అమెరికా 'ఆర్థిక సాయం'.. మనకు వచ్చేదెంత? ఆగితే నష్టమా?
అమెరికా.. ప్రపంచానికి పెద్దన్నే కాదు.. సాయంలోనూ పెద్ద చేయే.. వేల కోట్ల డాలర్లను ఎడమచేత్తో దానం చేసే దాతలు, సంస్థలు ఉన్నారక్కడ.
By: Tupaki Desk | 5 Feb 2025 8:30 PM GMTఅమెరికా.. ప్రపంచానికి పెద్దన్నే కాదు.. సాయంలోనూ పెద్ద చేయే.. వేల కోట్ల డాలర్లను ఎడమచేత్తో దానం చేసే దాతలు, సంస్థలు ఉన్నారక్కడ. అయితే.. కొత్తగా అధ్యక్షుడు అయిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ కన్ను ఈ సాయంపై పడింది. దీనివెనుక ఆయన చెప్పే కారణాలూ కొంత ఆలోచించదగినవిగానే ఉన్నాయి. ఒకవేళ ఆ సాయం ఆగిపోతే పేద దేశాలకు పెద్ద నష్టమే. మరి భారత్ వంటి దేశానికి..?
అమెరికా స్టేట్స్ విదేశీ సహాయ నిధి (యూఎస్‌ఎయిడ్).. చాలా దేశాలకు ఇదో పెన్నిది. కానీ, ఈ మానవతా సాయాన్ని ట్రంప్ నిలిపి వేయాలంటున్నారు. అదే జరిగితే ప్రపంచంలో చాలా కార్యక్రమాలపై తీవ్ర ప్రభావం పడడం ఖాయం.
ప్రజారోగ్యం, మాతాశిశు సంరక్షణ.. ఈ కార్యక్రమాలకు భారత్ కు సాయం చేస్తోంది యూఎస్ ఎయిడ్. ఇప్పుడు సాయం ఆగిపోతే ఇబ్బంది కలుగుతుంది. వాస్తవానికి ఇప్పుడు డెవలపింగ్, పేద దేశాలకు సాయం చేస్తున్నా.. యూఎస్ ఎయిడ్ ను రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్ దేశాల్లో మౌలిక వసతుల పునర్ నిర్మాణం కోసం చేపట్టారు. అలాఅలా 160 దేశాలకు పాకింది.
యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రష్యా (యూఎస్ఎస్ఆర్), అమెరికా మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగిన కాలంలో ప్రపంచం అంతా రెండుగా విడిపోయింది. దీంతో తమకు పట్టు కోసం అమెరికా యూఎస్ ఎయిడ్ పేరిట చాలా దేశాలకు సాయం చేసింది.
గత ఏడాది మన దేశానికి యూఎస్ ఎయిడ్ కింద రూ.1,228 కోట్లు (140 మిలియన్ డాలర్లు) వచ్చాయి. మనదేశంలో ఇప్పటికీ మాతాశిశు మరణాలు ఉన్నాయి. అలాంటి వాటిని తగ్గించడంతో పాటు క్షయ, హెచ్‌ఐవీ వంటి వ్యాధుల నివారణకు యూఎస్ ఎయిడ్ సాయపడుతోంది.
40 ఏళ్ల కిందట హెచ్ఐవీ వ్యాప్తి ప్రారంభం కాగా.. 30 ఏళ్ల కిందటి నుంచి దానిపై పోరాటం మొదలుపెట్టారు. ఫలితంగా 2007 నుంచి దేశంలో ఎయిడ్స్ ఇన్ఫెక్షన్ సోకే కొత్త కేసుల సంఖ్య 37 శాతం తగ్గింది. యూఎస్ ఎయిడ్ కింద 16 రాష్ట్రాల్లో విద్యా సంబంధ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
మోదీ ప్రధాని అయ్యాక 2014లో ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కు యూఎస్ ఎయిడ్ అండగా నిలిచింది. 3 లక్షల మరుగుదొడ్ల నిర్మాణానికి ఉపయోగపడింది.
చీకటి ఖండానికి చీకట్లే..
యూఎస్ ఎయిడ్.. పేదరిక నిర్మూలన, వ్యాధుల నివారణ, మానవతా సాయం ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుంది. దీనిని అమెరికా ప్రభుత్వమే నిర్వహిస్తుంది. 13 వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. 160పైగా దేశాల్లో ఏడాదికి రూ.3.83 లక్షల (4400 కోట్ల డాలర్లు) అమెరికా ఖర్చు చేస్తోంది.
యుద్ధ బాధిత ఉక్రెయిన్, ఆఫ్రికాలోని పేద దేశం ఇథియోపియాతోం పాటు జోర్డాన్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సోమాలియా, యెమెన్, అఫ్గానిస్థాన్, నైజీరియా, దక్షిణ సుడాన్, సిరియాలకు 2023లో అత్యధికంగా నిధులు అందాయి.
నిరుడు ఆఫ్రికా దేశాలు రూ.57వేల కోట్లు (6.50 బిలియన్ డాలర్ల) అందుకున్నాయి. ఇప్పుడు ఆఫ్రికా దేశాల్లో హెచ్‌ఐవీ బాధితులకు మందులు అందిస్తున్న వైద్య కేంద్రాలు మూతపడుతున్నాయి.
భారత్ కు క్రమంగా యూఎస్ ఎయిడ్ తగ్గుతోంది. 2001లో 208 మిలియన్ డాల్లర్లు రాగా.. 2023కి 153 మిలియన్ డాలర్లకు, 2024కి 141 మిలియన్ డాలర్లకు పడిపోయింది.
విదేశీ సహాయ నిధుల్లో కోతకు గతంలో అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ట్రంప్ ప్రయత్నించారు. కానీ, అమెరికా చట్టసభల్లో అది చెల్లలేదు. ట్రంప్ మళ్లీ అదే పనికిదిగారు. కానీ, యూఎస్ ఎయిడ్ ను విదేశీ సహాయ చట్టాన్ని అనుసరించి ఏర్పాటు చేశారని.. దాన్ని అడ్డుకోలేరని అమెరికా ప్రతిపక్ష పార్టీ డెమోక్రాట్లు చెబుతున్నారు.