యూఎస్ థియేటర్లలో ట్రంప్ బయోపిక్!... ప్రచార బృందం విమర్శలు!
అగ్రరాజ్యం అమెరికాలో గత కొన్ని నెలలుగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలు హోరెత్తిపోతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 31 Aug 2024 6:15 AM GMTఅగ్రరాజ్యం అమెరికాలో గత కొన్ని నెలలుగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలు హోరెత్తిపోతున్న సంగతి తెలిసిందే. ఎన్నో ట్విస్టులు, మరెన్నో జలక్కులు, ఊహించని పరిణామలు, సరికొత్త అభియోగాలు, తుపాకీ చప్పులు.. వెరసి గతంలో ఎన్నడూ లెన్నంతగా అన్నట్లుగా ఈసారి అమెరికాలో అధ్యక్ష ఎన్నికల సందడి కొనసాగుతోంది.
ఈ సమయంలో.. యూఎస్ మాజీ ప్రెసిడెంట్, ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ బయోపిక్ "ది అప్రెంటీస్" థియేటర్లో సందడి చేయడానికి సిద్ధంగా ఉందని అంటున్నారు. ఇందులో భాగంగా... నవంబర్ లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. వాటికి అక్టోబర్ లో ఈ సినిమా విడుదల అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.
ఈ మేరకు యూఎస్, కెనడా థియేటర్లలోకి ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారని కథనాలు వస్తున్నాయి. ఇందులో భాగంగా... అక్టోబర్ 11న ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అలీ అబ్బాసీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ట్రంప్ గా ఎమ్మీ నామినీ సెబాస్టియన్ నటించారు!
వాస్తవానికి మేలో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించబడిన "ది అప్రెంటీస్"... 1970 - 80లలో న్యూయార్క్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తగా ట్రంప్ కెరీర్ సాగినప్పటి కథ అని చెబుతున్నారు. ఈ ప్రదర్శన తర్వాత యూరప్, ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ చిత్రన్ని పంపిణీ చేసినప్పటికీ.. యూఎస్ లో మాత్రం అనిశ్చితిని ఎదుర్కొంది.
అయితే ఇటీవల పలు చర్చల అనంతరం బ్రియార్ క్లిఫ్ ముందుకు వచ్చి.. ఈ చిత్ర దేశీయ పంపిణీ హక్కులను దక్కించుకున్నట్లు చెబుతున్నారు. దీంతో... ఈ సినిమాను ఎన్నికలకు కొన్ని వారాల ముందు థియేటర్లలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారని.. దీనికోసం అక్టోబర్ 11ని ముహూర్తంగా ఫిక్స్ చేశారని అంటున్నారు.
మరోపక్క ఈ సినిమాను ట్రంప్ ప్రచార బృందం విమర్శించింది. ఇందులో కొన్ని సన్నివేశాలు కల్పితమని, మాజీ అధ్యక్షుడి ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని ఆరోపించింది. ఇదే సమయంలో... దీన్ని ఓ చెత్త చిత్రంగా కొట్టిపారేస్తూ.. హాలీవుడ్ ప్రముఖుల కుట్రగా అభివర్ణించింది. ఈ ఆరోపణలపై డైరెక్టర్ అబ్బాసీ స్పందించారు.
ఇందులో భాగంగా.. సినిమా చూడకుండా దీనిపై విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. ఈ సినిమా చూసిన తర్వాత ట్రంప్ కచ్చితంగా ఆశ్చర్యపోతారని, ఆయన ఎట్టిపరిస్థితుల్లోనూ ఆగ్రహించరని చెప్పుకొచ్చారు. కాగా... ట్రంప్ దాదాపు దశాబ్ధం పాటు నడిపిన టీవీ సిరీస్ టైటిల్ ను తలపించేలా ఈ బయోపిక్ కు "ది అప్రెంటిస్" టైటిల్ ను ఎంచుకున్నారు!