యూఎస్ లో వేల మంది భారతీయులకు కొత్త టెన్షన్ తెచ్చిన ట్రంప్!
తాజాగా యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టంస్ ఎన్ ఫోర్స్ మెంట్ గణాంకాలు విడుదల చేసింది. వీటిలో మొత్తం 14.45 లక్షల మంది జాబితా ఉందని అంటున్నారు.
By: Tupaki Desk | 14 Dec 2024 8:30 PM GMTఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించినప్పటి నుంచీ చాలా దేశాల్లో చాలా మందికి చాలా రకాల టెన్షన్ మొదలయ్యాయనే చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో విద్యార్థులు, ఉద్యోగులు అనే తారతమ్యాలేమీ లేవని అంటున్నారు. ఈ సమయంలో మరో టెన్షన్ విషయం తెరపైకి వచ్చింది.
అవును.. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైనప్పటి నుంచీ రకరకాల టెన్షన్ తెరపైకి వస్తోన్న సంగతి తెలిసిందే! ఇందులో ప్రధానంగా.. ప్రమాణ స్వీకారం అనంతరం అక్రమ వలసదారులపై చర్యలు చేపడతాననై ట్రంప్ బలంగా చెబుతున్నరు. వీటికి అనుగుణంగానే అధికారులకు అదేశాలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని అంటున్నారు.
మరోపక్క అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు కూడా అటువంటి వారి జాబితా రూపొందించే పనిలో ఉన్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే సుమారు 18 వేల మంది ప్రవాస భారతీయులు అమెరికా డీపోర్టేషన్ ముప్పు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో... ఈ విషయం ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది.
తాజాగా యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టంస్ ఎన్ ఫోర్స్ మెంట్ గణాంకాలు విడుదల చేసింది. వీటిలో మొత్తం 14.45 లక్షల మంది జాబితా ఉందని అంటున్నారు. వీటిలో 2,61,651 మందితో హోండరస్ ఫస్ట్ ప్లేస్ లో ఉందని.. రెండున్నర లక్షల మందితో గ్వాటెమాలా రెండో స్థానంలో ఉందని చెబుతున్నారు.
ఇదే క్రమంలో... మెక్సికో, ఎల్ సాల్వేడార్ దేశాలకు చెందినవారు అధిక సంఖ్యలో ఉన్నారని అంటున్నారు. ఇదే సమయంలో చైనీయులు సుమారు 37,000 మంది ఉండగా... ఈ జాబితాలోనే భారతీయులు కూడా సుమారు 18 వేల మంది (17,940) మంది భారతీయులు కూడా ఉన్నట్లు యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టంస్ ఎన్ ఫోర్స్ మెంట్ నివేదిక పేర్కొంది.
మరోపక్క చట్టబద్ధంగా వలస వచ్చేవారికి మార్గం సులువు చేస్తానని కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే అక్రమంగా ప్రవేసించిన వారిపై మాత్రం కఠిన చర్యలు తప్పవనే చర్చ బలంగా మొదలైంది.