కలా.. నిజమా..? అమెరికన్లకు ఆదాయ పన్ను రద్దు.. ట్రంప్ బొనాంజా
సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్న కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదాయ పన్ను విషయంలోనూ అదే విధంగా వెళ్తున్నారు.
By: Tupaki Desk | 28 Jan 2025 9:33 AM GMTఏ దేశమైనా సగటు వేతన జీవికి ఈ రోజుల్లో ఒక్కటే ఆందోళన.. అదే ‘ఆదాయ పన్ను’. జీతం ఎంత పెరిగిందనేది కాదు.. ఎంత ఆదాయ పన్ను భరించాల్సి వస్తుందోనని…? అగ్ర రాజ్యం అమెరికాలోనూ ఆదాయ పన్ను బాధ మరీ ఎక్కువనే చెప్పాలి. అకౌంటబులిటీ ఎక్కువ కాబట్టి దానికి తగ్గట్టే పన్ను బాదుడు కూడా ఉంటుంది. అయితే, సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్న కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదాయ పన్ను విషయంలోనూ అదే విధంగా వెళ్తున్నారు.
మనకు బాదుడు..
విదేశాలు టార్గెట్.. అమెరికా టాప్.. ట్రంప్ తాజా టర్మ్ ఉద్దేశం ఇదే. ఒక్కో నిర్ణయం దీనినే సూచిస్తున్నాయి. చైనా, కెనడాలను ట్యాక్స్ లతో కొట్టే ఉద్దేశం ఉన్న ట్రంప్.. అమెరికా ప్రజలకు ఆదాయ పన్ను రద్దు చేస్తామని అనూహ్య నిర్ణయం ప్రకటించారు. అయితే, చైనాతో పాటు భారత్ పైనా దిగుమతి సుంకాలు విధిస్తామని మరో బాంబు కూడా పేల్చారు. అయితే, అమెరికన్లకు ఆదాయ పన్ను విముక్తే అన్నిటికంటే సంచలన ప్రకటనగా నిలుస్తోంది.
డబ్బు మళ్లీ మార్కెట్ లోకి వచ్చేలా..
ఆదాయ పన్ను రద్దు ప్రతిపాదనను ట్రంప్ తేలిగ్గా ఏమీ చేయడం లేదు. దీనివెనుక తన ఉద్దేశం ఏమంటే.. పన్ను మాఫీ రూపేణా మార్కెట్ లోకి మళ్లీ డబ్బు వచ్చేలా చూడడం. అంటే.. ప్రభుత్వం మినహాయించిన పన్ను డబ్బును ప్రజలు స్వేచ్ఛగా ఖర్చు చేస్తే అది ఆర్థిక వ్యవస్థలోకి వచ్చినట్లేననేది భావన.
ప్రజలను ధనవంతులను చేసే వ్యవస్థ పనరుద్ధరణకు ఆదాయ పన్ను రద్దు ఉపయోగపడుతుందని ట్రంప్ చెప్పడం గమనార్హం.
ట్యాక్స్ లోటు..
ఖజానాకు అత్యంత భారీ ఆదాయ మార్గమైన ఆదాయ పన్నును రద్దు చేస్తే నష్టమే కదా..? అందులోనూ అమెరికా ఖజానాకు ఆదాయ పన్ను తెచ్చే మొత్తం ఎక్కువగానే ఉంటుంది. ఈ లోటును భర్తీ చేసేందుకు ట్రంప్ దిగుమతి సుంకాలను పెంచే యోచన చేస్తున్నారట. ‘‘ఇతర దేశాలను సుసంపన్నం చేసేందుకు మన వారిపై పన్నులు వేసే బదులు.. మనమే విదేశాలపై పన్నులు విధించి అమెరికన్లను సంపన్నులు చేయాలి. వీటిని వసూలు చేసేందుకు ఎక్స్‌టర్నల్ రెవెన్యూ సర్వీసును ప్రారంభించాను’’ అని రిపబ్లికన్ సభ్యుల సమావేశంలో ట్రంప్ పేర్కొనడం దీనినే సూచిస్తోంది.
కాగా, ట్రంప్.. 1870-1913 మధ్య కాలాన్ని అమెరికా గోల్డెన్ ఎరాగా అభివర్ణించారు. నాడు ప్రజలు సుంకాల ఆధారిత ఆర్థిక వ్యవస్థ ఉండడంతో ప్రజలు అత్యధిక సంపదతో తులతూగారని పేర్కొన్నారు. దిగుమతి సుంకాల నుంచి ప్రభుత్వానికి గణనీయ ఆదాయం లభించేందని వివరించారు. అందుకని అమెరికా తక్షణమే తన వాణిజ్య వ్యవస్థను మార్చుకోవాలని.. ఉద్యోగులు, కుటుంబాలను రక్షించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
భారత్ బ్యాడ్ న్యూస్..
చైనాతో పాటు భారత్, బ్రెజిల్ పై అత్యధిక పన్నులు విధిస్తామని ట్రంప్ ప్రకటించారు. చైనా భారీగా పన్నులు వసూలు చేస్తోందని.. భారత్, బ్రెజిల్, ఇతర దేశాలూ దానినే అనుసరిస్తున్నాయని మండిపడ్డారు. ఇది సరైన తీరు కాదని.. అమెరికా ప్రయోజనాలు అన్నింటికంటే ముందుండాలని ట్రంప్ పేర్కొన్నారు.
కొసమెరుపు: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక.. డిసెంబరులో ట్రంప్.. బ్రిక్స్ కరెన్సీ ప్రతిపాదనను టార్గెట్ చేశారు. డాలర్ వినియోగం నిలిపేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని.. ప్రత్యేక కరెన్సీ తీసుకొస్తే 100 శాతం సుంకం విధిస్తామని హెచ్చరించారు.