టెస్లా సంక్షోభం వేళ.. డిస్కౌంట్ వద్దని టెస్లా కారు కొన్న డొనాల్డ్ ట్రంప్..
మంగళవారం టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఐదు టెస్లా కార్లను వైట్ హౌస్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆయన స్వయంగా ట్రంప్‌కు టెస్లా కార్ల ప్రత్యేకతలను వివరించారు.
By: Tupaki Desk | 12 March 2025 1:54 PM ISTఅమెరికా వ్యాప్తంగా ఎలాన్ మస్క్ నాయకత్వంలోని డోజ్ శాఖ నిర్ణయాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితిలో టెస్లా కార్లను బహిష్కరించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. అయితే ప్రపంచ కుబేరుడికి మద్దతుగా నిలిచిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా కారును స్వయంగా కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించడంతో చర్చకు తెరలేసింది. తాజా ఘటనలో ట్రంప్ నిజంగానే టెస్లా కారును కొనుగోలు చేశారు.
మంగళవారం టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఐదు టెస్లా కార్లను వైట్ హౌస్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆయన స్వయంగా ట్రంప్‌కు టెస్లా కార్ల ప్రత్యేకతలను వివరించారు. ఈ సందర్భంగా ట్రంప్ ఎరుపు రంగు టెస్లా మోడల్‌ను ఎంచుకుని కొనుగోలు చేశారు. కారులోకి ఎక్కిన ట్రంప్ "ఇది చాలా అందంగా ఉంది" అని వ్యాఖ్యానించారు.
మస్క్ సరదాగా మాట్లాడుతూ "ఇది అత్యంత వేగంగా వెళ్లే కారు. సీక్రెట్ సర్వీస్‌కు ఓసారి హార్ట్ ఎటాక్ ఇచ్చేద్దామా?" అని జోక్ చేశారు. అయితే ట్రంప్‌కు వాహనం నడిపేందుకు అనుమతి లేకపోవడంతో ఆయన టెస్ట్ డ్రైవ్‌కు వెళ్లలేదు. అనంతరం వీరిద్దరూ కలిసి మీడియాతో మాట్లాడారు. ట్రంప్ మాట్లాడుతూ "ఈ కారును పూర్తి ధర అయిన 80,000 డాలర్లకు కొనుగోలు చేశాను. మస్క్ నాకు డిస్కౌంట్ ఇచ్చే అవకాశం ఉంది. కానీ నేను రాయితీ తీసుకుంటే విపక్షాలు విమర్శలు చేస్తాయి. అందుకే పూర్తిగా స్వయంగా కొనుగోలు చేశాను" అని వివరించారు.
ఇటీవల డోజ్ అధినేతగా మస్క్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి టెస్లా షేర్లు తీవ్రంగా పతనమవుతున్నాయి. గత నెలలో టెస్లా షేర్ల విలువ 30% పడిపోయింది, ఇక సోమవారం మాత్రమే 15% క్షీణించింది. అలాగే కంపెనీ విక్రయాలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ టెస్లా కారును కొనుగోలు చేయడం, మార్కెట్‌లో కొత్త చర్చకు దారి తీసింది.