Begin typing your search above and press return to search.

బైడెన్‌ పై ప్ర‌తీకారం.. ట్రంప్ సంచ‌ల‌న నిర్ణయం!

ఈ క్ర‌మంలో తాజాగా.. ఆయ‌న ప్ర‌తీకార చ‌ర్య‌ల‌కు కూడా దిగిపోయారు. ఈ విష‌యాన్ని ట్రంప్‌ స్వ‌యంగా వెల్ల‌డించారు.

By:  Tupaki Desk   |   8 Feb 2025 2:30 PM GMT
బైడెన్‌ పై ప్ర‌తీకారం.. ట్రంప్ సంచ‌ల‌న నిర్ణయం!
X

అగ్ర‌రాజ్యం అమెరికా నూత‌న అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌.. అధికార ప‌గ్గాలు చేప‌ట్టి.. కేవ‌లం 20 రోజులు కూడా కాక‌ముందే.. త‌న‌దైన శైలిలో దూసుకుపోతూ.. దూకుడు పెంచారు. ప్ర‌పంచ దేశాల‌కు చెందిన అక్ర‌మ వ‌ల‌స దారుల‌పై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇజ్రాయెల్ను స్వాధీనం చేసుకుంటామ‌ని.. ప‌నామా కాలువ‌ను తామే ఉంచుకుంటామ‌ని.. ఇలా రోజుకో విన్యాసంతో ఆయ‌న రెచ్చిపోతున్నారు. ప్ర‌పంచ దేశాల‌పై సుంకాలు వేయ‌డం ద్వారా.. తన పంతం నెగ్గించుకుంటున్నారు.

ఈ క్ర‌మంలో తాజాగా.. ఆయ‌న ప్ర‌తీకార చ‌ర్య‌ల‌కు కూడా దిగిపోయారు. ఈ విష‌యాన్ని ట్రంప్‌ స్వ‌యంగా వెల్ల‌డించారు. ``న‌న్ను ఏడిపించారు. బాధ‌పెట్టారు. కాబ‌ట్టి.. ఇప్పుడు అవ‌న్నీ ఆయ‌న అనుభవించాలి`` అని మాజీ అధ్య‌క్షుడు జో బైడెన్‌ ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పైగా.. `మ‌తిమ‌రుపు మేధావి` అంటూ.. బైడెన్‌ను ఎద్దేవా చేశారు. మాజీ అధ్య‌క్షులకు ఉన్న అధికారాల్లో కోత పెట్టారు. దీనిలో కీల‌క‌మైంది.. దేశ ఇంటెలిజెన్స్ వ్య‌వ‌హారాల‌ను తెలుసుకునే అధికారం. హ‌క్కు.

ఇవి రాజ్యాంగ‌ప‌రంగా.. మాజీ అధ్య‌క్షుల‌కు ద‌క్కేవే. అయితే... 2021లో తాను మాజీ అయిన‌ప్పుడు.. త‌న‌కు ఉన్న ఈ అధికారాన్ని అప్ప‌ట్లో బైడెన్ కోత విధించార‌ని ట్రంప్ తెలిపారు. దీంతో తాను స‌మాజంలో తీవ్ర అవ‌మానానికి, ఆవేద‌న‌కు గుర‌య్యాన‌ని పేర్కొన్నారు. ``దేశ ర‌హ‌స్యాలు తెలుసుకునే అధికారం మాజీ అధ్య‌క్షుడిగా రాజ్యాంగ‌మే ఇచ్చింది. కానీ, అప్ప‌ట్లో ప్ర‌త్యేక ఆదేశాల‌తో నాకు ఉన్న హ‌క్కును కూడా బైడెన్ హ‌రించారు. కాబ‌ట్టి.. ఇప్పుడు నేను ప్ర‌తీకార చ‌ర్య‌ల‌కు దిగితే త‌ప్పేంటి?`` అని ప్ర‌శ్నించారు.

బైడెన్‌ను మ‌తిమ‌రుపు వేదిస్తోంద‌ని.. ఆయ‌న త‌న పేరును కూడా మ‌రిచిపోయిన విష‌యం అమెరిక‌న్ల‌కు తెలుసున‌ని వ్యాఖ్యానించారు. కాబ‌ట్టి.. ఇలాంటి అనారోగ్యంతో బాధ‌ప‌డేవారికి దేశ ర‌హ‌స్యాలు తెలిస్తే.. ప్ర‌మాదం ఖాయ‌మ‌ని.. అందుకే.. ఈ నిర్ణ‌యం తీసుకుంటున్న‌ట్టు పేర్కొన్నారు. దేశ ర‌క్ష‌ణ స‌హా విదేశాంగ వ్య‌వ‌హారాల‌పై రోజు వారి ర‌హ‌స్య బులెటిన్‌ను ఇక‌పై బైడెన్‌కు పంపాల్సిన అవ‌స‌రం లేదంటూ.. త‌న కు ఉన్న ఎగ్జిక్యూటివ్ ప‌వ‌ర్స్‌తో తాజాగా ట్రంప్ నిలుపుద‌ల చేయ‌డం గ‌మ‌నార్హం. దీనిపై డెమొక్రాట్లు ఆచితూచి స్పందిస్తున్నారు.