Begin typing your search above and press return to search.

హమస్ కు ట్రంప్ డెడ్ లైన్

గాజా కాల్పుల విరమణను ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తుందన్న ఆరోపణలు చేస్తూ.. తదుపరి బందీల విడుదల ఆలస్యం చేస్తామని హమాస్ పేర్కొన్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   11 Feb 2025 4:55 AM GMT
హమస్ కు ట్రంప్ డెడ్ లైన్
X

సంచలనాల మీద సంచలనాల్ని నమోదు చేసేలా నిర్ణయాల్ని తీసుకోవటం.. మెరుపువేగంతో ఆదేశాల్ని జారీ చేయటం లాంటి పనుల్ని చేస్తున్న ట్రంప్.. తాజాగా హమస్ కు తీవ్రమైన డెడ్ లైన్ పెట్టేశారు. ఈ సందర్భంగా సీరియస్ వార్నింగ్ ఇవ్వటం గమనార్హం. గాజా కాల్పుల విరమణను ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తుందన్న ఆరోపణలు చేస్తూ.. తదుపరి బందీల విడుదల ఆలస్యం చేస్తామని హమాస్ పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు.

శనివారం నాటికి బందీలను విడుదల చేయకపోతే నరకం చూపిస్తానన్న భారీ వార్నింగ్ ను ఇచ్చేశారు ట్రంప్. వైట్ హౌస లో మీడియాతో మాట్లాడిన ట్రంప్.. ‘‘హమస్ చర్య భయంకరమైనది. కాల్పుల విరమణ విషయంలో అంతిమంగా ఏం జరగాలన్నది ఇజ్రాయెల్ నిర్ణయం. నా వరకు నాకు మాత్రం శనివారం మధ్యాహ్నం 12 గంటల్లోపు బందీలందరినీ విడుదల చేయాలి. లేకుంటే నరకం ఎదుర్కోవాల్సి ఉంటుంది. పరిస్థితులు ఉద్రిక్తంగా ఉంటాయి. కాల్పుల విరమణ ఒప్పందం రద్దుకు పిలుపునిస్తా. దీనిపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుతో మాట్లాడతా’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాల్పుల విరమణ డీల్ ను ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తోందని హమస్ ఆరోపణలు చేయటం తెలిసిందే. తాజా ఒప్పందంలో భాగంగా పలు దఫాలుగా 21 మంది బందీలను హమాస్ విడుదల చేయగా.. అందుకు బదులుగా 730 మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. తదుపరి విడుదల ప్రక్రియ శనివారానికి షెడ్యూల్ చేసింది. అయితే.. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తోందన్న ఆరోపణలతో బందీల విడుదల ప్రక్రియ ఆలస్యమవుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే స్పందించిన ట్రంప్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.కొద్ది రోజుల క్రితమే గాజాను స్వాధీనం చేసుకొని పునర్ నిర్మిస్తామంటూ ట్రంప్ ప్రతిపాదన పెను సంచలనంగా మారటం తెలిసిందే.