Begin typing your search above and press return to search.

జన్మతః పౌరసత్వం తొలగించిన ట్రంప్... భారతీయులపై ప్రభావం ఎంత?

వలస వచ్చిన వారికి అమెరికాలో పిల్లలు పుడితే.. ఆ చిన్నారులకు అక్కడి పౌరసత్వాన్ని అందించే చట్టాన్ని కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా రద్దు చేశారు.

By:  Tupaki Desk   |   21 Jan 2025 5:13 AM GMT
జన్మతః పౌరసత్వం తొలగించిన ట్రంప్... భారతీయులపై ప్రభావం ఎంత?
X

అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో.. చాలా మంది ఊహించినట్లుగానే, ఎంతో మంది ఆందోళన చెందినట్లుగానే తనదైన షాకింగ్ నిర్ణయలు తీసుకోవడం మొదలుపెట్టారు. తన తొలి ప్రసంగంలో "అమెరికా ఫస్ట్" అనేది తన నినాదమని గుర్తు చేశారు. అనంతరం ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.

అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన ట్రంప్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇది అమెరికాకు వలస వెళ్లినవారికి తగలబోతున్న తొలి దెబ్బ అనే కామెంట్లు వినిపిస్తున్న వేళ.. ఈ నిర్ణయంలో న్యాయపరమైన చిక్కులు ఉన్నాయనే చర్చా మొదలైంది. ఏది ఏమైనా ప్రస్తుతానికి దానికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అయితే జారీ చేసేశారు. అదే... బర్త్ రైట్ సిటిజన్ షిప్ రద్దు!

అవును... వలస వచ్చిన వారికి అమెరికాలో పిల్లలు పుడితే.. ఆ చిన్నారులకు అక్కడి పౌరసత్వాన్ని అందించే చట్టాన్ని కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా రద్దు చేశారు. వాస్తవానికి అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం.. అమెరికా గడ్డపై జన్మించిన పిల్లలకు జన్మతః పౌరసత్వం హక్కు సంక్రమించాల్సి ఉంటుంది.

అయితే... దీనిపై ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ (ఈఓ) జారీ చేశారు. ఈ సందర్భంగా స్పందించిన ఆయన.. అక్రమ వలసదారులకు అమెరికాలో పుట్ట్టే పిల్లలకు లభించే బర్త్ రైట్ సిటిజన్ షిప్ (జన్మతః పౌరసత్వం) ను తమ పెడరల్ ప్రభుత్వం గుర్తించదని అన్నారు. దీంతో... హెచ్1బీ, ఎల్1 వీసాలపై జన్మించిన వారి పిల్లలు ఇకపై యూఎస్ పౌరులుగా పరిగణించబడరు!

ఇదే సమయంలో... ప్రపంచంలో అమెరికా మత్రమే ఇలాంటి పౌరసత్వం అందిస్తోందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే... అది తప్పు! ఎందుకంటే.. ప్రపంచవ్యాప్తంగా సుమారూ 30 దేశాలు ఈ బర్త్ రైట్ సిటిజన్ షిప్ ను అందజేస్తున్నాయి. అదేవిధంగా.. అమెరికాలో 1868లో అంతర్యుద్ధం సమయంలో చేసిన 14వ రాజ్యాంగ సవరణ శరణార్థుల పిల్లలకు జన్మతః పౌరసత్వాన్ని అందిస్తోంది.

ఈ విధానం సుమారు శతాబ్ధకాలంగా అమలులో ఉంది. అక్రమ చొరబాటుదారులకు పుట్టిన పిల్లలతో పాటు టూరిస్ట్, స్టూడెంట్ వీసాపై వచ్చిన వారికి అమెరికాలో పుట్టిన పిల్లలకు ఈ నియమం వర్తిస్తుంది. అయితే.. ఈ విధానాన్ని ట్రంప్ తాజాగా రద్దు చేశారు. వలస విధానంపై తీసుకొనే చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం అని అంటున్నారు.

భారతీయ-అమెరికన్లను ఎలా ప్రభావితం చేస్తుంది?:

అమెరికాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వలస జనాభాలో భారతీయ – అమెరికన్ కమ్యునిటీ ఒకటనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం ఈ కమ్యునిటీపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు. నివేదికల ప్రకారం.. అమెరికాలో సుమారు 4.8 మిలియన్లకు పైగా భారతీయ-అమెరికన్లు నివసిస్తున్నారు.

వీరిలో అత్యధికులు అమెరికాలోనే జన్మించి.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ కారణంగా అమెరికన్ పౌరసత్వాన్ని కలిగి ఉన్నారని చెబుతున్నారు. ఈ సమయంలో ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం పాలసీగా మారితే... హెచ్-1బీ వీసా వంటి తాత్కాలిక ఉద్యోగ వీసాలు లేదా గ్రీన్ కార్డ్ కోసం వేచి ఉన్న భారతీయ పౌరులకు పుట్టిన పిల్లలు ఇకపై యూఎస్ పౌరసత్వాన్ని పొందలేరు!

అంటే... దంపతుల్లో కనీసం ఒక యూఎస్ పౌరుడై ఉన్నవారికి లేదా శాస్వత నివాస హక్కు కలిగి ఉన్న తల్లితండ్రులకు జన్మించిన పిల్లలకు మాత్రమే ఇకపై యూఎస్ పౌరసత్వం జన్మతః సంక్రమిస్తుంది.

ట్రంప్ పై మానవ హక్కుల సంఘం దావా!:

జన్మతః పౌరసత్వానికి ముగింపు పలికిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను ట్రంప్ జారీ చేయడంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్, ఇతర న్యాయవాదులు ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై దావా వేసినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలొస్తున్నాయి.

ఈ సందర్భంగా స్పందించిన అమెరికా న్యాయవాదులు... "మా గడ్డపై జన్మించిన పిల్లలందరూ వారి వారి తల్లితండ్రుల స్థితి, పరిస్థితి, మూలాలతో సంబంధం లేకుండా మా జాతీయ సమాజంలో సమాన సభ్యులుగా జీవితాన్ని ప్రారంభిస్తారు.. ఈ సూత్రం బలమైన అమెరికాను నిర్మించడానికి వీలు కల్పించింది" అని పేర్కొన్నారు!