Begin typing your search above and press return to search.

వలసదారులపై డోనాల్డ్‌ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు!

ఈ నేపథ్యంలో రిపబ్లికన్‌ పార్టీ తరఫున ఆ దేశ మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్, డెమోక్రటిక్‌ పార్టీ తరఫున ప్రస్తుత దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ బరిలోకి దిగుతున్నారు.

By:  Tupaki Desk   |   11 Sep 2024 1:30 PM GMT
వలసదారులపై డోనాల్డ్‌ ట్రంప్‌  సంచలన వ్యాఖ్యలు!
X

ఈ ఏడాది నవంబర్‌ లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రిపబ్లికన్‌ పార్టీ తరఫున ఆ దేశ మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్, డెమోక్రటిక్‌ పార్టీ తరఫున ప్రస్తుత దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ బరిలోకి దిగుతున్నారు. ఇద్దరూ గెలుపే లక్ష్యంగా హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు.

ముచ్చటగా మూడోసారి అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న డోనాల్డ్‌ ట్రంప్‌ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలనే కృతనిశ్చయంతో ఉన్నారు. ప్రపంచ కుబేరులు.. టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్, మెటా (ఫేస్‌ బుక్‌) అధినేత మార్క్‌ జుకర్‌ బర్గ్‌ వంటివారు ట్రంప్‌ కు గట్టి మద్దతుదారులుగా నిలుస్తున్నారు.

ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్ష అభ్యర్థులు.. డోనాల్డ్‌ ట్రంప్, కమలా హారిస్‌ మధ్య డిబేట్‌ జరిగింది. ఈ చర్చలో ఇద్దరూ తాము అధికారంలోకి వస్తే చేపట్టబోయే పనులను గురించి వివరించారు. ఈ సందర్భంగా ఒకరికొకరు కరచాలనం చేసుకున్నారు. గత ఎనిమిదేళ్లలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కరచాలనం చేసుకోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

కాగా డోనాల్డ్‌ ట్రంప్, కమలా హారిస్‌ ముఖాముఖి కలుసుకోవడం ఇదే మొదటిసారి. దీంతో హారిస్‌ ఆయనతో కరచాలనం చేసి తన గురించి పరిచయం చేసుకున్నారు.

ఇక ఇద్దరి మధ్య డిబేట్‌ సందర్భంగా పలు ఆసక్తికర అంశాలు చర్చకొచ్చాయి.

ఆర్థిక వ్యవస్థ, జీవన వ్యయంపై కమలా హారిస్‌ మాట్లాడుతూ తాను మధ్యతరగతి చెందిన వ్యక్తినని.. వారి కష్టాలు తనకు తెలుసని చెప్పారు. తాను అధ్యక్షురాలిగా ఎన్నికయితే చిన్న కుటుంబాలు, చిన్న వ్యాపారాలకు మద్దతు ఇస్తానని, అందుకు ప్రణాళికలు రూపొందిస్తానని తెలిపారు.

అదే ట్రంప్‌ అధ్యక్షుడిగా ఎన్నికయితే ఆయన బిలియనీర్లకు మాత్రమే మేలు చేస్తాడని కమలా హారిస్‌ ఆరోపించారు. అంతేకాకుండా పెద్ద సంస్థలకు పన్నులు తగ్గిస్తారన్నారు. ట్రంప్‌ అమెరికా ఆర్థిక వ్యవస్థను నాశనం చేసి పోతే జో బైడెన్‌ ప్రభుత్వం దాన్ని చక్కదిద్దిందని తెలిపారు.

డోనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడిగా పోతూ దేశంలో నిరుద్యోగాన్ని పెంచారని కమలా హారిస్‌ ఆరోపించారు. ఒక శతాబ్దంలోనే అత్యంత చెత్త ప్రజారోగ్య మహమ్మారిని విడిచిపెట్టారని «విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక ఆ చెత్తను శుభ్రం చేశామన్నారు.

ఈ క్రమంలో ట్రంప్‌.. కమలా హారిస్‌ పై వ్యక్తిగత విమర్శలు చేశారు. ‘ఆమె మార్క్సిస్టు. ఆమె తండ్రి మార్క్సిస్టు’ అని ఆరోపించారు. కోవిడ్‌ లాంటి మహమ్మారిని తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సమర్థంగా ఎదుర్కొన్నా ప్రజలు తిరిగి తనను గెలిపించలేదని వాపోయారు.

ఇక అన్నింటికంటే ముఖ్యమైన అంశమైన అబార్షన్లపై ట్రంప్, కమలా హారిస్‌ స్పందించారు. ట్రంప్‌ అధ్యక్షుడయితే అబార్షన్లను నిషేధిస్తారని కమల ఆరోపించారు. అయితే ఆమె మాటలను ట్రంప్‌ ఖండించారు. కమల అబద్ధం చెబుతోందన్నారు. అబార్షన్‌ నిషేధాన్ని వీటో చేస్తారా అనే ప్రశ్నకు అలాంటి చట్టాన్ని కాంగ్రెస్‌ ఆమోదించదని చెప్పారు.

ఇక ఇమ్మిగ్రేషన్‌ (వలసలు)పై మాట్లాడుతూ ట్రంప్‌ చెప్పేది వినాలని కమల ఎద్దేవా చేశారు. దీనిపైనా ఆయన చాలా మాట్లాడతారని ఎగతాళి చేశారు. కల్పిత పాత్రలతో ట్రంప్‌ చెప్పే సుదీర్ఘ ఉపన్యాసాలను విసుగు లేకుండా వినాలని కమల నవ్వుతూ వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో ట్రంప్‌.. కమలా హారిస్‌ పై మండిపడ్డారు. ఆమె ర్యాలీలకు ప్రజలెవరూ వెళ్లడం లేదన్నారు. అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో హైతీ వలసదారులు కుక్కలను, పిల్లులను తింటారని వ్యాఖ్యానించారు. పెంపుడు జంతువులను హైతీ వలసదారులను తింటారన్నారు.

ఇలా అమెరికా అధ్యక్ష అభ్యర్థుల డిబేట్‌ వాడీవేడిగా జరిగింది. పెన్సిల్వేనియాలోని నేషనల్‌ కాన్‌స్టిట్యూషన్‌ సెంటర్‌ వేదికగా ట్రంప్, కమలా హారిస్‌ ఇద్దరూ తీవ్ర విమర్శలు చేసుకున్నారు.