Begin typing your search above and press return to search.

ట్రంప్ 2.0... భారత్-యూఎస్ సంబంధాలపై ప్రభావం ఎంత?

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పలు సర్వే సంస్థల అంచనాలను తలకిందులు చేస్తూ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు!

By:  Tupaki Desk   |   6 Nov 2024 8:59 AM GMT
ట్రంప్ 2.0... భారత్-యూఎస్ సంబంధాలపై ప్రభావం ఎంత?
X

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పలు సర్వే సంస్థల అంచనాలను తలకిందులు చేస్తూ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు! దీంతో.. ఆయన రెండోసారి అగ్రరాజ్యం అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సమయంలో... ట్రంప్ 2.0లో భారత్ - అమెరికా మధ్య సంబంధాలు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తిగా మారింది.

అవును... అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి ప్రమణస్వీకారం చేయబోతున్నారు! ఈ ఎన్నికల్లో ప్రధానంగా "అమెరికా ఫస్ట్" సూత్రాలపై దృష్టి సారించి, యూఎస్ విదేశాంగ విధానాన్ని పునరుద్దరించాలని భావిస్తున్నట్లు ట్రంప్ ఇప్పటికే స్పష్టంగా చెప్పారు. అయితే.. గతంలో మొదటిసారి ప్రెసిడెంట్ అయినప్పుడు ట్రంప్.. మోడీతో స్నేహపూర్వక బంధాన్ని కొనసాగించారు.

ఇందులో భాగంగా... ఇద్దరూ కలిసి "హైడీ మోడీ", "నమస్తే ట్రంప్" వంటి భారీ కారక్రమాల్లోనూ పాల్గొన్నారు. ఆ సమయంలో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు మరింత బలపడినట్లుగా చెబుతారు. ఈ సమయంలో ట్రంప్ రెండోసారి ప్రెసిడెంట్ అయితే.. వాణిజ్యం, మిలటరీ సహకారం, వలసలు, దౌత్యం వంటి అంశాలు మరింత బలపడే అవకాశాలతో పాటు కొన్ని సవాళ్లను కలిగి అంటున్నారు!

వాస్తవానికి ట్రంప్ తన మొదటి పదవీ కాలంలో పారిస్ వాతావరణ ఒప్పందం, ఇరాన్ అణు ఒప్పందంతో పాటు పలు కీలక అంతర్జాతీయ ఒప్పందాల నుంచి అమెరికా నిష్క్రమించేలా చేశారు. దీంతో.. రెండో టర్మ్ లో ఇటువంటి విధానాలు భారత్ సహా సంప్రదాయ యూఎస్ పొత్తులు, ఒప్పందాలకు అంతరాయం కలిగించొచ్చని అంటున్నారు!

ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా... ట్రంప్ పలు కీలక హామీలు ఇచ్చారు. 2019లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో భారత్ ను "సుంకాల రాజు" అంటూ వ్యాఖ్యానించిన ట్రంప్... మరోసారి ఈ విషయంలో భారత్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ అధిక సుంకాలు విధిస్తోందంటూ అసహనం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా హార్లే-డేవిడ్ సన్ దిగుమతి పన్నులను ఉదహరిస్తూ.. భారతదేశం నుంచి ఎదురవుతున్న సుంకాలు 150 శాతం ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు. తన ఉద్దేశ్యంలో చైనా కంటే చాలా రకాలుగా భారత్ ఎక్కువ వసూలు చేస్తుందని.. కాకపొతే చిరునవ్వుతో చేస్తుందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... తాను అధ్యక్ష ఎనికల్లో గెలిస్తే... భారత్ నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులపై సుంకాల భారం పెంచుతామని ట్రంప్ ప్రకటించారు. అమెరికాను మళ్లీ సుసంపన్నంగా మార్చడమే తన లక్ష్యమని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో చెప్పిన మాటలకు ట్రంప్ కట్టుబడి ఉంటే... సుంకాల భారం భారత్ కు తప్పకపోవచ్చని అంటున్నారు.

ఇక ఇమ్మిగ్రేషన్ విషయానికొస్తే... గతంలో ట్రంప్ పాలనలో ముఖ్యంగా హెచ్1-బీ వీసా ప్రోగ్రాంపై నిర్భంధ వైఖరిని అవలంభించిన పరిస్థితి. దీంతో... భారతీయ నిపుణులపై ఇది తీవ్ర ప్రభావం చూపించింది. భారతీయ ఐటీ నిపుణులకు అది సవాళ్లను సృష్టించింది. ఈ సమయంలో... ట్రంప్ మరోసారి అలాంటి ఆలోచనలు చేస్తే కొత్త కష్టాలు తప్పవని అంటున్నారు.

ఇదే సమయంలో... మిలటరీ సంబంధాల విషయంలో ట్రంప్ గెలుపు పాజిటివ్ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. గత కొన్నేళ్లుగా భారత్-అమెరికా మధ్య సంబంధాలు బలపడటంలో రక్షణ, సైనిక సహకారం కీలక భూమిక పోషిస్తోంది. ఈ సమయంలో ట్రంప్ వచ్చినా కూడా భారత్ - అమెరికా సైనిక సహకరాన్ని పెంపొందించే అవకాశం ఉందని అంటున్నారు.

ఇదే సమయంలో... ఉగ్రవాదాన్ని నిరోధించే విషయంలోనూ ట్రంప్ విధానం భారతదేశ భద్రతా లక్ష్యాలకు అనుగుణంగా ఉండోచ్చని అంటున్నారు.