మళ్లీ అధ్యక్షుడైతే.. అమెరికా రహస్యాలు చెప్పేస్తా: ట్రంప్
డొనాల్డ్ ట్రంప్ అంటే అంతే.. నోటికి ఏది వస్తే అది మాట్లాడేయడమే.. తన ప్రత్యర్థి, డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి అయిన కమలా హ్యారిస్ ను మహిళ అని కూడా చూడకుండా ఆయన దూషిస్తున్నారు.
By: Tupaki Desk | 4 Sep 2024 11:26 AM GMTడొనాల్డ్ ట్రంప్ అంటే అంతే.. నోటికి ఏది వస్తే అది మాట్లాడేయడమే.. తన ప్రత్యర్థి, డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి అయిన కమలా హ్యారిస్ ను మహిళ అని కూడా చూడకుండా ఆయన దూషిస్తున్నారు. గతంలో అధ్యక్షుడిగా ఉన్నప్పుడూ అంతే.. కొవిడ్ ను చైనా వైరస్ అని తేల్చేశారు. తాను గనుక అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికే దిగేది కాదంటారు. ఇలా చెప్పుకొంటూ పోతే ఆయన మాటలకు అంతే ఉండదు. కాగా, మరోసారి అధ్యక్షుడిగా పోటీ పడతానని గత ఎన్నికల్లో ఓటమి సమయంలోనే చెప్పిన ట్రంప్.. ఇప్పుడు ప్రచారంలోనూ దూకుడు కనబరుస్తున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు.
యూఎఫ్ వోలు ఉన్నాయా?
మిగతా ప్రపంచ దేశాలు నమ్మినా నమ్మకున్నా.. గ్రహాంతర జీవులు ఉన్నాయనేది అమెరికన్ల బలమైన నమ్మకం. అది అభద్రతాభావంతో వచ్చిందో లేక మరేదైనా కారణమో కానీ.. అమెరికన్లు యుద్ధాల కంటే గ్రహాంతర వాసులంటేనే భయపడతారు. ఎగిరే సాసర్ (యూఎఫ్ వో)లలో గ్రహాంతర వాసులు వస్తారని వారి నమ్మకం. దీనికి సంబంధించి రహస్యాలు కూడా ఉన్నట్లు భావిస్తారు. ఇప్పుడు తాను మళ్లీ అధ్యక్షుడినయితే యూఎఫ్‌వోల సంచారం గురించి బయటపెడతానని అంటున్నారు ట్రంప్.
ఆ హత్యను తేల్చేస్తారట..?
అమెరికా చరిత్రలో అధ్యక్షుడిగా ఉన్న జాన్ ఎఫ్ కెన్నడీ హత్య పెద్ద సంచలనం. ఈ హత్య రహస్యంతో పాటు ఎప్ స్టైన్ సెక్స్ కుంభకోణంలో నిందితుల వివరాలను కూడా బయటపడతానని ట్రంప్ ప్రకటించారు. ఇవన్నీ అమెరికా చరిత్రలో అత్యంత రహస్యాలు కావడం గమనార్హం. కాగా, కెన్నడీ విషయంలో ప్రత్యర్థి డెమోక్రాట్లే తనను ముందుకు నెడుతున్నారని ఆరోపించారు. అయితే, ఇప్పటికే చాలా కాగితాలను విడుదల చేసినట్లు తెలిపారు. ఈ విషయంలో చాలామంది వద్దని వారిస్తున్నా తగ్గేది లేదని చెప్పారు.
ఏమిటీ ఎప్ స్టైన్ కేసు?
కెన్నడీ హత్య, యూఎఫ్ వోల గురించి తెలిసినా.. ఎప్ స్టైన్ కేసు ఏమిటనే సందేహం సహజం. సెక్స్ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ ఎప్ స్టైన్ కేసు ఫైల్స్ విషయమై ట్రంప్ స్పందించారు. తాను నేరం చేయలేదని.. ఆ స్కాంలో భాగస్వామి కాలేదని తెలిపారు. చాలామంది వెళ్లినా.. ఎప్ స్టైన్ కు చెందిన విలాసవంతమైన ద్వీపానికి ఎన్నడూ వెళ్లలేదని చెప్పారు. కొంతమందిని కాపాడేందుకు ఆ ద్వీపాన్ని సందర్శించిన వారి జాబితాను బయట పెట్టడం లేదని, తాను ఆ పని చేస్తానని పేర్కొన్నారు.
కాగా, మాజీ అధ్యక్షుడు కెన్నడీ కుటుంబానికి చెందిన రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్ అధ్యక్ష ఎన్నికల నుంచి వైదొలగినట్లు ప్రకటించి ట్రంప్ వైపు నిలిచారు. దీంతో జాన్ ఎఫ్ కెన్నడీ హత్య దర్యాప్తు ఫైల్స్ ను విడుదల చేస్తానని ట్రంప్ ప్రకటించారని భావిస్తున్నారు. కాగా, కెన్నడీ కుటుంబం డెమోక్రాట్లు. అంటే.. కమలా హారిస్ పార్టీ. వీరు రిపబ్లికన్ పార్టీకి చెందిన ట్రంప్ నకు మద్దతు తెలిపారు.