'జనవరి 20న కలుద్దాం'... జనవరి 01 పై ట్రంప్ ఫైర్!
ఈ ఘటనలో ఎవరూ మృతి చెందనప్పటికీ.. సుమారు 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ వరుస ఘటనల నేపథ్యంలో ట్రంప్ స్పందించారు.
By: Tupaki Desk | 3 Jan 2025 1:30 PM GMTఅమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా డెమోక్రాట్లపై ఫైర్ అయ్యారు. ఈ ఏడాది న్యూ ఇయర్ వేడుకల వేళ (జనవరి 1, బుధవారం) అమెరికాలో వరుస ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో.. ప్రస్తుత పాలకులపై ఆయన మండిపడ్డారు. అమెరికాను ప్రపంచం ముందు నవ్వులపాలు చేశారంటూ ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.
అవును... బుధవారం న్యూ ఆర్లీన్స్ లో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఓ దుండగుడు తన వాహనంతో బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 15 మంది మృతి చెందడం తీవ్ర కలకలం సృష్టించింది. ఇదే సమయంలో లాస్ వెగాస్ లోని డొనాల్డ్ ట్రంప్ కు చెందిన ఇంటర్నేషనల్ హోటల్ బయట మస్క్ కు చెందిన కంపెనీ ‘టెస్లా’ కారులో పేలుడు జరిగింది.
ఈ ఘటనలోనూ ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో సుమారు ఏడుగురు ఈ పేలుడు ఘటనలో గాయపడ్డారు. ఇక.. న్యూయార్క్ లోని క్వీన్స్ కౌంటీకి చెందిన నైట్ క్లబ్ లో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఎవరూ మృతి చెందనప్పటికీ.. సుమారు 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ వరుస ఘటనల నేపథ్యంలో ట్రంప్ స్పందించారు. బైడెన్ సర్కార్ పై మండిపడ్డారు.
ఇందులో భాగంగా... ప్రపంచమంతా అమెరికాను చూసి నవ్వుతోందని.. సరిహద్దులు తెరిచి పెట్టడమే అమెరికా విఫలమయ్యిందనే ఘటనలు చోటు చేసుకున్నాయని.. దీనికి కారణం బలహీనమైన, అసమర్థ నాయకత్వమే అని ట్రంప్ ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా... డిపార్ట్ మెంట్ ఆఫ్ జస్టిస్ (డీఓజే), ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్.బీ.ఐ.)లపై కామెంట్స్ చేశారు.
ఇందులో భాగంగా... డెమోక్రట్ల ప్రభుత్వం, లోకల్ అడ్వకేట్స్, డీఓజే, ఎఫ్.బీల్.ఐ. లు తమ తమ విధిని సరిగ్గా నిర్వర్తించడం లేదని.. వారు తమ రాజకీయ ప్రత్యర్థులపై దాడి చేయడానికే ఎక్కువ సమయాన్ని వెచ్చించారని.. దేశం లోపల, బయట జరుగుతున్న దాడుల నుంచి అమెరికన్లను రక్షించడపై వారూ దృష్టి సారించలేదని విమర్శించారు.
దేశంలో ఇలాంటి ఘటనలు జరిగినందుకు డెమోక్రట్లు సిగ్గుపడాలని.. ఈ సమయంలో మరింత ఆలస్యం కాకముందే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రంగంలోకి దిగాలని ట్రంప్ సూచించారు. ఇదే సమయంలో.. అమెరికాలో క్షీణిస్తోన్న జాతీయ భద్రతా బలమైన నాయకత్వం ఉన్నప్పుడే ఆపగలదని చెబుతూ.. జనవరి 20న కలుద్దాం అని రాసుకొచ్చారు డొనాల్డ్ ట్రంప్.