Begin typing your search above and press return to search.

చైనా డ్రగ్.. మెక్సికో రూట్.. ట్రంప్ ఆర్డర్.. ఏమిటీ ఫెంటనిల్?

మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ (మెగా) అంటూ అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ తన ఆర్థిక ఎజెండాలో అత్యంత కీలకమైన దిగుమతి సుంకాల గురించి తన కార్యాచరణ ఏమిటో స్పష్టం చేశారు.

By:  Tupaki Desk   |   26 Nov 2024 12:30 PM GMT
చైనా డ్రగ్.. మెక్సికో రూట్.. ట్రంప్ ఆర్డర్.. ఏమిటీ ఫెంటనిల్?
X

మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ (మెగా) అంటూ అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ తన ఆర్థిక ఎజెండాలో అత్యంత కీలకమైన దిగుమతి సుంకాల గురించి తన కార్యాచరణ ఏమిటో స్పష్టం చేశారు. జనవరి 20న అధ్యక్షుడిగా తాను మరోసారి బాధ్యతలు స్వీకరిస్తూనే చేయబోయే పనేమిటో చెప్పేశారు. కొత్త అధ్యక్షుడిగా తన సంతకం.. చట్టవిరుద్ధమైన మాదక ద్రవ్యాల సరఫరా, వలసలకు వ్యతిరేకంగా చేయబోతున్నట్లు తేల్చిచెప్పారు.

గురి దాని మీదే..

ఫెంటనిల్.. ఇప్పుడు అమెరికాలో అత్యంత డేంజరస్ డ్రగ్ గా మారింది. రెండు మిల్లీ గ్రాముల డోస్ అయినా ప్రాణాంతకమేనని వైద్యులు చెబుతున్నారు. ఫెంటనిల్ కు అలవాటు పడి బానిసలైన వారు తప్పుడు చీటీలతో మెడికల్ స్టోర్ లలో కొనుగోలు చేస్తున్నారట. పైగా ఇతర మాదక ద్రవ్యాలతో కలిపి వాడుతున్నట్లు తెలుస్తోంది. ఇంతకూ ఫెంటనిల్ అంటే పైకి మాత్రం నొప్పి నివారిణి (పెయినే కిల్లర్). కానీ, కేంద్ర నాడీ వ్యవస్థపై పనిచేసే ఫెంటనిల్.. హెరాయిన్ కంటే 50 రెట్లు శక్తిమంతం అంటున్నారు వైద్య నిపుణులు.

రెండేళ్ల కిందటే లక్ష ప్రాణాలు హరీ

ఫెంటనిల్ అధిక డోస్‌ కారణంగా 2002లోనే అమెరికాలో 1,07,941 మంది చనిపోయినట్లు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) పేర్కొంది. ఈ లెక్కన రోజుకు 295 మంది అన్నమాట. నిరుడు 1,10,640 మంది ఫెంటనిల్ ఓవర్ డోస్ తో చనిపోయారు. అంటే రోజుకు 300 మంది. అయితే, ఐదేళ్ల కిందటే అమెరికా అధికారులు ఫెంటనిల్ ను సామూహిక విధ్వంసక ఆయుధంగా గుర్తించాలని కోరారు. అప్పుడు ట్రంప్ అధికారంలో ఉన్నారు. కానీ, స్పందన కొరవడింది. మళ్లీ అధ్యక్షుడు కాబోతున్న నేపథ్యంలో ట్రంప్ జూలు విదుల్చుతున్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే జనవరి 20న తన మొదటి ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ లలో ఒకటి.. మెక్సికో, కెనడా నుంచి వచ్చే అన్ని ఉత్పత్తులపై 25శాతం సుంకం విధించే పత్రాలపై సంతకం చేస్తానన్నారు.

డ్రాగన్ డ్రగ్..

అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఫెంటనిల్ ను పెయిన్ కిల్లర్ గా గతంలో ఆస్పత్రుల్లోనే వాడేవారు. ఇప్పుడు ఎక్కడపడితే అక్కడ వాడుతున్నారు. ఫెంటనిల్ చైనాలో చాలా చౌకగా తయారై వివిధ మార్గాల్లో అమెరికాకు చేరుతోంది. ముఖ్యంగా మెక్సికో డ్రగ్ గ్యాంగ్‌ ల చేతిలో పడడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. ఫెంటనిల్ తయారీపై గతంలో తాను చైనాకు సూచించినా ఉపయోగం లేకపోయిందని.. దాని ఉత్పత్తి ఆపేవరకు ఆ దేశం నుంచి వచ్చే ఉత్పత్తులపై అదనంగా 10 శాతం టారిఫ్ విధిస్తామని ట్రంప్ తాజాగా తెలిపారు. చైనా వస్తువులపై సైతం 10 శాతం సుంకం విధించాలని నిర్ణయించామన్నారు.

సరిహద్దు దేశాలైన మెక్సికో, కెనడా నుంచి ఫెంటనిల్ వస్తున్నా.. దాని మూలం చైనాలో ఉంది కాబట్టి మూడు దేశాలపైనా సుంకం విధిస్తానని ట్రంప్ చెప్పారు. ఫెంటనిల్ డీలర్లపై గరిష్ఠంగా మరణ శిక్ష విధిస్తామని చైనా గతంలో ఇచ్చిన హామీని ఉల్లంఘించిన వైనాన్ని కూడా ట్రంప ప్రస్తావించారు.