500 బి.డాలర్లతో ఉక్రెయిన్ పై ట్రంప్ ఉచ్చు.. తిప్పికొట్టిన జెలెన్ స్కీ
వాస్తవానికి 500 బిలియన్ డాలర్ల ఒప్పందం గురించి ట్రంప్ మాట్లాడుతూ.. దీనికి జెలెన్ స్కీ సైతం అంగీకరించారని తెలిపారు.
By: Tupaki Desk | 18 Feb 2025 10:22 AM GMT‘‘ఉక్రెయిన్ కు నాటో సభ్యత్వం కష్టమే..’’, ‘‘రష్యాకు ఆ దేశం కోల్పోయిన భూభాగంపై ఆశలు వదులుకోవాల్సిందే’’.. ఇవీ తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేల్చిన బాంబులు. ఉక్రెయిన్ మీద రష్యా వేసిన బాంబుల కంటే బహుశా ఇవే డేంజరస్ అనాలేమో? ఆయుధాలు, ఆర్థిక సాయంతో మూడేళ్లుగా ఉక్రెయిన్ ను యుద్ధానికి ఎగదోసి ఇప్పుడు తీరా చేతులెత్తేస్తోంది అమెరికా. ఇదే సమయంలో ఉక్రెయిన్ సహజ వనరులపైనా కన్నేసింది ఆ దేశం.
ఉక్రెయిన్ లో అరుదైన భూగర్భ ఖనిజాలున్నాయి. అయితే, వీటిని వెలికితీయడం పెద్ద పని. దీనిని ఆసరాగా చేసుకుని అరుదైన ఖనిజాలను వెలికితీయడానికి ఉక్రెయిన్ కు 500 బిలియన్ డాలర్లు ఇస్తామంటున్నారు ట్రంప్. వీటితో పాటు చమురు, గ్యాస్, పోర్టులు, మౌలిక సదుపాయాలు సహా ఆ దేశంలోని సగం సహజ వనరులపై ఆధిపత్యం ఇవ్వాలని అమెరికా కోరుతోంది. దీనికి ఉక్రెయిన్ ఒప్పుకొంటే ఖనిజ వనరుల వల్ల అమెరికాకు 50 శాతం లాభం చేకూరనుంది.
అమెరికా కోరుతున్న మొత్తం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ, జపాన్ పై విధించిన ఆంక్షల కంటే ఎక్కువట. ఒప్పందం కుదిరితే ఉక్రెయిన్ లో భవిష్యత్ పెట్టుబడి ప్రాజెక్టుల నిబంధనలను నిర్ణయించడంలో అమెరికా నియంత్రణ సాధిస్తుందా. అంటే.. అమెరికా అన్ని ప్రయోజనాలు దక్కుతాయి. అందుకే జెలెన్ స్కీ ఈ డీల్ ను కొట్టిపారేశారట.
వాస్తవానికి 500 బిలియన్ డాలర్ల ఒప్పందం గురించి ట్రంప్ మాట్లాడుతూ.. దీనికి జెలెన్ స్కీ సైతం అంగీకరించారని తెలిపారు. తాము తవ్విన ఖనిజాలను ఉక్రెయిన్ కు అవసరమైన వాటిని అందిస్తామన్నారు. జెలెన్ స్కీ సైతం తమవద్ద అరుదైన ఖనిజ నిల్వలు అధికంగా ఉన్నాయని.. వాటితో అమెరికా కంపెనీలకు లాభాలు చేకూరుతాయని తెలిపారు. ఉక్రెయిన్ లోనూ ఉద్యోగాలు సృష్టించవచ్చని అన్నారు. కానీ, లోతుగా ఆలోచించాక విషయం అర్థమై తిరస్కరించినట్లు తెలుస్తోంది.
ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ సౌదీ అరేబియాలో రష్యాతో శాంతి చర్చలు ప్రతిపాదించారు. అయితే, తాము లేకుండా చర్చలు ఎలాగంటూ జెలెన్ స్కీ మండిపడుతున్నారు.