ట్రంప్ గెలుపు.. 131 ఏళ్ల చరిత్ర.. 2020లోనే ఆయన చెప్పారు
అయితే, రెండోసారి ఓడినవారు మూడోసారి పోటీ చేసి అధికారంలోకి రావడం అత్యంత అరుదైనది. ఈ రికార్డు సాధించిన రెండో వ్యక్తి ట్రంప్ మాత్రమే కావడం గమనార్హం.
By: Tupaki Desk | 6 Nov 2024 5:14 PM GMTఅది 2020 నవంబరు.. అమెరికా ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.. అందరూ రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలుస్తాడని భావించారు.. కానీ, అనూహ్యంగా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ నెగ్గారు. అయితే, ట్రంప్ మామూలుగా వదిలే రకం కాదు కదా..? 2024 ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తానని ప్రకటించారు. అప్పుడు దీనిని ఎవరూ పట్టించుకోలేదు. సహజంగా అమెరికాలో ఒకసారి అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన వారు తెరమరుగు కావడమే కానీ.. తిరిగి పోటీ చేయడం అంటూ ఉండదు. అక్కడి ఎన్నికల వ్యవస్థ అలాంటిది. ప్రజలు కూడా ఒకసారి ఓడినవారిని మళ్లీ ఆదరించరు. కానీ, ట్రంప్ అధ్యక్షుడిగా చేసి.. రెండోసారి ఓడి.. మూడోసారి పోటీకి దిగి ఘన విజయం సాధించారు.
రెండుసార్లు ఓకే..
అమెరికాలో అధ్యక్షుడు ఎవరైనా రెండుసార్లు మాత్రమే పదవీ బాధ్యతలు నిర్వర్తించాలనే సంగతి తెలిసిందే. 2016-20 మధ్యన ట్రంప్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. 2020లోనూ గెలిస్తే రెండోసారి అధ్యక్షుడిగా పదవిని చేపట్టి.. ఇప్పటికి తప్పుకొనేవారు. తద్వారా బిల్ క్లింటన్, జార్జి బుష్, బరాక్ ఒబామా తదితరుల జాబితాలో చేరేవారు. అయితే, నాలుగేళ్ల కిందట అనూహ్య ఓటమితో గ్యాప్ వచ్చింది.
బరిలో నిలిచి గెలిచారు 2020లో విజయం ఖాయం అనుకున్న ట్రంప్.. ఫలితంతో హతాశుడైనట్లున్నారు. దీంతో 2024లో మళ్లీ పోటీ చేస్తానంటూ ప్రకటించారు. దీనిని ఎవరూ లెక్కలోకి తీసుకోలేదు. ఇక 2020లో ఓటమి తర్వాత క్యాపిటల్ హిల్ ను ట్రంప్ మద్దతుదారులు ముట్టడించిన తీరును చూశాక.. మళ్లీ ట్రంప్ ప్రజాభిమానం పొందుతారని ఊహించలేదు. అయితే, ఆయన అదే చేశారు.
మొత్తం మూడుసార్లు..
రెండోసారి పరాజయం సహా అమెరికా ఎన్నికల్లో ట్రంప్ మొత్తం మూడుసార్లు పోటీ చేసినట్లయింది. అయితే, రెండోసారి ఓడినవారు మూడోసారి పోటీ చేసి అధికారంలోకి రావడం అత్యంత అరుదైనది. ఈ రికార్డు సాధించిన రెండో వ్యక్తి ట్రంప్ మాత్రమే కావడం గమనార్హం. తద్వారా దాదాపు 131 ఏళ్ల తర్వాత సరికొత్త చరిత్ర లిఖించనున్నారు. 1892లో గ్రోవెర్ క్లీవ్ ల్యాండ్ ఈ తరహాలో గెలిచారు. 1884 ఎన్నికల్లో గెలిచిన ఆయన.. 1888లో ఓడారు. 1892లో మళ్లీ పోటీ చేసి అధ్యక్షుడిగా గెలిచారు. ట్రంప్ కూడా ఇలాగే నాలుగేళ్ల తర్వాత వైట్ హౌస్ లోకి అడుగుపెడుతున్నారు.