Begin typing your search above and press return to search.

బందీలను వదలకుంటే మీకు నరకమే.. హమాస్ కు ట్రంప్ డెడ్లీ వార్నింగ్

గత ఏడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్ పై అనూహ్య దాడులకు దిగింది హమాస్.. విచక్షణారహితంగా జరిపిన ఈ దాడుల్లో 1,100 మంది ప్రాణాలు కోల్పోయారు.

By:  Tupaki Desk   |   3 Dec 2024 7:31 AM GMT
బందీలను వదలకుంటే మీకు నరకమే.. హమాస్ కు ట్రంప్ డెడ్లీ వార్నింగ్
X

గత ఏడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్ పై అనూహ్య దాడులకు దిగింది హమాస్.. విచక్షణారహితంగా జరిపిన ఈ దాడుల్లో 1,100 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 250 మంది వరకు పౌరులను హమాస్ బందీలుగా చేసుకుంది. వీరిలో వివిధ దేశాల వారు ఉన్నారు. అత్యధికులు ఇజ్రాయెలీలు. అయితే, 100 మంది వరకు బందీలను వివిధ దశల్లో హమాస్ విడుదల చేసింది. మరో 50 మంది దాకా ప్రాణాలు కోల్పోయారని అంచనా. పద్నాలుగా హమాస్ చెరలో ఉన్న బందీల్లో 100 మంది కూడా జీవించి ఉండరని అంచనా.

బందీలే రక్షణ కవచంగా..

హమాస్ అగ్ర నేతలు యాహ్యా సిన్వర్ తదితరులు బందీలను అడ్డుగా పెట్టుకుని చాలా కాలం ఇజ్రాయెల్ దాడుల నుంచి రక్షణ పొందారు. దీంతోనే యుద్ధం ఇంతకాలంగా సాగుతోంది. ఇటీవల సిన్వర్ హతమయ్యారు. ఇపుడిక మిగిలిన ప్రధాన కర్తవ్యం బందీల విడుదల.

ట్రంప్ శపథం..

ఇప్పటికీ తమ చెరలో ఉన్న బందీల ఫొటోలు, వీడియోను ఇటీవల హమాస్‌ విడుదల చేసింది. వీటిపై అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టకముందే బందీలను విడిచిపెట్టాలని లేదంటే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈమేరకు తన సొంత సోషల్‌ మీడియా ట్రూత్ లో పోస్ట్‌ చేశారు.

బందీలను జనవరి 20నాటికి విడుదల చేయకుంటే..ఈ దురాగతాలకు పాల్పడేవారికి నరకం చూపిస్తానని తేల్చి చెప్పారు. చరిత్రలో చూడని పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.

వారం రోజుల్లో యుద్ధం ముగిస్తానని

తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే హమాస్-ఇజ్రాయెల్ యుద్ధాన్ని వారం రోజుల్లో ముగిస్తానని ట్రంప్ చెప్పారు. ఇప్పుడు ఆయన గెలిచిన నేపథ్యంలో ఏం చేస్తారో చూడాలి. కాగా, హమాస్ ఇప్పటికే తమ టాప్ లీడర్లను కోల్పోయింది. అయినా ఇజ్రాయెల్‌ పై ఒత్తిడి పెంచేందుకు చూస్తోంది. మిలిటెంట్ సంస్థ మిలిటరీ విభాగమైన అల్‌ కస్సామ్‌ బ్రిగేడ్‌ తాజాగా వీడియో బయటపెట్టింది.

బందీగా అమెరికన్ ఇజ్రాయెలీ

హమాస్ తాజా వీడియోలో అమెరికన్ ఇజ్రాయెల్‌ జాతీయుడైన 20 ఏళ్ల ఎడాన్‌ అలెగ్జాండర్‌ కూడా ఉన్నాడు. 420 రోజులుగా హమాస్‌ చెరలో ఉన్నట్లు వాపోయాడు. భయంతో రోజుకు వెయ్యిసార్లు చస్తున్నామని తెలిపాడు. తమను త్వరగా విడిపించాలని వేడుకున్నాడు. దీంతో ఎడాన్ తల్లి స్పందిస్తూ.. తన బిడ్డతో సహా బందీలందరి విడుదలకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని కోరారు. ఇదే సమయంలో డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా హెచ్చరికలు జారీచేశారు.