Begin typing your search above and press return to search.

ఈ సారి శాస్త్రవేత్తలు, పరిశోధకులపై పడ్డ ట్రంప్

ట్రంప్ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ సంస్థకు నిధులు తగ్గించడంతో వందల సంఖ్యలో శాస్త్రవేత్తలు, పరిశోధకులను తొలగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   19 March 2025 3:30 PM IST
ఈ సారి శాస్త్రవేత్తలు, పరిశోధకులపై పడ్డ ట్రంప్
X

అమెరికాలో శాస్త్రవేత్తలు, పరిశోధకులు ప్రస్తుతం తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో ఇప్పటికే వేలాది మంది ఫెడరల్ ఉద్యోగులు, యూఎస్‌ ఎయిడ్ సిబ్బంది ఉద్యోగాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా, పర్యావరణ పరిరక్షణ సంస్థ (EPA)లో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు, పరిశోధకులపై కూడా తొలగింపు కత్తి వేలాడుతోంది.

ట్రంప్ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ సంస్థకు నిధులు తగ్గించడంతో వందల సంఖ్యలో శాస్త్రవేత్తలు, పరిశోధకులను తొలగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. తొలగించబడని వారిని ఇతర ప్రభుత్వ ఏజెన్సీలకు బదిలీ చేసే అవకాశం కూడా ఉంది. కాలుష్యం, నీటి శుద్ధి, వాతావరణ మార్పులు వంటి కీలకమైన పర్యావరణ అంశాలపై పనిచేస్తున్న దాదాపు 1500 మంది శాస్త్రవేత్తలు ఈ తొలగింపు ప్రభావానికి గురయ్యే ప్రమాదం ఉంది.

ఈ విషయంపై డెమోక్రటిక్ చట్టసభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో శాస్త్రవేత్తలను తొలగిస్తే పర్యావరణ పరిరక్షణపై తీవ్ర ప్రభావం చూపుతుందని వారు హెచ్చరిస్తున్నారు. అయితే, ట్రంప్ ప్రభుత్వం మాత్రం ఫెడరల్ వ్యవస్థలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం ద్వారా ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో జరిగిన ఒక కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ, EPAను పర్యవేక్షించడానికి నియమించబడిన 17,000 మంది సిబ్బందిలో దాదాపు 65 శాతం మందిని తగ్గించాలని యోచిస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఈ తొలగింపు వార్తలపై EPA ప్రతినిధి మోలీ వాసెలియో స్పందించారు. ఏజెన్సీ సంస్థాగత మెరుగుదలను తదుపరి దశకు తీసుకెళ్లడానికి చర్యలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు. ప్రజలందరికీ స్వచ్ఛమైన గాలి, నీరు, భూమిని అందించడానికి తమ సామర్థ్యాన్ని పెంచడానికి తాము కట్టుబడి ఉన్నామని ఆమె పేర్కొన్నారు. తొలగింపుల గురించి ఎటువంటి నిర్దిష్ట నిర్ణయాలు తీసుకోనప్పటికీ, సంస్థ ఎల్లప్పుడూ సమర్థవంతంగా పనిచేయడానికి అవసరమైన మార్పులు చేస్తున్నామని ఆమె వెల్లడించారు.

మరోవైపు ప్రభుత్వంలో అనవసరపు ఖర్చులను తగ్గించడానికి కృషి చేస్తున్న ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్ (DOGE) కూడా ఇప్పటికే అనేక మంది యూఎస్‌ ఎయిడ్ ఉద్యోగులపై వేటు వేసింది. ప్రభుత్వ సంస్థల్లో వృథా ఖర్చులను తగ్గించడానికి మరికొంత మంది ఉద్యోగులను తొలగించేందుకు చర్యలు తీసుకుంటోంది. డోజ్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలను ట్రంప్ సైతం సమర్థిస్తున్నారు.

ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ తొలగింపు నిర్ణయాలు అమెరికాలోని శాస్త్రవేత్తలు, పరిశోధకుల్లో తీవ్ర భయాందోళనలు కలిగిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కీలకమైన పరిశోధనలు నిలిచిపోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. రానున్న రోజుల్లో ఈ పరిస్థితి ఎలా మారుతుందో వేచి చూడాలి.