భారతీయులలో కలవరం : కొంప ముంచుతున్న ట్రంప్
అమెరికాకు మొదటిసారి అధ్యక్షుడు అయిన డొనాల్డ్ ట్రంప్ వేరు. రెండోసారి 2025 జనవరి 20న తాజాగా ప్రమాణ చేసిన ట్రంప్ వేరు.
By: Tupaki Desk | 31 Jan 2025 3:49 AM GMTఅమెరికాకు మొదటిసారి అధ్యక్షుడు అయిన డొనాల్డ్ ట్రంప్ వేరు. రెండోసారి 2025 జనవరి 20న తాజాగా ప్రమాణ చేసిన ట్రంప్ వేరు. చాలా తేడా చూపిస్తున్నారు అధ్యక్షుడు ట్రంప్. అమెరికా ఫస్ట్ అన్నది ఆయన నినాదం కాస్తా ప్రమాణం చేసిన వెంటనే బలమైన విధానంగా మారిపోయింది. దాంతో అనేకే సంచలన నిర్ణయాలను ట్రంప్ తీసుకుంటున్నారు.
అవన్నీ భారతీయుల కొంపలు ముంచేలా ఉన్నాయి. అంతే కాదు సగటు భారతీయుల కలలను చిదిమేసేలా ఉన్నాయి. అమెరికాలో అక్రమ వలసలను నిషేధిస్తామని ట్రంప్ ప్రకటించారు. దాంతో చాలా మంది ఇబ్బందులో పడ్డారు. దానికి భారత్ కూడా సహకరిస్తామని చెప్పడంతో ఏ కారణం చేతనైనా అలా అక్కడ ఉంటే కనుక ఇదివరకు మాదిరిగా చూసీ చూడనట్లుగా వదిలేసేది ఉండదు, దాంతో ఇది ఒక పెద్ద విషయంగా ఉంది. ఈ దెబ్బకు చాలా పెద్ద సంఖ్యలో అమెరికా వదలాల్సిందే అని అంటున్నారు.
దాంతో పాటుగా జన్మతః వచ్చే పౌరసత్వం సైతం ట్రంప్ రద్దు చేశారు. దానికి ఒక డెడ్ లైన్ పెట్టేశారు. ఇక మీదట అమెరికా గడ్డ మీద పుట్టినా కూడా వారికి పౌరసత్వం ఉండదన్న మాట. మరో వైపు చూస్తే అమెరికాలో చదువుకుంటూ పార్ట్ టైం జాబ్స్ చేసే వారికి మంట పెట్టేశారు. అలా చేస్తే జైలుకే అని ఆర్డర్ వేశారు. నిజానికి ఇది అమెరికా రూల్స్ లో ఉంది.
విదేశీయులు ఒక పని మీద వచ్చి మరో పని చేయడం అంటే నేరమే. వారు చదువుకోవడానికే వచ్చారు. ఆ పని చేయకుండా ఉద్యోగాలు చేస్తామంటే కుదరదు. ఇపుడు ఆ రూల్స్ ని తవ్వి తీసి కఠినంగా ట్రంప్ అమలు చేయాలని చూస్తున్నారు. దీంతో అమెరికా చదువులు ఉన్నత ఉద్యోగాల కోసం ఎంతో మంది అక్కడికి వెళ్ళి తమ ఆర్ధిక పరిస్థితులు చూసుకుంటూ అవసరార్ధం పోషించుకుంటూ బ్యాంక్ లోన్లను తీర్చుకుంటూ మెల్లగా కాలం వెళ్ళదీస్తున్నారు.
ఇపుడు అలాంటి వారు అంతా నెలకు లక్ష నుంచి రెండు లక్షల వరకూ ఇండియాలోని వారి కుటుంబం మీద ఆధారపడి అమెరికాకు తెచ్చుకోవాలి. పైగా బ్యాంకు లోన్లు వారిని వెంటాడుతాయి. ఇవేమీ చేయలేకపోతే అర్ధాంతరంగా చదువుకు స్వస్తి పలికి వెనక్కి వచ్చేయాల్సి ఉంటుంది. దాంతో మధ్యతరగతి వర్గాల నుంచి ఇటీవల కాలంలో అమెరికాకు అత్యధికంగా వెళ్తున్న వారి కలలను ట్రంప్ నిర్ణయాలు చిదిమేసాయని అంటున్నారు
ఇక స్థానిక నినాదం కూడా వినిపిస్తోంది. అమెరికా ఫస్ట్ అంటూ అక్కడి వారికే జాబ్స్ అన్న రూల్స్ ని కూడా ట్రంప్ తీసుకుని వస్తారేమో అన్న బెంగా కలవరం అందరిలో ఉన్నాయి. ట్రంప్ తలచుకుంటే చేసేస్తారు. ఆయన దూకుడు అలాంటిది మరి. అయితే అది కాస్తా భారతీయుల మీద పెను ప్రభావమే చూపిస్తోంది అని అంటున్నారు.
మొత్తానికి మారిన ట్రంప్ తో ఇదివరకు మాదిరిగా ఇండియా స్నేహం ఇపుడు సాధ్యపడుతుందా అన్నదే ప్రశ్నగా ఉంది. అంతే కాదు దిగుమతి సుంకాలను పెంచడంతో పాటు అనేక నిర్ణయాలతో ట్రంప్ భారత్ లాంటి దేశాలకు ఇబ్బంది పెట్టేలాగే ముందుకు సాగుతున్నారు అని అంటున్నారు. సో కొంప ముంచుతున్న ట్రంప్ అని అంతా అతి తక్కువ రోజులకే అనుకోవాల్సి వస్తోందిట. ఈ డెబ్బై తొమ్మిదేళ్ళ ట్రంప్ రానున్న నాలుగేళ్ళ కాలంలో అంతటు సుదీర్ఘ సమయంలో ఏ సంచలన నిర్ణయాలు తీసుకుంటారో అన్నది అందరినీ కలవరపెడుతోంది.