Begin typing your search above and press return to search.

ట్రంప్ నోట ఐరన్ డోమ్ మాట... త్వరలో కీలక నిర్ణయం!

ఇజ్రాయెల్ ఆయుధ వ్యవస్థ గురించి మాట్లాడుకునేటప్పుడు ముందుగా గుర్తొచ్చేది ఐరన్ డోమ్ అని చెప్పినా అతిశయోక్తి కాదు.

By:  Tupaki Desk   |   28 Jan 2025 4:32 AM GMT
ట్రంప్  నోట ఐరన్  డోమ్  మాట... త్వరలో కీలక నిర్ణయం!
X

ఇజ్రాయెల్ ఆయుధ వ్యవస్థ గురించి మాట్లాడుకునేటప్పుడు ముందుగా గుర్తొచ్చేది ఐరన్ డోమ్ అని చెప్పినా అతిశయోక్తి కాదు. శత్రువులు ఎన్ని దాడులు చేసినా ఏమాత్రం అదరకుండా బెదరకుండా నిలబడటానికి కారణం ఆ దేశం కలిగి ఉన్న దుర్భేద్యమైన ఐరన్ డోమ్. ఇప్పుడు అలాంటి ఐరన్ డోమ్ తమకూ కావాలని ఫిక్సయిన డొనాల్డ్ ట్రంప్.. అందుకు సిద్ధమవుతున్నారు.

అవును... ఇజ్రాయెల్ కు ఉన్న ఆయుధ వ్యవస్థలో ఐరన్ డోమ్ ప్రత్యేకతే వేరు. ఇటీవల హమాస్ తో పాటు పలు ప్రత్యర్థి దేశాలు, మూకలు ఎన్ని క్షిపణులను ప్రయోగించినా.. ఐరన్ డోమ్ అడ్డుగా నిలబడిపోయింది.. వాటన్నింటినీ అడ్డుకుంది. అటువంటి ఉక్కు కవచం తమకు కూడా కావాలని అంటోంది.. అమెరికా అందుకు సిద్ధమవుతుంది.

తాజాగా ఈ విషయాలపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అత్యవసరంగా ఓ ఐరన్ డోమ్ నిర్మాణం జరగాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో.. త్వరలోనే ఆ ఫైల్ పై సంతకం చేస్తానని వెల్లడించారు. ఇలా సడన్ గా ట్రంప్ కు ఐరన్ డోమ్ ఆలోచన ఎందుకు వచ్చిందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

కాగా... హెజ్బొల్లా – ఇజ్రాయెల్ మధ్య 2006లో ఘర్షణ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో వేల రాకెట్లను హెజ్బొల్లా.. టెల్ అవీవ్ పై ప్రయోగించింది. దీంతో... ఇజ్రాయెల్ లో భారీ ప్రాణనష్టం చోటు చేసుకుంది. ఈ సమయంలో.. ఇజ్రాయెల్ మదిలో సరికొత్త ఆలోచన వచ్చింది.. అదే ఐరన్ డొమ్. అనుకున్నదే తడవుగా పని మొదలుపెట్టింది.

ఈ సమయంలో ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తయారీకి అమెరికా పూర్తిగా సాయం చేసింది. దీంతో... 2011 కల్లా ఇజ్రాయెల్ ఆయుధ వ్యవస్థలో ఉక్కు కవచంలా ఐరన్ డోమ్ వచ్చి చేరింది. అటు 100 - 200 కిమీ దూరంలో ఉన్న బాలిస్టిక్ క్షిపణులను ఎదుర్కోవడంతో పాటు డ్రోన్లను కూల్చివేయడంలోనూ ఈ ఐరన్ డోమ్ కీలక పాత్ర పోషిస్తుంది.

అటువంటి ఉక్కు కవచం అమెరికా కోసమూ నిర్మాణం జరగాల్సిన అవసరం ఉందని చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. త్వరలోనే దానికి సంబంధించిన ఫైల్ పై సంతకం చేస్తానని వెల్లడించారు.