ఇరుగుపొరుగును కలిపేసి.. 'మహా' అమెరికా.. ట్రంపరితనం ఇదేనా?
మా దేశం వాణిజ్య లోటులో ఉంది. దీనిని భర్తీ చేసేందుకు పొరుగు దేశాలపై భారీగా టారీఫ్‌లు విధిస్తాం...- ఇది ఓ దేశ అధ్యక్షుడి (కాబోయే) మాట
By: Tupaki Desk | 23 Dec 2024 7:30 PM GMTమా దేశం వాణిజ్య లోటులో ఉంది. దీనిని భర్తీ చేసేందుకు పొరుగు దేశాలపై భారీగా టారీఫ్‌లు విధిస్తాం...- ఇది ఓ దేశ అధ్యక్షుడి (కాబోయే) మాట.
కెనడా 51వ రాష్ట్రంగా మా దేశంలో భాగం కావాలి... తమ కంటే పెద్ద దేశాన్ని ఉద్దేశిస్తూ మరోసారి చేసిన వ్యాఖ్య. ‘మా 51వ రాష్ట్రం కెనడా’ గవర్నర్ ట్రూడో అని మరోసారి పోస్టు చేశారు. మెక్సికో కూడా తమ దేశంలో భాగం కావాలని కోరారు.
పనామా కాల్వను ఆక్రమిస్తాం..
నాలుగేళ్ల విరామం తర్వాత అమెరికా అధ్యక్షుడు కాబోతున్న డొనాల్డ్ ట్రంప్.. తమ దేశాన్ని మరింత విస్తరించాలని చూస్తున్నారు. ఇప్పటికే మెక్సికో, కెనడాలను కవ్వించారు. ఇప్పుడు తమ సమీపంలోని పనామా.. సుదూరాన ఉన్న డెన్మార్క్ జోలికీ వెళ్లారు. ఇరుగు పొరుగు ఇప్పుడు ట్రంప్ పేరు చెబితేనే బెంబేలెత్తుతున్నారు. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన పనామా కాల్వను ఆక్రమిస్తాం అంటూ ఆయన తాజా హెచ్చరించారు.
పనామా కాల్వ అమెరికాకు కీలక జాతీయ ఆస్తి అని.. జాతీయ, ఆర్థిక భద్రతకు అత్యంత కీలకం అని పేర్కొన్నారు. కాగా, గతంలో అమెరికాకు ఉదారంగా విరాళాలు ఇచ్చింది. వాటి విషయంలో నైతిక, చట్టపరమైన సూత్రాలు పాటించాలని.. పనామా కాల్వను తమ తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.
పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ ములినో తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకొంటామని.. పనామా కాల్వలో ప్రతి చదరపు మీటరు తమ దేశానికే చెందుతుందని తేల్చిచెప్పారు. ట్రంప్ పేరును లేకుండా ట్వీట్ చేశారు. కాల్వలో ప్రయాణించే నౌకల నుంచి ఖర్చులకు అనుగుణంగా ఫీజులు వసూలుచేస్తామని కెనాల్, సార్వభౌమత్వం విషయానికి వస్తే మాత్రం దేశం మొత్తం ఏకం అవుతుందని హెచ్చరించారు.
దీంతో ట్రంప్ మరోసారి బరితెగించారు. పనామా కాల్వలో అమెరికా జాతీయ పతాకం ఉన్నట్లున్న ఫొటోను పెట్టి.. ‘‘యునైటెడ్ స్టేట్స్ కెనాల్ కు స్వాగతం’’ అని శీర్షిక పెట్టారు.
అట్లాంటిక్-పసిఫిక్ సముద్రాలను కలుపుతూ అమెరికా భారీ వ్యయంతో 1914లో పనామా కాల్వను నిర్మించింది. అమెరికానే నిర్వహించినా.. పనామాలో తీవ్ర అసంతృప్తితో ఘర్షణలు చెలరేగాయి. 1977లో అమెరికాను ఆ కాల్వను పనామాకు అప్పచెప్పింది. తటస్థంగా ఉండి తీరాలని షరతు పెట్టింది. ఎలాంటి ముప్పు వచ్చినా అమెరికాకు రక్షించుకునే హక్కు ఉందని పేర్కొంది. పనామా ప్రభుత్వం కూడా కాల్వ అభివృద్ధికి భారీగా ఖర్చు చేసింది.
డెన్మార్క్ అధీనంలోని గ్రీన్ ల్యాండ్ ను కొంటామని ట్రంప్ ఆదివారం మరో బాంబు పేల్చారు. గతంలో అధ్యక్షుడిగా ఉన్న వేళ కూడా ఈ ప్రతిపాదన తెరపైకి రాగా.. డెన్మార్క్ తిరస్కరించింది. తాజాగా ఆ దేశానికి అమెరికా రాయబారిగా కెన్ హౌరీని నియమించారు ట్రంప్. భద్రత, ప్రపంచంలో స్వేచ్ఛను కాపాడటానికి గ్రీన్ ల్యాండ్‌పై అమెరికా యాజమాన్యం ఉండాలి అని పేర్కొన్నారు.
ఖనిజాల నిక్షేపం గ్రీన్ ల్యాండ్. ప్రపంచంలోని 13శాతం చమురు.. 30 శాతం గుర్తించని గ్యాస్ నిల్వలున్నట్లు భావిస్తున్న ఆర్కిటిక్ లో ఇది ఓ భాగం. అతితక్కువ జనావాసం ఉన్న ఈ ప్రాంతంలో ట్రంప్ రియల్ ఎస్టేట్ చేస్తారట. 21 లక్షల చదరపు కిలోమీటర్ల గ్రీన్ ల్యాండ్స్ లో జనాభా 56,500 మంది మాత్రమే. 75శాతం భూభాగం నిత్యం మంచులోనే ఉంటుంది.