'నెక్స్ట్ వీక్ భేటీ అవుతున్నాం'... మోడీపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు!
అమెరికాలో ఇప్పుడు ఎన్నికల వాతావరణం పీక్స్ కి చేరిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 18 Sep 2024 7:15 AM GMTఅమెరికాలో ఇప్పుడు ఎన్నికల వాతావరణం పీక్స్ కి చేరిన సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేనంతగా అన్నట్లుగా ఈదఫా ఎన్నికల ప్రచార కార్యక్రమాలు రసవత్తరంగా సాగుతున్నాయి. తుపాకీ చప్పుళ్లు కూడా వినిపిస్తుండటం గమనార్హం! ఇక ఈ ఎన్నికల్లో భారతీయ సంతతి ప్రజల ఓట్లు అత్యంత కీలకంగా చెబుతున్నారు. ఈ సమయంలో మోడీపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేసారు.
అవును... త్వరలో జరగనున్న అమెరికా ఎన్నికల్లో భారత సంతతి ఓటర్ల నిర్ణయం చాలా కీలకం అనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో మోడీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ కీలక సమయంలో ఇది అత్యంత కీలమైన టూర్ గా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఇక్కడ భారతీయ సమాజాన్ని ఉద్దేశించి మోడీ చేసే ప్రసంగంపై తీవ్ర ఆసక్తీ నెలకొంది.
తాజాగా ఈ వ్యవహారంపై అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... అమెరికా పర్యటనకు రానున్న భారత ప్రధాని మోడీతో వచ్చేవారం భేటీ అవుతానని అన్నారు. మంగళవారం మిచిగాన్ లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ట్రంప్ భారత ప్రధానమంత్రిపై ప్రశంసల జల్లులు కురిపించారు.
ఇందులో భాగంగా... భారత ప్రధాని మోడీ ఓ అద్భుతమైన వ్యక్తి అని అన్నారు. అయితే... మోడీతో భేటీకి సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం డొనాల్డ్ ట్రంప్ వెల్లడించలేదు. ప్రధాని మోడీతో భేటీ అవుతానని మాత్రమే ప్రకటించారు. దీంతో... అధ్యక్ష ఎన్నికల వేళ ఈ భేటీ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఇక ప్రధాని మోడీ సెప్టెంబర్ 21వ తేదీ నుంచి 23 వరకూ అమెరికాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో " సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్"లో ప్రసంగిస్తారు. అధ్యక్షుడు జో బిడెన్ హోస్ట్ చేసే నాల్గవ క్వాడ్ లీడర్స్ సమ్మిట్ తో ఈ పర్యటన ప్రారంభమవుతుంది.
కాగా... భారత ప్రధాని మోడీ, డొనాల్డ్ ట్రంప్ లు చివరిసారిగా 2020 ఫిబ్రవరిలో కలుసుకున్న సంగతి తెలిసిందే.