు వస్తున్నాయని అంటున్నారు. తాజాగా కురిసిన వానలతో అమరావతి రాజధాని ప్రాంతంలోకి భారీగా నీరు వచ్చి చేరి దాదాపుగా మునిగిపోయింత పని అయింది అని అంటున్నారు.

ఈ నేపథ్యంలో రాజధానికి బెస్ట్ ప్లేస్ ఏది అంటే కేంద్ర ప్రభుత్వం అప్పట్లో వేసిన ఒక కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం దోనకొండ బెస్ట్ ప్లేస్ అని అంటున్నారు. నిజంగా దోనకొండకు ప్రకృతి పరమైన విపత్తులను తట్టుకునే శక్తి ఉందని అంటున్నారు. చుట్టూ కొండలు మధ్యన మైదానం లాంటి భూములతో అచ్చం హైదరాబాద్ లాంటి వాతావరణం తలపిస్తుందని అంటున్నారు.

ఇక్కడ కావాల్సినంత భూమి ఉంది. పైగా సాయిల్ కూడా సింకింగ్ కాదు రాక్ సాయిల్. దాంతో ఎత్తైన భవనాలు ఏకంగా వంద అంతస్తుల వరకూ నిల్పినా మల్టీ స్టోరు బిల్డింగ్స్ అలా నిలబెట్టినా ఏమీ కాదు అని అంటున్నారు. ప్రకాశం జిల్లాలో ఉండే దోనకొండ కూడా అన్ని ప్రాంతాలకు దగ్గరగా ఉంటుంది అని అంటున్నారు.

దోనకొండ రాజధాని అయితే రాయలసీమ సైతం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుంది అని అంటున్నారు. ఏపీలో ఎప్పటికీ ప్రాంతీయ విభేదాలు వచ్చి రాజధాని గొడవలతో మరోసారి విభజన వాదాలకు బీజాలు పడకుండా ఉండాలంటే దోనకొండ వైపే మొగ్గు చూపడం పాలకుల తక్షణ కర్తవ్యం కావాలని అంటున్నారు.

అమరావతిలో లక్షల కోట్లు నిధులు ఖర్చు అవుతాయి. అదే దొనకొండలో అతి తక్కువ ఖర్చుతోనే అద్భుతాలు చేయవచ్చు అని అంటున్నారు. అమరావతి ఇప్పటికీ ఒక రూపునకు షేపునకూ రాని వేళ వచ్చి పడిన పెను విపత్తు భవిష్యత్తుని ఏపీకి చూపించింది ఇలా అని కూడా అంటున్నారు. పంతాలకు పట్టింపులకు ఎవరూ పోవాల్సిన అవసరం లేదు. అదే సమయంలో అమరావతిని కూడా అభివృద్ధి చేయవచ్చు. మొత్తం మీద చూస్తే దోనకొండ ది బెస్ట్ అంటున్న వారు అంతకంతకు పెరుగుతున్నారు. చూడాలి మరి ఈ డిబేట్ ఏ రకమైన మలుపు తీసుకుంటుందో.