'అపర కుబేర' @ ట్రంప్ కార్యవర్గం.. 172 దేశాల జీడీపీని మించి ఆస్తులు
అయితే, అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యవర్గంలోని కుబేరుల ఆస్తుల విలువ.. వీటిలోని 172 దేశాల జీడీపీ కంటే ఎక్కువట.
By: Tupaki Desk | 11 Dec 2024 3:30 PM GMTసహజంగా ఆయనే అపర కుబేరుడు.. అగ్ర రాజ్యం అమెరికా రియల్ ఎస్టేట్ లో దిగ్గజం అనదగ్గ వాడు.. తండ్రి నుంచి సంక్రమిచిన ఆస్తిని మరింత పెంచి.. మల్టీ బిలీయనీర్ అయ్యారు. అలాంటాయన రాజకీయాల్లో ప్రవేశించి.. మరింత పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు రెండోసారి అధ్యక్షుడు కాబోతున్నారు. అయితే, గతం కంటే భిన్నంగా తన కార్యవర్గాన్ని తయారు చేసుకుంటున్నారు. అది కూడా అలా ఇలా కాదు... అత్యంత ధనవంతులతో..
అంతా అత్యంత ధనవంతులే..
ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి గుర్తించిన దేశాలు 195. అయితే, అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యవర్గంలోని కుబేరుల ఆస్తుల విలువ.. వీటిలోని 172 దేశాల జీడీపీ కంటే ఎక్కువట. దీన్నిబట్టే అదెంత కుబేర కార్యవర్గమో తెలిసిపోతోంది. అసలు అమెరికా అంటేనే అవకాశాల స్వర్గధామం.. ప్రపంచంలోనే సంపన్న దేశం.. అలాంటి దేశంలో అత్యంత సంపన్నులంతా ట్రంప్ కొత్త కార్యవర్గంలో ఉండనున్నారు. ఓ విధంగా చెప్పాలంటే ఓ సంపన్న దేశం తొలిసారిగా అత్యంత సంపన్నులైన పాలకులను చూడనుంది.
మస్క్ నుంచి మన రామస్వామి దాకా..
ఎలాన్ మస్క్.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడనే సంగతి తెలిసిందే. అంతేకాదు.. కొత్తకొత్త వ్యాపార ప్రయోగాలతో తన ఆస్తిని మరింత పెంచుకుంటూ పోతుంటారు. ట్రంప్ ఎన్నికల ప్రచారానికే ఓ నాలుగు వేల కోట్లు ఇచ్చారంటేనే మస్క్ స్థాయి ఏమిటో చెప్పొచ్చు. అలాంటి మస్క్ సహా.. ట్రంప్ కార్యవర్గం బిలియనీర్లతో కళకళలాడుతోంది. మస్క్ కు అధికార వ్యవస్థను ప్రక్షాళన చేసే డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ (డోజ్) డిపార్టమెంట్ బాధ్యతలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈయన ఒక్కడి ఆస్తుల విలువే 363.3 బిలియన్ డాలర్లు.
90 శాతం మస్క్ సంపద పోగా..
ట్రంప్ కొత్త కార్యవర్గంలో మస్క్ సహా ఇతర సంపన్నుల సంపద 382.2 బిలియన్ డాలర్లు (రూ.32 లక్షల కోట్లకు మించి) ఉంది. 172 దేశాల గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ (జీడీపీ) కంటే వీరి ఆస్తులే ఎక్కువ. కాగా, 8 ఏళ్ల కిందట ట్రంప్ తొలిసారి గెలిచిన సమయంలో కార్యవర్గంలోని సభ్యుల ఆస్తుల విలువ 6.2 బిలియన్ డాలర్లే. అప్పటికి ఇప్పటికి పోల్చి చూస్తే 350పైగా బిలియన్ డాలర్లు అధికం అన్నమాట.
ట్రంప్ నకు రియల్ ఎస్టేట్, హోటల్స్, ట్రూత్ సోషల్ మీడియా ఉన్నాయి. ఈయన సంపద 6.2 బిలియన్ డాలర్లు.
మస్క్ సంపద రూ.32 లక్షల కోట్లు (384 బిలియన్ డాలర్లు). మరో 16 బిలియన్ డాలర్లు పెరిగితే.. 400 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరిన తొలి సంపన్నుడు అవుతారు. ఈ సంవత్సరమే మస్క్ సంపద 155 బిలియన్ డాలర్ల (రూ.15 లక్షల కోట్లు)కు పెరిగింది.
యూకే రాయబారిగా ట్రంప్ ప్రతిపాదించిన వారెన్ స్టీఫెన్స్ కు 3.4 బిలియన్ డాలర్ల ఆస్తులున్నాయి. ఈయన ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్. స్టీఫెన్స్ ఐఎన్‌సీ ఛైర్మన్, సీఈవో.
విద్యా శాఖ మంత్రి లిండామెక్‌మాన్ (3 బిలియన్ డాలర్లు) వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్ సహ వ్యవస్థాపకురాలు.
తొలి ప్రైవేటు వ్యోమగామి, నాసా అడ్మినిస్ట్రేటర్ గా ట్రంప్ ఎంపిక చేసిన జరాడ్ ఇస్సాక్ మన్ (1.7 బిలియన్ డాలర్లు) క్రెడిట్ కార్డ్ ప్రాసెసింగ్ కంపెనీ సీఈవో. డ్రేకెన్ ఇంటర్నేషనల్ అనే ఏరోస్పేస్ కంపెనీ ఉంది.
వాణిజ్య మంత్రి హోవర్డ్ లుత్నిక్ (1.5 బిలియన్ డాలర్లు) బ్రోకరేజ్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ కాంటోర్ ఫిట్జెర్లాండ్ అధిపతి.
భారతీయ మూలాలున్న వివేక్ రామస్వామి సంపద బిలియన్ డాలర్లు. రోవాంట్ సైన్సెస్ లో వాటాలు సహా ఇతర వ్యాపారాలు ఉన్నాయి.
పశ్చిమాసియాకు ప్రత్యేక ప్రతినిధి స్టీవెన్ విట్‌కాఫ్ (బిలియన్ డాలర్లు) రియల్ ఎస్టేట్ దిగ్గజం. విట్‌క్రాఫ్ గ్రూప్ అధిపతి. ట్రంప్ గోల్ఫ్ భాగస్వామి.
అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇంటీరియర్ కు నేతృత్వం వహించనున్న డౌగ్ బర్గమ్ ఆస్తి బిలియన్ డాలర్లు. గ్రేట్ ప్లెయిన్స్, మైక్రోసాఫ్ట్ లో కీలక పదవులు నిర్వహించారు.