Begin typing your search above and press return to search.

చైనా వైరస్ కు ట్రంప్ వ్యాక్సిన్.. భారత్ కే 'టానిక్'

వాస్తవానికి ట్రంప్ 2020లో గెలిచి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. అయితే, ఇప్పుడు మళ్లీ గెలవడంతో ఏం జరగనుంది? అనే ఆసక్తి నెలకొంది.

By:  Tupaki Desk   |   27 Dec 2024 9:30 PM GMT
చైనా వైరస్ కు ట్రంప్ వ్యాక్సిన్.. భారత్ కే టానిక్
X

అదేమిటో గానీ.. చైనా అంటే ఒంటికాలిపై లేస్తారు అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఆ దేశ విధానాలను తీవ్రంగా విమర్శిస్తుంటారు.. కొవిడ్ వైరస్ వ్యాప్తి సమయంలో దానిని చైనా వైరస్ గా అభివర్ణించి ఎవరూ చేయని సాహసం చేశారు. ఈ విషయంలో చైనా నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైనా లెక్క చేయలేదు. వాస్తవానికి ట్రంప్ 2020లో గెలిచి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. అయితే, ఇప్పుడు మళ్లీ గెలవడంతో ఏం జరగనుంది? అనే ఆసక్తి నెలకొంది.

డ్రాగన్ ను తొక్కేస్తారా?

ట్రంప్ మనసులో చైనా అంటే తీవ్ర వ్యతిరేకత. ఆ దేశం నుంచి వస్తున్న ఫెంటానిల్ పై ఇప్పటికే ఆయన గట్టిగా పన్ను వేయాలని నిర్ణయించారు. టారిఫ్ లతో చైనా వస్తువుల రేటు పెంచే ఆలోచనలో ఉన్నారు. తద్వారా విక్రయాలు తగ్గి చైనా కంపెనీలకు నష్టం వాటిల్లుతుంది. తమ పొరుగున ఉన్న, అక్రమ వలసలకు కారణమైన

కెనడా, మెక్సికోలపై 25 శాతం, చైనాపై 10 శాతం సుంకాలను పెంచుతామని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. అదే జరిగితే భారత దేశానికి మంచి టానిక్ కానుంది.

ఈ 5 రంగాల్లో..

ఎలక్ట్రానిక్స్, బొమ్మలు, దుస్తులు, రసాయనాలు, తోలుతో చేసిన పరికరాలు.. ఈ ఐదు రంగాలపై భారత్ పెద్ద ఆశలతో ఉంది. కారణం.. ట్రంప్ చైనాపై విధించే టారిఫ్ లు. ఈ ఐదు కీలక రంగాల్లో అమెరికాకు ఎగుమతులను ప్రోత్సహించేందుకు భారత ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్ఐఈవో) వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. దీంతో చైనాతో భారత్ నేరుగా పోటీ పడుతుంది.

ఇదో అందివచ్చిన అవకాశం..

ప్రస్తుత పరిస్థితులను సద్వినియోగం చేసుకునేందుకు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలని ఎఫ్ఐఈవో ఉపాధ్యక్షుడు ఇస్రార్ అహ్మద్ తెలిపారు. చురుగ్గా ఉంటూ.. ఐదు రంగాలకు చెందిన వస్తువులను అమెరికాకు ఎగుమతి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని.. అయితే, ఈ వస్తువుల ఎగుమతికి పెద్ద ఫ్యాక్టరీల సామర్థ్యం అవసరం అని పేర్కొన్నారు. మార్కెట్ యాక్సెస్ ఇనీషియేటివ్ (ఎంఎఐ) పథకం కింద మరిన్ని నిధులను కోరుతున్నట్లు వివరించారు. ఎగుమతులపై జీడీపీ పునరుద్ధరణ విషయంలో ప్రభుత్వం ఆలోచించాలని కోరారు. కనీసం మూడేళ్లు అమెరికాపై దృష్టిపెట్టాలని.. అక్కడి మార్కెట్‌ లో దూకుడును భారత్ అందిపుచ్చుకోవాలని సూచించారు.

2017 -2023 మధ్య అమెరికాకు భారత్ ఎగుమతులు $36.8 బిలియన్లు. స్మార్ట్‌ ఫోన్లు, టెలికాం పరికరాల్లో అత్యధిక వృద్ధి నమోదైంది. దుస్తులు, మోటారు వాహనాల విడిభాగాలు, ఎలక్ట్రిక్ ట్రాన్స్‌ఫార్మర్లు మొదలైనవాటి ఎగుమతులు బాగా పెరిగాయి.

భారత్ తన ప్రణాళికలో విజయం సాధిస్తే చైనాను ఎగుమతుల్లో ఓడించవచ్చు. ఇక్కడ కీలకం ఏమంటే.. భారత్‌ పై టారిఫ్‌ ల విధింపు అంశంపై ట్రంప్‌ ఇప్పటిదాక ప్రకటన చేయలేదు. చైనా వస్తువులపై విధించిన టారిఫ్ తో వాటి ధరలు పెరిగి అమ్మకాలు తగ్గుతాయి. భారతీయ వస్తువులు చౌకగా మారుతాయి. దీని ప్రభావం చైనా కంపెనీలు, ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై స్పష్టంగా ఉంటుంది. మరోవైపు భారతీయ కంపెనీలు అమెరికన్ మార్కెట్లో సులభంగా రాణిస్తాయి