Begin typing your search above and press return to search.

భారత్ 'సుంకాల రాజు'... పాత పాట ఎత్తుకున్న ట్రంప్ కీలక వ్యాఖ్యలు!

అవును... 2019లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో భారత్ ను "సుంకాల రాజు" అంటూ వ్యాఖ్యానించిన ట్రంప్... మరోసారి సుంకాల విషయంలో భారత్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   12 Oct 2024 3:46 AM GMT
భారత్ సుంకాల రాజు... పాత పాట ఎత్తుకున్న ట్రంప్ కీలక వ్యాఖ్యలు!
X

మరికొన్ని వారాల్లో జగరనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార కార్యక్రమాలు హోరెత్తిపోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధానంగా ఇమ్మిగ్రేషన్, అక్రమవలసలు, దేశ ఆర్థిక విధానాలు, దౌత్యపరమైన సంబంధాలు, అబార్షన్ పై హక్కులు, స్థానికులకు ఉద్యోగాలు మొదలైన అంశాలపై హామీలు కీలకంగా మారాయని అంటున్నారు.

ఈ సమయంలో డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారీస్ బ్యాలెన్స్డ్ గా మాట్లాడుతున్నారని అంటుంటే.. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పూర్తిగా అమెరికన్ల ఎమోషన్ ని క్యాష్ చేసుకునే దిశగా కామెంట్లు చేస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి! ఈ నేపథ్యంలో సుంకాల విషయంలో భారత్ పై గతంలో చేసిన వ్యాఖ్యలు మరోసారి చేశారు ట్రంప్.

అవును... 2019లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో భారత్ ను "సుంకాల రాజు" అంటూ వ్యాఖ్యానించిన ట్రంప్... మరోసారి సుంకాల విషయంలో భారత్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... అమెరికా ఉత్పత్తులపై భారత్ అధిక సుంకాలు విధిస్తోందంటూ అసహనం వ్యక్తం చేశారు రిపబ్లికన్ అభ్యర్థి.

ఈ సందర్భంగా హార్లే-డేవిడ్ సన్ దిగుమతి పన్నులను ఉదహరిస్తూ.. భారతదేశం నుంచి ఎదురవుతున్న సుంకాలు 150శాతం ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు. తన ఉద్దేశ్యంలో చైనా కంటే చాలా రకాలుగా భారత్ ఎక్కువ వసూలు చేస్తుందని.. కాకపొతే చిరునవ్వుతో చేస్తుందని చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా తాను అధ్యక్ష ఎనికల్లో గెలిస్తే... భారత్ నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులపై సుంకాల భారం పెంచుతామని ప్రకటించారు. డెట్రాయిట్ లో నిర్వహించిన ఓ సదస్సులో ప్రసంగించిన ట్రంప్... భారత్ తో పాటు చైనా, బ్రెజిల్ కూడా అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలు వసూలు చేస్తున్నాయంటూ మండిపడ్డారు.

అమెరికాను మళ్లీ సుసంపన్నంగా మార్చడమే తన లక్ష్యమని అన్నారు. ఇలా భారత్ ను గిల్లినట్లు మాట్లాడిన ట్రంప్.. అనంతరం జోలపాడుతూ సన్నాయినొక్కులు నొక్కే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా.. భారత్ సుంకాలు ఎక్కువగా విధిస్తున్నప్పటికీ.. అమెరికాతో మంచి బంధం ఉందని.. మోడీ గొప్ప నాయకుడని చెప్పుకొచ్చారు.